ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. రాజకీయ పార్టీలు నిజానిజాలతో సంబంధం లేకుండా శవాలపై, ఆడ పిల్లల మానప్రాణాలపై ప్రయోజనాలు పొందాలనే క్రమంలో విలువలకు తిలోదకాలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన వివాహిత హత్య సంచలనం రేకెత్తించింది. ఈమెపై లైంగికి దాడికి పాల్పడి, హత్య చేశారనే ఆరోపణలు మొదట వెల్లువెత్తాయి. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తేల్చి చెప్పారు.
హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఎస్పీ స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్త కొర్రపాటి వెంకట సతీష్ చౌదరి తన కంటే 11 ఏళ్లు పెద్దదైన అదే గ్రామానికి చెందిన బాధితురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఎస్పీ వివరించారు. తన స్నేహితుడు శివసత్య సాయిరామ్ కోరికను కూడా తీర్చాలని ఆమెను వేధించేవాడన్నారు. అందుకు బాధితురాలు అంగీకరించకపోవడంతో శివసత్యసాయిరామ్ ఆమెను దారుణంగా హత్యచేశాడని విచారణలో తేలినట్టు ఎస్పీ వెల్లడించారు.
ఎస్పీ ప్రకటనపై మృతురాలి భర్త ఇవాళ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అక్రమ సంబంధమనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన భార్యపై పోలీసుల ఆరోపణలు దారుణమన్నాడు. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించడం గమనార్హం.
పోస్టుమార్టం చేయకనే లైంగిక దాడి జరగలేదని పోలీసులు ఎలా చెబుతారని అతను ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మృతురాలి భర్త వెనుక టీడీపీ నేతలుండి నాటకాలాడిస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. వాళ్లు చెప్పినట్టు బాధితురాలి భర్త ప్రకటనలు ఇస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.