లై సినిమాతో దారుణమైన ఫలితం చవిచూసినా, హీరో నితిన్ కు ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. మళ్లీ మరోసారి భారీ సినిమా చేయాలని ప్లాన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మెచ్చుకోదగ్గ సంగతి ఏమిటంటే, ఎవరో నిర్మాత మీద బరువు పడేయకుండా, నితిన్ నే ఆ భారీ ఖర్చు పెట్టుకుంటున్నాడని వినికిడి.
ఇటీవలే గరుడవేగ సినిమా హిట్ అయిన తరువాత దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా వుంటుందని నితిన్ ట్వీట్ చేసాడు. వాస్తవానికి వేరే హీరోతో ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేయాలన్నది ప్లాన్. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తనే ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ఓ భారీ సినిమా చేస్తే ఎలా వుంటుందీ అన్నది ఆ ఆలోచనగా తెలుస్తోంది.
ప్రవీణ్ సత్తారుకు అంతటి అవకాశం ఇవ్వడానికి వెనుక కేవలం గరుడవేగ విజయం మాత్రమే కారణం కాదని వినికిడి. ప్రవీణ్ సత్తారు సోదరుడో, మరోకరో నితిన్ కు మాంచి దోస్త్ లంట. ఆ విధంగా ప్రవీణ్ తో బలమైన సాన్నిహిత్యం వుందని తెలుస్తోంది. అందువల్ల నితిన్ మళ్లీ యాభై కోట్ల రిస్క్ కు రెడీ అయిపోతాడేమో? ప్రస్తుతానికి నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. నిర్మాత రాధామోహన్ కు ఓ సినిమా చేయాల్సి వుంది. బహుశా ఆ తరువాత ప్రవీణ్ సత్తారు సినిమా వుంటుందేమో?