కేటీఆర్‌కు వైసీపీ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై నోరు పారేసుకోవ‌డం రాజ‌కీయ దుమారానికి తెర‌లేపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రెంట్‌, నీళ్లు, రోడ్లు లేవ‌ని, అదొక న‌ర‌క‌ప్రాంత‌మ‌ని మిత్రుడు చెప్పాడ‌ని కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌పై ఏపీ అధికార పార్టీ…

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై నోరు పారేసుకోవ‌డం రాజ‌కీయ దుమారానికి తెర‌లేపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రెంట్‌, నీళ్లు, రోడ్లు లేవ‌ని, అదొక న‌ర‌క‌ప్రాంత‌మ‌ని మిత్రుడు చెప్పాడ‌ని కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌పై ఏపీ అధికార పార్టీ ఫైర్ అవుతోంది. కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌ల‌పై విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ ఏమ‌న్నారంటే…

“కేసీఆరే పిట్ట‌క‌థ‌లు చెబుతార‌ని అనుకునే వాళ్లం. వాళ్ల‌బ్బాయి కేటీఆర్ పిట్ట‌క‌థ‌లు, హ‌రిక‌థ‌లు కూడా చెబుతార‌ని తెలుస్తోంది. కేటీఆర్ మాట‌లు వింటుంటే భార‌త‌దేశంలోనూ, ప‌క్క రాష్ట్రాల్లోనూ ఎక్క‌డా క‌రెంట్‌, రోడ్లు, నీళ్లు లేన‌ట్టు ….ఒక్క హైద‌రాబాద్‌లోనే ఉన్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చేందుకు  ప్ర‌య‌త్నించార‌ని అనిపించింది. కేటీఆర్‌కు మాట్లాడే హ‌క్కు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. వంద సంవ‌త్స‌రాలుగా హైద‌రాబాద్‌ను మాది అనుకుని కోస్తాంధ్ర ప్ర‌జ‌లు అభివృద్ధి చేస్తే , ఆరేళ్ల క్రితం మీరొచ్చి (కేటీఆర్‌) ఏదో పెద్ద చేస్తున్న‌ట్టు గొప్ప‌లు చెప్పుకుంటున్నారు.

విజ‌య‌వాడ వ‌చ్చి చూస్తే క‌రెంట్‌, రోడ్లు, నీళ్లున్నాయో లేవో తెలుస్తుంది. మాట్లాడే ముందు ఆలోచించాలి. ఇలాంటి మాట‌లు మాట్లాడితే ఇరు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా వుండాల‌ని కోరుకునే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డతాయి. మీ (కేటీఆర్‌) నాన్న పిట్ట‌క‌థ‌లు, క‌ట్టుక‌థ‌లు చెప్పి సోనియా, చంద్ర‌బాబుతో క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను నిట్ట‌నిలువునా చీల్చారు. ఒక‌వైపు ఎక్క‌డున్నా తెలుగు ప్ర‌జ‌లు అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉండాల‌ని మాట్లాడుతూనే, మ‌రోవైపు ప‌క్క రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? కోస్తాంధ్ర ప్ర‌జ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌డం వ‌ల్లే హైద‌రాబాద్ అభివృద్ధి చెందింది. క‌ల్చ‌ర్ నేర్పించింది కోస్తాంధ్ర ప్ర‌జ‌లే” అని మ‌ల్లాది విష్ణు విరుచుకుప‌డ్డారు.

మ‌రో ఏడాదిలో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌నేప‌థ్యంలో ఆంధ్రా, తెలంగాణ అనే సెంటిమెంట్ ర‌గిల్చేందుకు కేటీఆర్ వ్యూహాత్మ‌కంగా తోటి తెలుగు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధోర‌ణి మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని తెలంగాణ ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చెందుతున్నాయి. ఇక‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన ఆవశ్య‌క‌త‌ను తాజా కేటీఆర్ వ్యాఖ్య‌లు హెచ్చ‌రిస్తున్నాయ‌నే అభిప్రాయంలో తెలంగాణ ప్ర‌తిప‌క్షాలు ఉండ‌డం గ‌మ‌నార్హం.