రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తప్పక గెలుస్తుందని మీకూ, నాకూ అందరికీ తెలుసు. ఏ సర్వే చూసినా మూడింట రెండు వంతుల సీట్లు వాళ్లవే అంటున్నారు. రెండు దశాబ్దాలుగా పాలిస్తోంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత రాక తప్పదని అనుకున్నా ప్రజలకు ప్రత్యామ్నాయం చూపగల పార్టీ ఏది? కాంగ్రెసు పార్టీ అక్కడ పూర్తిగా జవసత్త్వాలు ఉడిగి ఉంది. హై స్థాయి నుంచి కింద దాకా నీరసమే. సోనియమ్మకు అనారోగ్యం, రాహుల్‌కు అనాసక్తి, ఎప్పుడేం మాట్లాడతాడో ఎవడికీ తెలియదు. జోకులేసేవారికి, కార్టూన్లు వేసేవారికి మాత్రమే ఫేవరేట్.
అలాటివాడు రాష్ట్రస్థాయి నాయకులకు ఏం స్ఫూర్తి యివ్వగలడు? ఇచ్చినా అందునే దశలో వాళ్లున్నారా? రాష్ట్రస్థాయి అధికారం ఎలా ఉంటుందో రుచి చూసి పాపం 22 ఏళ్లయింది. మోదీ దిల్లీకి వెళ్లిపోయిన ఏడాదిన్నరకు స్థానిక ఎన్నికలు జరిగితే జిల్లా, తాలూకా స్థాయిల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని, మునిసిపల్ కార్పోరేషన్లలో సీట్ల వాటా పెంచుకోవడంతో ఉత్సాహం పుట్టి పార్టీని అంటిపెట్టుకుని వున్నవాళ్లు కూడా యీ మధ్య దిగాలు పడ్డారు.
గతంలో రాష్ట్రస్థాయిలోనే వెలిగిన మోదీ యిప్పుడు దేశస్థాయిలో బాహుబలి అయిపోయాడు. అతని కుడిభుజం అమిత్ షా కూడా గుజరాతీయే. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ముక్త్ భారత్కై కంకణం కట్టుకున్నారు. కొత్తకొత్త ప్రాంతాలకు విస్తరించి, యిప్పటివరకూ బిజెపిని దగ్గరకు రానీయని రాష్ట్రాలలో సైతం పాగా వేస్తున్నారు. ఇక సొంత రాష్ట్రం గుజరాత్‌ను వదులుకుంటారా? అబ్బే, అక్కణ్నుంచి ఒక్క ఎమ్మెల్సీ సీటు కూడా కాంగ్రెసుకు పోనీయకూడదని ఎన్ని పిల్లిమొగ్గలు వేశారు? ఎన్ని మ్యాజిక్కులు చేశారు? ఎంతమందిని తమవైపు గుంజుకున్నారు?
బూత్ మేనేజ్మెంటులో దిట్ట ఐన బిజెపిని ఢీకొనే వ్యవస్థ లేని తమ పార్టీ ఇలాటి పరిస్థితుల్లో బతికి బట్టకట్టడమే అబ్బురం అనుకునే సగటు కాంగ్రెసు నాయకుడికి, కార్యకర్తకు గెలుపుపై ఆశ ఎలా ఉంటుంది? బిజెపికి వ్యతిరేకంగా ఏం పోరాడగలడు? 2012లో కాంగ్రెసులో టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలతో పార్టీ ఆఫీసులోనే తన్నులాడుకున్నారు. కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో ఓటమికి దానికి కారణమనుకున్నారు. టిక్కెట్ల పంపిణీ విషయంలోనే బిజెపికి ఎడ్వాంటేజి ఉంది. కాంగ్రెసు ఫిరాయింపుదార్లను బిజెపి ఎలా తృప్తి పరచగలదని అమాయకంగా అడుగుతున్నారు కొందరు. దేశమంతా బిజెపియే ఉంది. ఏదో రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట పోస్టు యివ్వలేకపోతారా?
