కృష్ణగాడి వీరప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్.. ఇలా వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వచ్చింది పంజాబీ బ్యూటీ మెహ్రీన్. అదే ఊపులో కేరాఫ్ సూర్య కూడా సూపర్ హిట్ అయిపోతుందని అంతా ఊహించారు. 'మెహ్రీన్ టచ్' ఈ సినిమాకు కలిసొస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు మేకర్స్. కానీ మెహ్రీన్ మేజిక్ పనిచేయలేదు.
కేరాఫ్ సూర్య సినిమా ఓ యావరేజ్ మూవీగా నిలిచింది. సుశీంద్రన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో మెరుపులు తక్కువై రొటీన్ వ్యవహారం ఎక్కువైంది. స్టోరీ ఏంటి, హీరో క్యారెక్టర్ ఏంటనే రివ్యూను ఇక్కడ పక్కనపెడితే.. మెహ్రీన్ మాత్రం ఈ సినిమాలో వేస్ట్. కేరాఫ్ సూర్య కథకు మెహ్రీన్ కు అస్సలు సంబంధం లేని సినిమా ఇది.
ఇంకా చెప్పాలంటే పూర్తిగా మెహ్రీన్ పార్ట్ కట్ చేసి చూసినా కేరాఫ్ సూర్యకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కమర్షియల్ టచ్ కోసం హీరోయిన్ ను పెట్టారు తప్పితే మెహ్రీన్ కు పనికొచ్చేదేం లేదిక్కడ. పోనీ చేసిన ఆ 3-4 సీన్లలో అయినా మెహ్రీన్ ఆకట్టుకుందా అంటే అది కూడా లేదు. ఓవరాల్ గా కేరాఫ్ సూర్య సినిమా మెహ్రీన్ కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడకపోగా.. ఆమె జోరుకు బ్రేక్ వేసింది.