హీరో నాగార్జున అంటే ప్రతి ఒక్కరూ కూడా డైరక్టర్స్ హీరో అని అంటూ ఉంటారు. ఆయన అచ్చంగా డైరక్టర్లు హీరో ఎలా ఉండాలని కోరుకుంటారో అలా ప్రవర్తిస్తారని అంతా కితాబులు ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం.. నాగార్జున కు , ఆయన చిన్నొ కొడుకు అఖిల్ చేస్తున్న చిత్రం దర్శకుడు విక్రం కుమార్ కు విభేదాలు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. రిలీజ్ డేట్ ను ముందే ప్రకటించేసి… ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీలోగా పూర్తి చేయాలని నాగ్ ముందే చెప్పినప్పటికీ.. ఆయన హెచ్చరికలను దర్శకుడు విక్రం కుమార్ బేఖాతర్ చేస్తున్నట్లుగా సమాచారం.
విక్రం కె కుమార్.. నాగార్జున ఫ్యామిలీ ప్యాకేజీగా ‘మనం’ చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రంతో వారి వద్ద మంచి మార్కులే కొట్టేశాడు. దాంతో ఎంట్రీ ఫ్లాప్ తో బ్యాడ్ ట్రాక్ రికార్డు ఉన్న అఖిల్ కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యతను నాగార్జున విక్రం కె కుమార్ చేతిలోనే పెట్టారు. నిజానికి ఆయనకు ఇది మంచి అవకాశం అనుకోవాలి. దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి హీరోయిన్ గా , బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కథాంశంతో ఇది రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ చిత్రాన్ని డిసెంబరు 22న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగార్జున ప్రకటించేశారు. ఈ ఏడాదిలో చివరి శుక్రవారం .. ఆ తర్వాత సంక్రాంతి కాంపిటీషన్ మొదలైపోతుంది గనుక.. నాగార్జున బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేట్ ఫిక్స్ చేశారు. దానికి తగ్గట్లు థియేటర్లు కూడా బుక్ చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాల్సిందే అని హెచ్చరించారు.
అయితే డైరక్టర్ విక్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లోగా పూర్తయ్యే అవకాశం లేదని మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా చాలా బాగా వస్తోంది.. అనవసరం గాచెడగొట్టడం అవుతుంది అని చెబుతూ జాప్యం చేస్తున్నారని అనుకుంటున్నారు. ఈ విషయంలో నాగార్జున విక్రం తో తీవ్రంగా విభేదించినట్లు కూడా చెబుతున్నారు. మరి సినిమాను బలవంతంగా రిలీజ్ చేస్తే.. ఫలితం తేడా వస్తే.. నెపం నాగార్జున మీద నెట్టేస్తారేమో అది కూడా గమనించాలి.