జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై కేటీఆర్ ఘాటు కామెంట్స్‌

స్నేహితుడైన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఏపీ ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియాకు ఆయుధంగా మారాయి. హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం ఓ స‌మావేశంలో కేటీఆర్ కీల‌క…

స్నేహితుడైన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఏపీ ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియాకు ఆయుధంగా మారాయి. హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం ఓ స‌మావేశంలో కేటీఆర్ కీల‌క ఉప‌న్యాసం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని విమ‌ర్శ‌లు చేశారు. కేటీఆర్ ఏమ‌న్నారంటే…

“ఏపీలో సొంతూళ్ల‌కు వెళ్లిన నా మిత్రులు చెబుతున్నారు. ఏపీలో క‌రెంట్ లేదు. నీళ్లు లేవు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఏపీలో వుంటే న‌రకంలో ఉన్న‌ట్టే అని చెబుతున్నారు. తెలంగాణ ప్ర‌శాంత‌మైన రాష్ట్రం. దేశంలోనే బెస్ట్ సిటీ హైద‌రాబాద్” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల వైఎస్ ష‌ర్మిల‌పై కూడా కేటీఆర్ విమ‌ర్శ‌లు పెంచిన సంగ‌తి తెలిసిందే.

అన్న‌తో గొడ‌వుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లి చూసుకోవాల‌ని హిత‌వు చెప్పారు. అంతేగానీ, తెలంగాణ‌లో ష‌ర్మిల‌కు ఏం ప‌ని అని ప్ర‌శ్నించడం తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వంపై ఏనాడూ ఏపీ సీఎం, మంత్రులు నెగెటివ్ కామెంట్స్ చేసిన దాఖ‌లాలు లేవు. కానీ తెలంగాణ మంత్రులు మాత్రం అప్పుడ‌ప్పుడు జ‌గ‌న్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రుల‌తో ఏపీ సీఎం జ‌గన్‌, ఇత‌ర మంత్రులు, ఎమ్మెల్యేలు స‌న్నిహితంగా మెలుగుతుంటారు. కానీ తెలంగాణ మంత్రులు మాత్రం ఏదో ర‌కంగా ఏపీ ప్ర‌భుత్వాన్ని దెప్పి పొడుస్తూనే వుంటారు. 

కేటీఆర్ తాజా విమ‌ర్శ‌ల‌పై ఏపీ అధికార పార్టీ స్పందిస్తుందా? లేక తెలంగాణ మంత్రి విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేస్తుందా అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ మంత్రుల ఘాటు వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్‌గా స్పందించ‌ర‌నే ధైర్యంతోనే వాళ్లు న‌ష్టం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆవేద‌న వైసీపీలో ఉంది.