గుజరాతీలు మోదీకి తలవంపులు తెచ్చేట్లా బిజెపిని ఎన్నికల్లో ఓడిస్తారా? గతంలో పటేల్ ప్రధాని అయ్యే ఛాన్సు మిస్సయ్యాడనే ఫీలింగు గుజరాతీలలో ఉంది. గాంధీ సిఫార్సుతో యుపి వాడైన నెహ్రూ ఆ ఛాన్సు తన్నుకుపోయాడు. నెహ్రూ తర్వాత సర్వసమర్థుడైన గుజరాతీ మొరార్జీ రెండుసార్లు పోటీపడినా, మళ్లీ యుపి వాళ్లే అయిన లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ ఎగరేసుకుని పోయారు. రాకరాక మొరార్జీకి 1977లో ఛాన్సు వస్తే రెండేళ్లలోనే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. మళ్లీ 35 ఏళ్ల తర్వాత మోదీ రూపంలో ఒక గుజరాతీ ప్రధాని అయ్యాడు. పార్టీ అధ్యక్షుడు కూడా గుజరాతీయే. ఇప్పుడు కేంద్రంలో అంతా గుజరాతీలదే హవా. గుజరాతీలదే కాదు, గుజరాత్లో మోదీ హయాంలో పనిచేసిన యితర ప్రాంతపు అధికారుల హవా కూడా నడుస్తోంది.
గుజరాతీ వ్యాపారస్తులైన అంబానీ, అదానీ వంటి వారి జోరుకి అడ్డూ ఆపూ లేకుండా వుంది. నోట్ల రద్దు సమయంలో గుజరాతీ లెవ్వరూ కలవర పడనక్కరలేని విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఇన్‌కమ్‌టాక్స్ దాడుల్లో, బ్లాక్‌మనీ పట్టివేతల్లో గుజరాత్‌లోని గుజరాతీ కానీ, ముంబయిలో గుజరాతీ కానీ పట్టుబడలేదు. గుజరాత్‌కు యింత మేలు చేస్తున్న మోదీని గుజరాతీలు ఆదరించరా? ఎన్నికల్లో తక్కువ సీట్లు వస్తే అందరూ మోదీని ఎద్దేవా చేస్తారని వారికి తెలియదా? ఆ పరిస్థితి రానిస్తారా? అయినా ఎందుకైనా మంచిదని అమిత్ గుజరాత్ గౌరవ్ అనే పేరుతోనే కాంపెయిన్ నడుపుతున్నారు. 'హూఁ ఛూఁ వికాస్, హూఁ ఛూఁ గుజరాత్' (నేను గుజరాత్‌ను, నేను అభివృద్ధిని అని అర్థం) అని నినాదంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జీతూ వఘాణీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ఐదు వేల కి.మీ.లు కవర్ చేశారు.
గుజరాతీ ఫీలింగు తమవైపు ఉండి, ప్రతిపక్షమే లేనినాడు బిజెపికి నల్లేరుపై బండి నడక లాటిదే కదా! అయినా బిజెపి గుజరాత్ విషయంలో యింత హంగామా ఎందుకు చేస్తోంది? మోదీ గుజరాత్‌కు సెప్టెంబరులో రెండు సార్లు, అక్టోబరులో మూడు సార్లు వెళ్లారు. ఎన్నికలు జరిగే డిసెంబరు 9, 14 తారీకుల్లోపున ఇంకో అరడజను సార్లు వెళ్లడం ఖాయం. అక్టోబరు 16 న మోదీ, షా గాంధీ నగర్లో ఒక మెగా ర్యాలీని నిర్వహించారు. బుల్లెట్ ట్రైన్ అనే 1.10 లక్షల కోట్ల సుదూరస్వప్నాన్ని కళ్లకు కట్టించడానికి జపాన్ ప్రధానిని అహ్మదాబాద్‌కు సెప్టెంబరు 14న లాక్కుని వచ్చారు. అది ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య నడుస్తుంది కాబట్టి ప్రధాన నగరం, దేశ ఆర్థిక రాజధాని ఐన ముంబయిలో కూడా ప్రారంభించవచ్చు.
