సినిమా రంగంలో పిలుపుల సంగతి ఎలా వున్నా, హాజరు మాత్రం చాలా విషయాల మీద ఆధారపడి వుంటుంది. పిలిచిన వారితో అవసరాలు, పిలిచిన వారి స్టేటస్, ఇంకా చాలా చాలా వ్యవహారాలు వుంటాయి. నిన్నటికి నిన్న హీరో రాజశేఖర్ ఇండస్ట్రీ జనాలను చాలా మందిని తన సినిమా గరుడవేగ షో చూడడానికి రమ్మని పిలిచారు.
యూనిట్ జనాలు చెబుతున్న దానిని బట్టి దాదాపు ఇండస్ట్రీలో కీ పర్సన్స్ అందరినీ పిలిచారు. రాజశేఖర్, జీవత, వారి కుమార్తెలు ఇద్దరు సినిమా వాళ్ల నెంబర్లు దగ్గర పెట్టుకుని, పేరు పేరునా ఫోన్ చేసి పిలిచారు. కానీ ప్రయోజనం శూన్యం.
కానీ తీరా చూస్తే షో కు వచ్చిన వాళ్లు ఎవరయ్యా అంటే సాదా సీదా జనాలు మాత్రమే. ఒక్క రాజ్ తరుణ్, దగ్గుబాటి సురేష్ లను తప్పిస్తే, గట్టి వాళ్లు రానే లేదు. బిగ్ బాస్ బ్యాచ్, తరుణ్, ఇలా చోటా మోటా జనాలే ఎక్కువ. టీవీ రంగం నుంచి ఒకరిద్దరు వచ్చారు. వచ్చిన వాళ్లే గొప్పోళ్లు అని, వాళ్లతోనే ఫొటోలకు ఫోజులు ఇచ్చారు రాజశేఖర్ ఫ్యామిలీ.
రాజమౌళి ట్వీట్ ఎక్కడ?
గరుడవేగ సినిమాకు ఆదివారం వెళ్తున్నా అంటూ రాజమౌళి ట్వీట్ చేసాడు. ఆ మేరకు సినిమా చూసారు కూడా. కానీ సినిమా చూసిన తరువాత ట్వీటే లేదు. నచ్చిందో? నచ్చలేదో? మొహమాటానికైనా ఓ ట్వీటు చేయచ్చు కదా? చేయనే లేదు. బాగులేని సినిమా కూడా బాగుందని రాజమౌళి ట్వీట్ చేసిన రోజులున్నాయి. మరి ఇంతో అంతో బాగుందని అందరూ అంటున్న గరుడవేగ సినిమా చూస్తానని ముందే చెప్పి, చూసి కూడా ట్వీట్ చేయలేదేలనో?
ఆర్జీవీ సంగతేమిటి?
రాజశేఖర్ తో పట్టపగలు అనే సినిమా తయారు చేసాడు దర్శకుడు ఆర్జీవీ. ఆ సినిమా సరిగ్గా రాలేదని, ప్రొడక్ట్ నే షెడ్ లో పడేసారు. ఆ సంగతి యాదిలో వుంచుకునైనా, పాపం, రాజశేఖర్ కోసం ఓ ట్వీటు పడేయచ్చుగా. ఆర్జీవీ ఆ పనీ చేయలేదు.