కొత్త కొత్త దర్శకులొస్తున్నారు. సరికొత్త కథలు వస్తున్నాయి. కానీ పాత కాంబినేషన్లు ఇచ్చే కిక్కే వేరు. అలాంటివే కొన్ని పాత కాంబోలు ఫ్రెష్ గా మరోసారి తెరపైకి రాబోతున్నాయి. వీటిలో ఒకటి రానా, శేఖర్ కమ్ముల కాంబినేషన్. రానాను లీడర్ సినిమాతో హీరోగా పరిచయం చేశాడు కమ్ముల. మళ్లీ ఇన్నేళ్లకు రానాతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా లీడర్ సినిమాకు సీక్వెల్ కావడం విశేషం. ప్రస్తుతం ఈ సీక్వెల్ కు సంబంధించి చర్చలు సాగుతున్నాయి.
తెరపైకొస్తున్న మరో పాత కాంబినేషన్ సుకుమార్-మహేష్ బాబు. నిజానికి వీళ్లిద్దరిదీ ఫ్లాప్ కాంబినేషన్. ఈ కాంబోలో గతంలో వచ్చిన వన్-నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ ఇన్నేళ్లకు మహేష్ కోసం మరో స్టోరీలైన్ రాసుకున్నాడు సుకుమార్. దాన్ని మహేష్ కు వినిపించాడు కూడా. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ కు మహేష్ ఓ సినిమా బాకీ ఉన్నాడు. వన్-నేనొక్కడినే సినిమా నిర్మించింది వీళ్లే. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ కాంబినేషన్ యాజ్ ఇటీజ్ గా మరోసారి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ లాంటి ఓల్డ్ కాంబినేషన్ కూడా మరోసారి కలిసింది. శివ, అంతం, గోవింద గోవింద లాంటి సినిమాల తర్వాత.. మళ్లీ ఇన్నేళ్లకు కలిశారు వీళ్లిద్దరు. ఈ నెలలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా ప్రారంభంకానుంది. ఈసారి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు నాగార్జున.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఊహించని మరో కాంబినేషన్ కూడా త్వరలోనే తెరపైకి రానుంది. అదే బాలయ్య, ఎస్వీ కృష్ణారెడ్డి జోడీ. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో గతంలో టాప్ హీరో అనే సినిమా చేశాడు బాలయ్య. మళ్లీ ఇన్నేళ్లకు ఆ దర్శకుడికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడట. ఎవరూ ఊహించని దర్శకుల్ని తెరపైకి తీసుకురావడం బాలయ్య స్టయిల్. సో.. ఎస్వీ కృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చినా ఇవ్వొచ్చు.