అక్కడా బిజెపి ప్రభుత్వమే. కానీ అవసరం గుజరాత్లో ఉంది. అందుకే అహ్మదాబాద్ వేదిక ఐంది. అది ఓకే కానీ వేలాది కోట్ల ప్యాకేజీ ఎనౌన్సు చేసేందుకు వీలుగా గుజరాత్ ఎన్నికల ప్రకటనను వాయిదా వేయించారు. ఎన్నికల కమిషనర్ ఓట్ల లెక్కింపు తేదీని ప్రకటించారు కానీ, ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఎందుకంటే తాయిలాలను చూపడానికి కోడ్ అడ్డు రాకూడదని తాపత్రయం. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. వరద సహాయ కార్యక్రమాలకు అడ్డు రాకూడదని.. అని చెప్పుకున్నారు. ఆ కార్యక్రమాలను ఆపాలని ఏ రూలూ చెప్పదు. గత మూడున్నరేళ్లగా తోచని 20 వేల కోట్ల ప్రాజెక్టులు యిప్పుడే గుర్తుకు వచ్చాయి. చాలా ఏళ్లగా ఖాళీగా ఉంచిన 50 నామినేటెడ్ పోస్టులను గబగబా ఫిలప్ చేసేశారు. సరే, యివన్నీ పాలకపక్షాలకు అలవాటే అనుకోండి. అయితే యింత నిస్సిగ్గుగా చేయవలసిన అగత్యం ఏముందా అన్నదే ప్రశ్న.
కొందరనేది ఏమిటంటే – మోదీ పాప్యులారిటీ క్రమేపీ తగ్గుతోందని అంటున్న సమయంలోనే యుపి ఎన్నికల ఫలితం వచ్చి అది నిజం కాదని ఢంకా బజాయించి నిరూపించింది. ఎక్కడో యుపిలోనే అంత రిజల్టు వచ్చినపుడు మోదీ, అమిత్‌ల సొంత రాష్ట్రంలో అద్దర గొట్టకపోతే ఎలా? అనే లెక్కలు వేసి అమిత్ షా 150 సీట్ల టార్గెట్ పెట్టాడు. 1985లో కాంగ్రెసు నెలకొల్పిన రికార్డు 149 కంటె ఎక్కువగా 150 గెలిచి చూపించాలి అని పంతం. 2014 పార్లమెంటు ఎన్నికలలో 182 అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపి గెలిచింది కాబట్టి యిది సాధ్యమే అని అతని అంచనా.
అందుకే యీ ప్రయాస అంటారు. కావచ్చు. మోదీ ముఖ్యమంత్రి అయ్యాక మొత్తం 182 సీట్లలో 2002లో 127 (70%) సీట్లు వచ్చాయి. 2007 నాటికి 10 తగ్గి 64% అయింది. 2012 వచ్చేసరికి యింకో సీటు తగ్గింది. పార్లమెంటు స్థానాలకు వస్తే మొత్తం 26 స్థానాల్లో 2004లో కాంగ్రెసు 44% ఓట్లతో 12 స్థానాలు, 2009లో 43% ఓట్లతో 11 స్థానాలు గెలుచుకుంది. 2014లో మాత్రం ఒక్క సీటూ గెలవలేకపోయినా 33% ఓట్లు తెచ్చుకుంది. గుజరాత్‌ను పరుగులు పెట్టించిన మోదీ ఉన్నపుడే అసెంబ్లీ సీట్లు యిలా తగ్గుతూ వస్తే అక్కడ మోదీ పాలన లేనప్పుడు పరిస్థితి ఏమిటి?
మోదీ వారసురాలిగా వచ్చిన ఆనందీ బెన్ పటేల్ వ్యవహారశైలి పార్టీనే మెప్పించలేదు. పాటీదార్ ఆందోళనను మిస్హేండిల్ చేసింది. అందుకని ఆవిణ్ని మూడేళ్లకే మార్చి విజయ్ రూపాణీని పట్టుకొచ్చారు. ఈయనేదో నెట్టుకు వచ్చేస్తున్నాడు. అయినా ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే సాహసం చేయటం లేదు. మోదీ ముఖ్యమంత్రిగా పాలించినపుడు అధికారాల్ని, పార్టీని మొత్తమంతా తన చేతిలోనే పెట్టుకోవడం చేత తక్కిన మంత్రులందరూ నస్మరంతి గాళ్లయిపోయారు. ప్రజల్లో వాళ్లెవరికీ యిమేజి లేదు. వాళ్ల బలాబలాలు తెలియదు. మోదీకే తెలియాలి.
