వైసీపీ, టీడీపీ మహిళా నేతల మధ్య గత మూడు రోజులుగా చీరలు, చుడీదార్ల పంచాయతీ జరుగుతోంది. చంద్రబాబునాయుడు, లోకేశ్‌లకు చీరలు, చుడీదార్లు పంపుతామని మంత్రి ఆర్కే రోజా అంటే, కౌంటర్‌గా తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగల పూడి అనిత దీటైన కౌంటర్ ఇచ్చారు. ఈ మహిళా నేతల చీరల పంచాయితీలోకి బీజేపీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రవేశించారు. ఇది ఒకింత ఆశ్చర్యకర పరిణామమే.
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన రాజకీయ దుమారానికి తెరలేపింది. దీనిపై టీడీపీ, వైసీపీ రాజకీయంగా పైచేయి సాధించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. ఇందులో మహిళా కమిషన్ ఒక ఎత్తు వేస్తే, దానికి దీటుగా తెలుగు మహిళ పైఎత్తు వేయడం ఆసక్తికర పరిణామం. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్‌లపై మంత్రి ఆర్కే రోజా చెలరేగిపోయిన సంగతి తెలిసిందే.
సొంతంగా ఎన్నికలకు వెళ్లలేని చంద్రబాబునాయుడు చీర కావాలో, చుడిదార్ కావాలో ఆలోచించుకోవాలని రోజా కోరారు. సొంత కొడుకు లోకేశ్‌ను గెలిపించుకోలేని చంద్రబాబు, అలాగే ఎమ్మెల్యేగా గెలవలేక జగన్‌పై విమర్శలు చేస్తున్న లోకేశ్ చీరలు కట్టుకోవాలని వెటకరించారు. పచ్చ చీర కావాలా? పసుపు చీర కావాలో చెబితే పంపిస్తామయ్యా అని రోజా తనదైన శైలిలో అవహేళన చేశారు.
రోజాకు వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు. మీ సీఎం, మీ జగనన్నకు బ్లూ కలర్ చీర పంపడానికి తమ వాళ్లంతా సిద్ధంగా ఉన్నారని అనిత అన్నారు. జగన్‌కు ఎన్ని చీరలు కావాలో మీరు పంపిస్తారా, తాము పంపాలో చెప్పాలని అనిత డిమాండ్ చేయడం పొలిటికల్ హీట్ పెంచాయి. ఈ చీరల ఎపిసోడ్‌పై జీవీఎల్ నరసింహారావు తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు.
“మంత్రి ఆర్కే రోజా గారూ, టీడీపీ అనిత గారు, రెండు పార్టీలలో మహిళా నాయకురాళ్లుగా వుంటూ చీరలను, చుడీదార్లను లోకువ చేసి మహిళలను కించపరచడం మీకు తగునా? మహిళలను మహిళలే అగౌరవ పరచటం మీకు తప్పనిపించట్లేదా? మహిళలకు మనమిచ్చే గౌరవం ఇదేనా? దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోండి” అని హితబోధ చేయడం విశేషం. జీవీఎల్ హితబోధలు మనసుకు ఎక్కించుకునే పరిస్థితిలో మహిళా నేతలున్నారా?