కీర్తి సురేష్ అంటే నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలే అని ఇప్పటికి చేసిన కొద్ది సినిమాలు కూడా ప్రూవ్ చేసారు. అయితే ఆమె లోని ఇన్నోసెంట్ కామెడీ యాంగిల్ ను బయటకు తీస్తున్నారంట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రతి చిన్న విషయానికి, అయిన దానికి, కాని దానికి కూడా 'నాన్నా' అంటూ పలకరించే పాత్రను హీరోయిన్ కీర్తి సురేష్ చేస్తున్నారట. నాన్నను అడిగే విషయమా? అడగకూడని విషయమా? అన్నది కూడా పట్టించుకోకుండా, 'నాన్నా, ఏం చేయమంటారు' అని అడిగే క్యారెక్టర్ అంట.
కీర్తి సురేష్ నే కాదు, మురళీ శర్మ, రావు రమేష్ లవి కూడా మాంచి కామెడీ పాత్రలేనట. అయితే సినిమా అంతా ఫన్ వున్నా, కథ మాత్రం 80ల దశకం నాటి పాత చింతకాయపచ్చడే అని తెలుస్తోంది. మీనా సినిమాను అ..ఆ గా మార్చినట్లు, 80వ దశకంలోని రాఘవేంద్రరావు టైపు సినిమాను, అజ్ఞాతవాసిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. జయసుధ వెనుక వుండి వెంకీ ద్వారా పగ తీర్చుకున్న సినిమా రాఘవేంద్రరావు అందించారు.
అదేమాదిరిగా ఇందులో సవతి తల్లి వెనుక వుండి సవతి కొడుకు పవన్ ద్వారా పగ తీర్చుకుంటుందన్నమాట. విలన్ డెన్, హీరోయిన్లను ఎత్తుకుపోవడం, హీరో వెళ్లి కాపాడడం ఇలా 80ల నాటి సినిమాను గుర్తు చేస్తుందట కథ. కానీ దీనికి త్రివిక్రమ్ తన స్టయిల్ వినోదం, డైలాగులు, క్యారెక్టర్లు అద్ది కొత్తగా అందిస్తున్నారని వినికిడి.