అద్భుతంగా, ఆనందంగా రంకె వేయాల్సిన 'నంది' నవ్వులపాలైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రాష్ట్ర విభజన తరువాత తొలి అడుగులోనే (మొదటిసారిగా ప్రకటించారు) రచ్చ రచ్చగా మారి గౌరవం పోగొట్టుకుంది. వివాదం వచ్చినప్పుడు సహజంగాగా అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఈ అభిప్రాయాలు చెప్పుకోవడానికి, అవి చెప్పే ముసుగులో తిట్టుకోవడానికి టీవీ ఛానెళ్లు, సామాజిక మాధ్యమం వేదికలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్రస్థాయిలో వివాదం జరగడమే కాకుండా కులాల కుమ్ములాటలకూ దారి తీయడంతో 'నంది'పై సినిమా అభిమానుల్లో అభిమానం, గౌరవం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీవీ చర్చల్లో కొంతమంది చెప్పేది వింటుంటే ఇంత రాజకీయం, ఇంత పైరవీలు ఉంటాయా అని ఆశ్చర్యపోయారు సామాన్యులు. ఒకసారి తాను జ్యూరీలో సభ్యుడిగా ఉన్నప్పుడు మొదటి సమావేశంలోనే అవార్డుల కమిటీ వ్యవహరించే తీరు అర్థమైపోవడంతో తాను ఆ తరువాత సభ్యుడిగా ఉన్నా ఏ సినిమా చూడలేదని చంటి అడ్డాల చెప్పారు. ఓ చిత్రానికి సంబంధించిన వ్యక్తి తన సినిమా గురించి కాస్త చూడమని స్కాచ్ బాటిల్ కూడా పంపాడని చెప్పారు. ఓ సీనియర్ నిర్మాత 'రుద్రమదేవి'లో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రకు కేరెక్టర్ ఆర్టిస్టు అవార్డు ఇవ్వడమేంటని ఆగ్రహించారు.
గతంలో అవార్డుల కమిటీ ఛైర్మన్గా చేసిన దర్శకుడు శంకర్, జ్యూరీలో సభ్యులుగా ఉన్న ఇంకొందరు అంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని, ప్రభుత్వానికిగాని, ముఖ్యమంత్రికిగాని ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. ఇలాంటి రచ్చ భవిష్యత్తులో జరగకుండా కొందరు సూచనలు చేశారు. ఇలా అనేక అభిప్రాయాలు చర్చా కార్యక్రమాల్లో వ్యక్తమయ్యాయి. విచిత్రమేమిటంటే ఇప్పటివరకు కులమేమిటో తెలియని కొందరు దర్శకుల, సాంకేతిక నిపుణుల కులాలు ఈ చర్చల్లో బయటకు వచ్చాయి. నంది అవార్డులను కుల రాజకీయాల స్థాయికి దిగజార్చారనేదానికి ఇదో నిదర్శనం.
ఇక సినీ పరిశ్రమ ప్రముఖులు, సినిమా మీడీయా విశ్లేషకులు, ఇతర ఎనలిస్టులు ఎక్కువమంది వ్యక్తం చేసిన అభిప్రాయం ఏమిటంటే…అవార్డులపై ఇంత రచ్చ కావడానికి అసలు కారణం మూడేళ్ల అవార్డులు ఒకేసారి ప్రకటించడమేనని అన్నారు. 2014 అవార్డులు ప్రకటించాక కొంత విరామంతో (సుమారుగా నెల రోజులు) 2015, మళ్లీ విరామంతో 2016 అవార్డులు ప్రకటించి ఉంటే కొద్దిపాటి విమర్శలు, నిరసనలు వచ్చేవితప్ప కులాలవారీగా పరిశ్రమ విడిపోయే పరిస్థితి ఏర్పడి ఉండేది కాదన్నారు. ఏది ఏమైనా నంది అవార్డుల చరిత్రలో ఇదో చీకటి అధ్యాయమేనని చెప్పాలి.
ఇక, నంది అవార్డులు దక్కని చిత్రాల దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, అలాగే అవార్డులు వచ్చినా ఇంకా అన్యాయం జరిగిందని భావించేవారు తెలంగాణ సర్కారు ఇవ్వబోయే 'సింహా' అవార్డుల కోసం ఎదురుచూడాల్సిందే. రాష్ట్ర విభజన తరువాత నంది అవార్డులు ఆంధ్రాకు పరిమితమయ్యాయి. నందిని అంగీకరించని సీఎం కేసీఆర్కు యాదగిరి లక్ష్మీనారసింహ స్వామి గుర్తుకు వచ్చారు. యాదాద్రిని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ దేవుడి పేరులోని 'సింహా' పదాన్ని సినిమా అవార్డులకు నామకరణం చేశారు. నంది ఎంత గంభీరమైందో సింహం కూడా అలాంటిదే కదా. అందులోనూ మృగరాజు కూడా.
ఈ అవార్డులు ఉగాదికి ఇస్తామని గతంలో ప్రకటించారు. ఆ లెక్కన వచ్చే ఉగాదికి ఇవ్వాల్సివుంది. నంది అవార్డుల విషయంలో జరిగిన రచ్చను కేసీఆర్ సర్కారు గమనించింది కాబట్టి అలాంటది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చేమో. ముఖ్యంగా ఆంధ్రా-తెలంగాణ అనే వివాదానికి చోటివ్వకుండా చూడాలి. విమర్శలకు తావులేని విధంగా 'సింహా' గర్జించాలేతప్ప ఇదేం సింహం అనుకోకూడదు. మరి ఈ సర్కారు మూడేళ్లకు కలిపి అవార్డులు ప్రకటిస్తుందా? 2016కే పరిమితం అవుతుందా?