2001సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా.. ‘నరసింహనాయుడు’ సినిమాలో బాలకృష్ణ నటనకు గానూ నంది అవార్డు దక్కడంపై విమర్శలు వెల్లువెత్తాయి! ఫక్తు మాస్ మసాలా, యాక్షన్ సినిమా అయిన నరసింహనాయుడులో బాలయ్య ఏం చేశాడని, అవార్డు దక్కింది? అనేది అప్పట్లో ప్రశ్నార్థకంగా నిలిచిన అంశం.
అప్పట్లోనే వినిపించిన మాట.. బావ అధికారంలో ఉన్నప్పుడు బాలయ్యకు ఆ మాత్రం అవార్డులు దక్కవా ఏమిటి? అనేది వినిపించిన సమాధానం. నరసింహనాయుడు సినిమా కమర్షియల్ గా హిట్టైతే అయ్యుండొచ్చు.. కానీ అందులో బాలయ్య నటనకు నందీ అవార్డు దక్కడం మాత్రం విడ్డూరమైన అంశం అనిపించుకుంది. ఆ మాత్రం యాక్షన్ ఎంటర్ టైనర్లు బోలెడన్ని వచ్చాయి.. ఆ సంవత్సరంలో.
మరి బాలయ్యకు అవార్డు ఇస్తే మిగతా సినిమాల పరిస్థితి ఏమిటి? అని క్రిటిక్స్ ప్రశ్నించారు. అయితే అప్పట్లో నందీ అవార్డుల కమిటీ సమాధానం ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మళ్లీ బావ చేతిలో అధికారం, బాలయ్య చేతికి అవార్డు.. అంశంపై తెరపైకి వచ్చింది. ఈ సారి ‘లెజెండ్’కు అవార్డుల పంట పండింది. ఇదంతా.. బావ చేతిలో అధికారం పుణ్యమే అనే మాట గట్టిగా వినిపిస్తోంది.
అప్పట్లో నరసింహనాయుడు ఎలాంటి యాక్షన్ ఎంటర్ టైనరో, లెజెండ్ కూడా అలాంటి యాక్షన్ ఎంటర్ టైనరే. ఇవన్నీ ఫక్తు కమర్షియల్ సినిమాలు. మరి నందీ అవార్డులు ఇలాంటి సినిమాలకే ఇస్తారు, నందీ అవార్డుల స్టాండర్డ్ అని అయినా ఒప్పుకోవాలి.. లేదా బావ చేతిలో అధికారం కాబట్టి బాలయ్యకు అవార్డు అయినా చెప్పాలి! ఇందులో ఏది రైటు?