తెలుసనుకునే ఆనందీ బెన్ను కూర్చోబెడితే ఆ లెక్క తన్నేసింది. అందుకని యీసారి ఎవరి పేరూ చెప్పటం లేదు. మోదీ ఉన్నంతకాలం ముఖ్యమంత్రి ఫలానా అని ప్రచారానికి వెళ్లారు కానీ యిప్పుడు మాత్రం ఎవరి పేరు చెప్పడానికీ ధైర్యం చేయటం లేదు. అయినా ఫర్వాలేదు. ఉత్తర ప్రదేశ్‌లోనే మోదీ పేరు చెప్పి అఖండంగా గెలవగా లేనిది గుజరాత్లో గెలవలేరా?
గుజరాత్లో 42% జనాభా పట్టణాల్లోనే ఉంది. 110 నియోజకవర్గాలు అర్బన్, సెమిఅర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు బిజెపి పక్షానే ఉన్నారు. 2002 నుంచి బిజెపికి 48% ఓట్లు పడితే కాంగ్రెసుకు 38% పడుతున్నాయి. పరిస్థితి తారుమారు కావాలంటే 6% ఓట్లు అటువి యిటు పడాలి. రాష్ట్రంలో 4.30 కోట్ల మంది ఓటర్లుంటే 65% మంది 35 ఏళ్ల లోపు వాళ్లే.
వాళ్లలో 50 లక్షల మంది తొలిసారి ఓటు వేయబోతున్నారు. వాళ్లు పుట్టి బుద్ధెరిగిన దగ్గర్నుంచి బిజెపియే అధికారంలో ఉంది. దీని ప్రత్యామ్నాయం యింతకంటె బాగుంటుందేమోనన్న ఆలోచన వాళ్లలో కలగడంలో ఆశ్చర్యం లేదు. వారిని ఆకట్టుకుని, బిజెపిని చికాకు పెట్టే యువనాయకులు ముగ్గురున్నారని కాంగ్రెసు మురిసింది. ముగ్గురూ మూడు కుల వర్గాలకు చెందినవారు.
1985లో కాంగ్రెసు నాయకుడు మాధవ్ సింహ్ సోలంకీ క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లిములతో కలిపి 'ఖామ్' అనే ఓటు బ్యాంకు తయారుచేసి, అఖండ విజయం సాధించాడు. దాంతో ఒళ్లు మండిన పటేళ్లు అప్పణ్నుంచి బిజెపి పక్షానికి చేరారు. క్రమేపీ బిజెపి కులాలతో సంబంధం లేకుండా హిందూత్వ కార్డుతో గెలవసాగింది. దానికి 22% ముస్లిము ఓట్లు (ముస్లిములలో వ్యాపారవర్గాలైన మేమన్లు, ఖోజాల, బోరీలు బిజెపికే ఓటేస్తున్నారు) కూడా తోడయ్యాయి. ఇప్పుడు కాంగ్రెసు కులాల వారీగా హిందూ సమాజాన్ని చీల్చి లాభపడదామని చూస్తోంది. కులాల ప్రకారం నియోజకవర్గాలను చూస్తే 25% కంటె ఎక్కువ మంది ఎస్సి, ఎస్టి కులాలున్న నియోజకవర్గాలు 30, ఒబిసిలున్నవి 90, పటేళ్లున్నవి 21, ముస్లిములున్నది 16, ఇతరులవి 25. దీని ప్రకారం ఒబిసిలు, పటేళ్లు కలిస్తే 111 సీట్లలో తేడా వచ్చేస్తుంది. అంటే సగం కంటె ఎక్కువ సీట్లన్నమాట.
