ఈ తరానికి అల్లు అర్జున్ అంటే ఎంత క్రేజ్ వుందో, ఆ తరానికి సీనియర్ అర్జున్ అన్నా దాదాపు అంతే క్రేజ్. కన్నడిగ అయిన అర్జున్, తమిళ నాట ప్రవేశించి, అక్కడ నుంచి టాలీవుడ్ లో లెక్కకు మిక్కిలి సినిమాలు చేసాడు. ఇప్పుడు తొలిసారి అల్లు అర్జున్-సీనియర్ అర్జున్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. వక్కంతం వంశీ డైరక్షన్ లో ముస్తాబవుతున్న నా పేరు సూర్య సినిమాలో భారీ స్టార్ కాస్ట్ వుందట.
శరత్ కుమార్, బొమ్మన్ ఇరానీ, సీనియర్ అర్జున్, రావు రమేష్, ఇలా చాలా భారీ తారాగణమే వుంది. ఏదో భారీ సినిమా అని బోలెడు మందిని తీసుకోవడం కాదట, వీళ్లందరికీ సరిపడా పాత్రలు వున్నాయంటున్నారు దర్శకుడు వక్కంతం వంశీ.
ఇప్పటికి నలభై శాతం పూర్తయిన ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని వంశీ ధీమాగా వున్నారు. ఏదో గాలి పోగేసినట్లు కాకుండా, అన్ని విధాలా ఎమోషన్లు, బలమైన సీన్లతో అల్లుకున్న కథ ఇదని, అందువల్ల కచ్చితంగా తన ఫస్ట్ సినిమా తనకు మాంచి పేరు తెస్తుందని వంశీ అంటున్నారు.
నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అంటూ కాస్త హెవీ టైటిల్, ట్యాగ్ లైన్ వున్నా, సినిమాలో ఎంటర్ టైన్ పార్ట్ కు అస్సలు లోపం వుండదట. అల్లు అర్జున్ స్టయిల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మస్తుగా వుంటుందట. ఈ సినిమా మీద ఇంత ధీమా వుండబట్టే కావచ్చు, మహేష్ సినిమా విడుదల చేస్తామని అంటున్నా, తాము కూడా రెడీ అంటున్నారేమో?