ఆంధ్రప్రదేశ్ లో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లు బాగాలేవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి బొత్స తీవ్రంగా ఖండించారు. ఎవరో ఏదో ఫోన్ లో చెప్పారంటూ, కేటీఆర్ అలా సభలో మాట్లాడ్డం సరికాదన్నారు. తను స్వయంగా హైదరాబాద్ లో ఉండి వచ్చానని, తను ఉన్న ప్రాంతంలో కరెంట్ లేదంటూ కౌంటర్ వేశారు.
“కేటీఆర్ కు ఆయన ఫ్రెండ్ ఏదో చెప్పాడు. కానీ నేను మాత్రం స్వయంగా హైదరాబాద్ లో ఉండి వస్తున్నాను. అక్కడ అస్సలు కరెంట్ లేదు. ఏపీలో కరెంట్ లేదని కేటీఆర్ కు ఎవరో ఫోన్ లో చెప్పి ఉంటారు. కానీ నేను హైదరాబాద్ లో అనుభవించి వచ్చాను. జనరేటర్ వేసుకోవాల్సి వచ్చింది.”
ఇలా కేటీఆర్ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ వేశారు బొత్స. ఇక రోడ్ల స్థితిగతులపై మాట్లాడుతూ.. ప్రస్తుతం తను రోడ్డుపైనే మీడియాతో మాట్లాడుతున్నానని, కేటీఆర్ వస్తే, తన రాష్ట్రంలో రోడ్లు చూపిస్తానని సవాల్ విసిరారు.
“కేటీఆర్ అలా మాట్లాడ్డం తప్పు. ఆయన రాష్ట్రం గురించి ఘనంగా చెప్పుకోమనండి. మా రాష్ట్రం గురించి అలా మాట్లాడ్డం తప్పు. రోడ్లు బాగాలేవంటున్నారాయన. ఆంధ్రాకు రమ్మనండి, రోడ్లు చూపిస్తాం. కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన భాష మార్చుకోవాలి.”
మొత్తమ్మీద కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవథిలోనే వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఇప్పటికే మల్లాది విష్ణు కౌంటర్ ఇవ్వగా, ఇప్పుడు బొత్స రియాక్ట్ అయ్యారు.