నియోజకవర్గాల లెక్క వదిలేసి రాష్ట్రం మొత్తం మీద జనాభాలో చూసుకుంటే ఎస్టిలు 15%, ఎస్సిలు 7%, బిసిలు 37% (వీళ్లల్లో సగం మంది క్షత్రియులే), పటేళ్లు 16% (వీళ్లల్లో శాఖలున్నాయి. కడవాలు 6%, లేవాలు 8%, ఇతరులు 2%), ముస్లిములు 10%, యితరులు 10%. ఒబిసిలు, పటేళ్లు కలిస్తే 37 ప్లస్ 16 మొత్తం 53% అంటే దుమ్ము దులిపేయగలరన్నమాట. కానీ కలుస్తారా? మన దగ్గర కాపు రిజర్వేషన్ వ్యవహారం లాటిదే అక్కడా. కాపుల కిస్తే బిసి ఓట్లు పోతాయన్న భయం. అక్కడా రిజర్వేషన్ అడుగుతున్న పాటిదార్లకు యిస్తే బిసిలు దూరమవుతారని భయం. అందుకే రిజర్వేషన్ హామీ యివ్వడానికి బిజెపి, కాంగ్రెసు రెండూ తటపటాయిస్తున్నాయి. ఖామ్ నిర్మాత మాధవ్ సింహ్ సోలంకీ కొడుకు, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు, బిసి ఐన భరత్సింహ్ సోలంకీని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిద్దామంటే పటేళ్లకు కోపం వస్తుందేమోనని కాంగ్రెసుకు భయం. హార్దిక్ పటేల్ ఆందోళన తర్వాత పటేళ్లను చల్లార్చడానికి ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోటా కింద 10% రిజర్వేషన్ యిచ్చింది గుజరాత్ ప్రభుత్వం. అయితే దానివలన సుప్రీం కోర్టు పెట్టిన 49% పరిమితి దాటడంతో ఆ వ్యవహారం కోర్టులో ఉంది.
ముగ్గురు యువనాయకుల్లో హార్దిక్ పటేల్ ఒకడు. బిజెపికి ఎంతో చేసినా ఏమీ లాభం కలగలేదని, రిజర్వేషన్లు కల్పించలేదనే నినాదంతో పాటీదార్ అనామత్ ఆందోళన సమితి (పాస్) పేరుతో సంస్థ ఏర్పాటు చేసి 2015లో ఆందోళన చేసి, పటేల్ యువతను ఆకర్షించాడు. ఆ ఆందోళనలో మరణించిన 10 మంది పటేల్ యువకుల బలిదానం నినాదంగా ముందుకు సాగుతున్న అతన్ని బిజెపి బాగానే వేధించింది. దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు అని కేసు పెట్టి 9 నెలలు జైల్లో పెట్టింది. గుజరాత్లో అడుగు పెట్టకూడదంది.
ఇప్పుడతను దెబ్బ తిన్న పులిలా తయారై బాహాటంగా బిజెపిని తరిమికొట్టమని నినాదం యిచ్చాడు. అధికార పార్టీలో ఉన్న 44 మంది బిజెపి ఎమ్మెల్యేలను, 10 మంది పటేల్ మంత్రులను ఓడించమని కోరుతున్నాడు. అతని సోదరికి మంచి మార్కులు వచ్చినా అహ్మదాబాద్ యూనివర్శిటీలో సీటు రాలేదు. మాకూ రిజర్వేషన్లుంటే యీ అవస్థ ఉండేది కాదు కదా అని అతను అనే మాటలు పటేల్ యువతలో అతనికి ఆదరణ తెచ్చిపెట్టాయి. అయినా పెద్ద తరం పటేళ్లు బిజెపిని వదలకూడదంటున్నారు. హార్దిక్‌కు ఉన్న రాజకీయ బలం ఎంతో తెలియదు. కాంగ్రెసుతో అతని దోస్తీ దోబూచులాట వ్యవహారంగా ఉంది. పాటిదార్లకు రిజర్వేషన్ హామీ యివ్వడానికి కాంగ్రెసు తటపటాయిస్తోంది.
