హలో… అక్కినేని అఖిల్ రెండో సినిమా. మనం, ఇష్క్, 24లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన విక్రమ్ కె కుమార్ రూపొందిస్తున్న సినిమా. అన్నపూర్ణ బ్యానర్ లో కాస్త భారీ వ్యయం అవుతున్న సినిమా కూడా ఇదే. సుమారు 40కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయాలన్నది నిర్మాత అక్కినేని నాగార్జున సంకల్పం.
ఆ మధ్య విడుదలపై సందేహాలు వినిపించినా, నాగ్ ఖండించాడు. డిసెంబర్ 22న వస్తున్నాం అన్నాడు. కానీ ఇప్పుడు ఇదే విషయమై నాగ్-విక్రమ్ కుమార్ ల మధ్య కాస్త ఇబ్బంది కర పరిస్థితి నెలకొల్పుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హడావుడి పడి, క్వాలిటీ దగ్గర రాజీ వద్దన్నది విక్రమ్ కుమార్ వాదనగా వున్నట్లు తెలుస్తోంది.
సినిమా బాగానే వస్తోందని, క్వాలిటీ దగ్గర రాజీ ఏమీలేదని, వర్క్ స్పీడప్ చేస్తే సరిపోతుందని, ఇంకా నెలన్నర సమయం వుందన్నది నాగార్జున ఆర్గ్యుమెంట్ గా వినిపిస్తోంది. అయితే విక్రమ్ కుమార్ వర్కింగ్ స్టయిల్ చూస్తే మాత్రం నాగ్ అనుకున్న స్పీడ్ కు మ్యాచ్ కావడం లేదని తెలుస్తోంది.
విక్రమ్ కె కుమార్ ఓ డిఫరెంట్ వర్కింగ్ స్టయిల్ వున్న వ్యక్తి. పని రాక్షసుడే. కానీ మూడ్ ను బట్టి పని వుంటుంది. అందువల్ల డిసెంబర్ 22కు సినిమా ఎలా రెడీ అవుతుందో అన్న చిన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ డేట్ తప్పితే, మళ్లీ సరైన డేట్ దొరకదు అన్నది నాగ్ భయం.
మరోపక్క ఈ వ్యవహారం తెలిసి, యువి సంస్థ తన భాగమతిని చకచకా రెడీ చేస్తోంది. సంక్రాంతికి విడుదల అన్నది ఓ పాయింట్ గా పెట్టుకున్నా, హలో రాకపోతే డిసెంబర్ 22న వేసేయడానికి రెడీ అవుతోంది. అందుకే సంక్రాంతి ఇంకా రెండు నెలల అవతల వున్నా, ఇప్పుడు ఫస్ట్ లుక్ వదులుతోంది. ఇప్పటి నుంచీ స్లోగా బజ్ తీసుకువస్తే, అయితే డిసెంబర్ 22లేకుంటే, సంక్రాంతి అన్న ఆలోచనలో భాగమతి యూనిట్ వుంది.
మరి విక్రమ్ కుమార్ ఏం చేస్తారో? నాగ్ ఎలా పుష్ చేస్తారో చూడాలి.