జనతా గ్యారేజ్ టైమ్ లో ఆప్త స్నేహితులు కోరటాల శివ-ఎన్టీఆర్ కలిసి రెండు మొక్కులు మొక్కుకున్నారు. తిరుపతి, భద్రాచలం కలసి వస్తామని. ఒక మొక్కు ఆ మధ్య తిరుపతి వెళ్లి తీర్చేసుకున్నారు. రెండో మొక్కు భద్రాచలం వుండిపోయింది. అది నిన్నటికి నిన్న ఎన్టీఆర్-కొరటాల శివ కలిసి భద్రాచలం వెళ్లి తీర్చేసుకున్నారు.
కొరటాల శివవి కమ్యూనిస్టు భావాలే. అలా అని మరీ నాస్తికుడు కారు. ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా డిఫరెంట్. కాస్త దైవ భక్తి, నమ్మకాలు ఎక్కువే. అది నందమూరి రక్తంలోనే వుంది. అందుకే జనతా గ్యారేజ్ టైమ్ లో అనుకున్నారు.
సినిమా అన్ని విధాలా బాగా వచ్చి, సక్సెస్ అయితే తిరుపతి, భద్రాచలం వెళ్లాలని. కానీ ఆ వెంటనే జై లవకుశ బిజీతో కుదరలేదు. తిరుపతి మొక్కు చెల్లు అయింది కానీ భద్రాచలం వుండిపోయింది.
ఇప్పుడు ఎన్టీఆర్ కు కాస్త ఖాళీ దొరికింది. కొరటాల శివ కూడా తన మహేష్ బాబు సినిమాలో ఓ రోజు గ్యాప్ తీసుకుని వచ్చారు. ఇద్దరూ కలిసి భద్రాద్రి రాముడిని దర్ళించుకు వచ్చారు. ఈ మధ్య ఎన్టీఆర్ చాలా వరకు ఒంటరిగా వెళ్లడం లేదు. సతీ సమేతంగానే వెళ్తున్నారు. ఇక్కడికి కూడా అలాగే వెళ్లారు.