కాంగ్రెసులోంచి శంకర్ సింఘ్ వాఘేలా వెళ్లిపోయి జనవికల్ప్ పార్టీ అని పెట్టినా, దానికి బిజెపి మద్దతు ఉందని అందరికీ తెలుసు. కాంగ్రెసుకు పడే బిసి ఓట్లు చీల్చడానికే వాఘేలా చేత పార్టీ పెట్టించారంటారు. అదే ట్రిక్ ఉపయోగించి ఒకప్పుడు పెద్ద లీడరుగా ఉన్న హార్దిక్ బలాన్ని క్రమేపీ బిజెపి క్షీణింప చేసింది. అతని శ్రేణుల్లో చీలికలు తెచ్చింది. అతను బ్లూ ఫిల్మ్స్ చూశాడనీ, ఒక అమ్మాయితో హోటల్లో ఉన్నాడనీ సిడిలు బయటకు వచ్చాయి. మోదీని వ్యతిరేకించిన వారందరికీ – సంజయ్ జోషీతో సహా – యీ శిక్ష తప్పదు! హార్దిక్ 24 ఏళ్ల కుర్రవాడు. రాజకీయాలు యింకా ఒంటపట్టలేదు. పైగా పటేళ్లల్లో అల్పసంఖ్యాకులైన కడ్వా పటేల్ శాఖకు చెందినవాడు. బిజెపి బలంగా ఉండే సౌరాష్ట్రలో లేవా పటేళ్లు ఎక్కువ. చిన్నాపెద్దా పటేల్ సంస్థలు 38 పుట్టుకుని వచ్చి బిజెపి తమకెంతో చేస్తూ ఉంటే యీ హార్దిక్ ఉత్తిపుణ్యాన గోల చేస్తున్నాడని విమర్శించ సాగాయి.
దానికి తోడు, హార్దిక్ సంస్థలో లుకలుకలు వచ్చేశాయి. అహ్మద్ పటేల్‌ను ఎమ్మెల్సీ కాకుండా ఆపడానికి బిజెపి కాంగ్రెసు ఎమ్మేల్యేలను ఊరించినట్లుగానే అతని సహచరులను కూడా ఊరిస్తోందని అనుమానాలున్నాయి. 'బయటకు వచ్చేయడానికి మాకు బిజెపి కోటి రూ.లు ఆఫర్ చేసింది' అని హార్దిక్ అనుచరులు కొందరన్నారు. వరుణ్ పటేల్, రేశ్మా పటేల్ బిజెపిలో చేరి హార్దిక్‌పై ఆరోపణలు చేశారు. నరేంద్ర పటేల్ అనే అతను బిజెపిలో చేరి మర్నాడే వెనక్కి వచ్చేశాడు. వరుణ్ నాకు కోటి రూ.లు ఆఫర్ చేసి, 10 లక్షలు అడ్వాన్స్‌గా యిచ్చాడు అని ఆరోపించాడు. నిఖిల్ సవాణీ బిజెపిలో చేరిన 15 రోజులకు వెనక్కి వచ్చేశాడు. హార్దిక్ మీటింగులకు జనం బాగా వస్తూండడం చూసి ప్రభుత్వం ఎందుకైనా మంచిదని యిటీవలే పాస్ సంస్థ సభ్యులపై పెట్టిన కేసులు ఎత్తివేసింది.
ఇక ఒబిసి వర్గానికి చెందిన 40 ఏళ్ల అల్పేశ్ ఠాకూర్ క్షత్రియుడు. జనాభాలో ఆ కులంవారు 26% మంది ఉన్నారు. గుజరాత్ ఠాకూర్ సేనా అనే పేర సంస్థ పెట్టి మద్యనిషేధం దృఢంగా అమలు చేయాలంటూ గట్టి పోరాటమే చేశాడు. దానికి ప్రజాదరణ రావడంతో ప్రభుత్వం దిగి వచ్చి 2016లో ఆ చట్టాన్ని పటిష్టం చేయవలసి వచ్చింది. అల్పేశ్ తండ్రి ఖోడాజీ ఠాకూర్ శంకర్ సింఘ్ వాఘేలాతో బాటు 1995లో బిజెపి నుంచి బయటకు వచ్చి కాంగ్రెసులో కలిశాడు. వాఘేలాతో బాటు బయటకు వెళ్లిపోయిన కాంగ్రెసు ఎమ్మెల్యేలలో ఖోడాజీ లేడు. ఇప్పుడు అల్పేశ్ వచ్చి కాంగ్రెసులో చేరాడు. బిసి-ఎస్సి-ఎస్టిలను ఓఎస్ఎస్ ఏక్తా మంచ్ పేర ఒక తాటి కింద తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
