బాలయ్య ‘జై సింహా’ స్టోరీ పాయింట్ ఇదే!

నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రంగా ఇప్పుడు ‘జై సింహా’ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఎన్నడూ చేయని ఓ విభిన్నమైన కథాంశంతో బాలయ్య ఈ చిత్రం చేస్తున్నారు. బాలయ్య చిత్రం అంటేనే ఫ్యాన్స్…

నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రంగా ఇప్పుడు ‘జై సింహా’ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఎన్నడూ చేయని ఓ విభిన్నమైన కథాంశంతో బాలయ్య ఈ చిత్రం చేస్తున్నారు. బాలయ్య చిత్రం అంటేనే ఫ్యాన్స్ ను ఉర్రూత లూగించడం ప్రధానాంశంగా, మాంఛి మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దడానికి ప్రధానంగా దర్శకులు ఫోకస్ పెడుతూ ఉంటారు. కానీ తాను సెంచరీ కొట్టిన చిత్రం నుంచి బాలయ్య కాస్త ట్రెండ్ మార్చారు. ఫార్ములాను విడిచిపెట్టకుండానే వీలైనంత విలక్షణ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

100వ చిత్రంగా గౌతమీ పుత్ర శాతకర్ణి బాలయ్య కెరీర్ లోనే ఒక విభిన్నమైన చిత్రం. ఆ తర్వాత చేసిన 101- పైసా వసూల్ కూడా కలెక్షన్లు, జయాపజయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. బాలయ్యను అభిమానుల ముందు ప్రొజెక్ట్ చేయడంలో విలక్షణ శైలినే అనుసరించింది.

ఇప్పుడు 102వ చిత్రం.. కథాంశం ఇంకా విలక్షణంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రేమ – అనుబంధాలు- అందులో కుటుంబ విలువలు- త్యాగాలు ఈ తరహా కథాంశంగా ఇది ఉండబోతున్నది. నయనతార, హరిప్రియ నటాషా ఇందులో కథానాయికలుగా చేస్తున్నారు. నయనతార కాంబినేషన్లో ఇప్పటికే బాలయ్య చిత్రాలన్నీ దాదాపుగా హిట్ చిత్రాలే.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రంలో బాలకృష్ణ – నయనతార ప్రేమికులే గానీ.. నయనతార కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరొకరిని పెళ్లి చేసుకుని, వారి భార్యగా జీవిస్తూ ఉంటుంది. బాలకృష్ణకు ఫ్లాష్ బ్యాక్ లో హరిప్రియ భార్యగా ఉంటుంది. కథలో నయనతారకు పిల్లలు కలగరు. బాలకృష్ణ తన భార్య హరిప్రియకు పుట్టిన కొడుకును నయనతారకు ఇచ్చేస్తాడు. ఇలా కుటుంబ విలువలు త్యాగాల మయంగా సినిమా కథాంశం నడుస్తుందని తెలుస్తోంది.

ఈ తరహా కథ బాలయ్య ఫ్యాన్స్ కు కూడా కొత్తే. మరి దర్శకుడు కెఎస్ రవికుమార్.. తన అనుభవంతో ఇలాంటి భిన్నమైన కథను.. ఫార్ములా పాకం చెడకుండా, ఎలా రక్తి కట్టిస్తారో చూడాలి.