సర్వోన్నత న్యాయస్థానంలో ఏపీకి అనుకూల తీర్పు వెలువడింది. తెలుగు అకాడమీ విభజన కేసులో ఏపీ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీకి చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో సహా వారంలోపు ఇవ్వాలని ఆదేశించడం గమనార్హం.
ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్లో తెలుగు అకాడమీ ఏర్పాటు చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా తెలుగు సమాజం విడిపోయింది. అయితే తెలుగు అకాడమీ విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాలు సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోలేదు. దీంతో వ్యవహారం సుప్రీంకోర్టు చేరింది. అకాడమీ విభజన న్యాయ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. తెలుగు రాష్ట్రాలు అకాడమీ పంపకం విషయంలో చర్చించుకుని, పరిష్కారం కాకపోతే రావాలని గత ఏడాది జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం సూచించింది.
సుప్రీంకోర్టు సూచనల ప్రకారం జరగలేదు. ఈ నేపథ్యంలో పలు దఫాలు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్లో ఉన్న రూ.33 కోట్లను 6 శాతం వడ్డీతో సహా ఏపీకి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని ఆదేశించింది. ఏపీకి ఇప్పటికే రూ.92.94 కోట్లు చెల్లించినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
ఇదే సందర్భంలో పిటిషన్ను వెనక్కి తీసుకు నేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సమస్యకు పరిష్కారం లభించినట్టైంది.