మన దగ్గర బిసిల లాగానే అక్కడా పెద్దసంఖ్యలోనే ఉన్నా వాళ్లలో ఐకమత్యం లేదు. మూకుమ్మడిగా ఓట్లేస్తారన్న భరోసా లేదు. ఈ లోగా సామాజిక కార్యకర్తగా ఉంటానన్న అల్పేశ్ యిలా ఓ పార్టీలో చేరడం తప్పంటూ అతని పాత సహచరులు తిరగబడుతున్నారు. దళిత వర్గాలకు చెందిన జిగ్నేశ్ మేవాణీ గురించి చెప్పాలంటే – ఉత్తర గుజరాత్‌లోని 34 ఏళ్ల లాయరు. రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ స్థాపించి ఊనాలో దళితులను గోరక్షకులు హింసించిన నాటి నుంచి ప్రచారంలోకి వచ్చాడు. భూసంస్కరణలు చేపట్టాలి అని డిమాండ్ చేస్తూంటాడు. గుజరాత్లో ఎస్సి జనాభా కేవలం 7% మాత్రమే. వాళ్లకై పెట్టిన 13 రిజర్వ్డ్ నియోజకవర్గాలలో ఎక్కువభాగం బిజెపియే గెలుచుకుంది. అతని ప్రభావమూ తక్కువే.
మనం లెక్కలు వేసుకోవడానికి జనాభాను గ్రూపులుగా విభజించి చూస్తున్నాం కానీ వాళ్లల్లో వాళ్లకే సవాలక్ష ఉపవర్గాలుంటాయి. వాళ్లందరూ కలవడం అనేది ఓ పట్టాన కుదరని పని. బిసిలు రిజర్వేషన్ విషయంలో అటు పటేళ్లతో సామాజిక పరిస్థితుల దృష్ట్యా దళితులతో కలవలేరు. ఈ ముగ్గురినీ కులాల పేరుతో సమీకరించడం కాంగ్రెస్ వలన కాదు. పైగా యీ వర్గాలకు నాయకత్వం వహిస్తున్నవారు మామూలు రాజకీయ నాయకులు కారు. ఆవేశకావేషాలతో ప్రవర్తించేవారు. వారితో బేరసారాలు ఓ పట్టాన కుదరవు. అందుచేత కాంగ్రెసుకు ఏ మాత్రం ఛాన్సు లేదు.
అయినా పాలకపక్షానికి కొన్ని సంకేతాలు యిబ్బందికరంగా మారాయి. రాహుల్ గాంధీ సభ, ప్రసంగం అంటేనే పెద్ద జోక్ అనుకునే యీ రోజుల్లో అక్టోబరు రెండవ వారంలో గుజరాత్లో పర్యటిస్తే జనాలు బాగా వచ్చారు. జులైలో పార్టీ ఫిరాయించిన 14 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలలో ముగ్గురి నియోజకవర్గాల మధ్య ఉన్న ఫగ్వేల్లో సభ పెడితే విపరీతంగా జనం వచ్చారు. గత ఎన్నికలలో మోదీ ముస్లిం వ్యతిరేకత గురించే మాట్లాడే రాహుల్ యీసారి ఆ పల్లవి వదిలిపెట్టి వరసపెట్టి గుళ్లు తిరుగుతున్నాడు. తాను శివభక్తుణ్నని చెప్పుకుంటున్నాడు. భరత్సింహ్ సోలంకీ దేశమంతా గోవధను నిషేధించాలని డిమాండ్ చేశాడు.
మొత్తం మీద చూస్తే బిజెపి గెలుపు ఖాయమని తెలుస్తూనే ఉన్నా, మరి వాళ్లు యింత హంగామా ఎందుకు చేస్తున్నారు? ఇంత ప్రయాస ఎందుకు పడుతున్నారు? కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని నిజం చేయడానికి తొలి విడతగా కాంగ్రెస్ ముక్త్ గుజరాత్‌ను సాధిద్దామనా? దానికి యింత అవస్థ ఎందుకు? కాంగ్రెసు ద్వారా ఏ 30, 35 మందో గెలిస్తే వాళ్లను తమ పార్టీలో చేర్చేసుకోవచ్చుగా. తెలుగు రాష్ట్రాల పాలకుల నుంచి ఆ మాత్రం నేర్చుకోలేరా? మళ్లీ మన ప్రసక్తి ఎందుకు కానీ, అనేక రాష్ట్రాల్లో బిజెపి అదే విద్య ప్రదర్శించింది కదా! నోట్ల రద్దు, జిఎస్టిలతో ఆర్థిక వ్యవస్థను సంస్కరించేశామని చెప్పుకుంటున్న బిజెపి, జిఎస్టిలో భారీగా మార్పులు చేయడానికి, గుజరాత్ ఎన్నికలకు కొందరు ముడిపెడుతున్నారు.
గుజరాత్లో అన్ని కులాల వారూ చిన్నాపెద్దా వ్యాపారాలు చేస్తూనే ఉంటారు. నోట్ల రద్దు, జిఎస్టి వ్యాపార రంగాన్ని కుదేలు చేసిందని, ఆ అసంతృప్తి ఎన్నికలలో ప్రతిఫలించే ప్రమాదం ఉందని భయపడిన బిజెపి సవరింపు చర్యలు చేపట్టిందని వారి ఆరోపణ. ఈ అసంతృప్తి కోపం స్థాయికి చేరి ఉంటే, దాన్ని ఎన్‌క్యాష్ చేసుకోగల బలమైన ప్రతిపక్షం ఉంటే బిజెపికి ముప్పు ఉండేది కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది లేదు. ఒక విషయం మాత్రం యిక్కడ గుర్తించాలి. దేశంలో మోదీ హవా యిలా నడుస్తూండగానే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలగలిపేసి దేశమంతా ఒక్కసారి ఎన్నికలు జరిపేసి మళ్లీ ఐదేళ్ల దాకా ఎవరూ నోరెత్తలేకుండా చేద్దామనే ఆలోచన ఎంత తప్పో అర్థమవుతోంది. గుజరాత్లో అసెంబ్లీ ఎన్నిక రావడం బట్టే కదా, జిఎస్టిలో సవరణలు చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందే మైక్రో ఇరిగేషన్ ఉపయోగించే రైతులకు 18% జిఎస్టి ఎత్తేసింది. ప్రతీ ఆర్నెల్లకు యిలా ఎక్కడో అక్కడ ఎన్నికలు వస్తూంటే ప్రజల గోడు విని, మిడ్కోర్సు కరక్షన్ ప్రక్రియ సాగుతుంది. లేకపోతే భజనగణం, మీడియా, సోషల్ మీడియా కామెంట్స్ చూసి మురుసుకుంటూ తాము చేసిందే కరక్టనుకుంటూ ఐదేళ్లు గడిపేస్తే చాలా అనర్థాలే సంభవిస్తాయి.
ఏది ఏమైనా జిఎస్టి విషయంలో సవరణలు జరిగాయన్నది, ఆర్థికపరమైన యితర అంశాల్లో కూడా అనేక వెసులుబాట్లు గుజరాత్ ఎన్నికల ప్రకటన తర్వాతే యిచ్చారన్నది కళ్లెదురుగా కనబడుతున్న వాస్తవం. గమనించదగిన అంశం. దీన్ని బట్టి చూస్తే నోట్ల రద్దు, జిఎస్టి పారిశ్రామిక రంగం నడ్డి విరిచిందని, ముఖ్యంగా అసంఘటిత రంగంలో వాణిజ్య, కార్మిక వర్గాలు నష్టపోయాయని ప్రతిపక్షాలు అంటున్నది కొంపదీసి నిజమేనా అనిపిస్తోంది. ఎక్కడో ఏదో తేడా కొట్టిందనేది కచ్చితం. మోదీ అభిమానులు 'అదంతా మోదీ వ్యతిరేక ప్రచారం. సూడో సెక్యులర్, హిందూ వ్యతిరేకుల, దేశద్రోహుల వక్రీకరణ' అని కొట్టి పారేయకుండా ఆ చర్యలు దేశ ఆర్థికపరిస్థితిపై చూపిన ప్రభావం గురించి కాస్త సీరియస్‌గా ఆలోచించడం మంచిది.
-ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]