నందమూరి తారకరామారావు.. పాలు అమ్మే స్థాయి నుంచి పాలకుడి స్థాయికి ఎదిగిన నాయకుడు. ఆ నాయకుడి నీడన ఎదిగిన సంతానం. దగ్గర దగ్గర డజను మంది. వారందిరకీ ఆయన పంచి ఇచ్చిన ఆస్తులు కోట్లలోనే. ప్రతియేటా ఆయన సమాధి దగ్గర నివాళి అర్పించడం, వీలయితే ఓ పావు పేజీ పత్రికా ప్రకటన ఇవ్వడం. ఇదీ కార్యక్రమం. ప్రభుత్వం కట్టించి ఇచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ సమాధి స్థలి కూడా వుండేది కాదేమో?
ఇప్పుడు ఆ మహానుభావుడి జ్ఞాపకాన్ని కూడా పాతిక కోట్లకు బేరం పెట్టేసారట ఘనత వహించిన ఆయన సంతానం. చెన్నయ్ లో తన సినిమా ప్రస్థాన సమయంలో ఎన్టీఆర్ మూడు దశాబ్దాల పాటు నివసించిన ఇంటిని ఇప్పుడు తనయులు అమ్మకానికి బేరం పెట్టారంట. ఆస్తులు అన్నీ పంచేసినా, అది ఇంకా ఉమ్మడి ఆస్తిగా వుండడంతో, అందరూ కలిసి, ఓ నిర్ణయం తీసుకుని, అమ్మేయాలని డిసైడ్ అయ్యారట. ఆ అమ్మకం బాధ్యత అన్నగారి నటవారసుడు బాలయ్య మీద పెట్టారట. ఇప్పుడు అక్కడ ఫర్ సేల్ అని బోర్డు పెట్టి, నిత్యం ఆసక్తి వున్నవారికి చూపిస్తున్నారట.
పాతిక కోట్లు. ఎన్టీఆర్ తన తనయులకు పంచి ఇచ్చిన ఆస్తి పాస్తులతో పోల్చుకుంటే నథింగ్. బాలయ్య లాంటి వారి ఏడాది సంపాదన. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ కు రెండు సినిమాల పారితోషికం. నిజానికి అందరూ పంచుకుంటే వచ్చేది తలా రెండు మూడు కోట్లు. తండ్రి జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలనుకుంటే వాళ్లు వదులుకోవాల్సింది జస్ట్ తలా రెండు మూడు కోట్లు. రెండు కోట్లు పెద్ద మొత్తమే కావచ్చు. కానీ ఎన్టీఆర్ వారసులు అందరికీ వున్న ఆస్తి పాస్తులతో పోల్చుకుంటే నథింగ్. కానీ ఆ మాత్రం కూడా వదలలేకపోతున్నారు.
పాతిక కోట్లకు ఎన్టీఆర్ జ్ఞాపకాలను అమ్మేసి, తలా కాస్తా తీసేసుకుందాం అనుకుంటున్నారు. కావాలంటే ప్రభుత్వం ప్రజల డబ్బులతో ఆ ఇల్లు కొనేసి వాళ్లకు ఆ డబ్బులు ఇచ్చేసి, స్మారక మందిరంగా మార్చుకోవచ్చు. అంతే కానీ వాళ్లు మాత్రం త్యాగం చేయరు. ఎన్టీఆర్ సమాధి కట్టింది ప్రజల డబ్బులతోనే కదా. ఇప్పుడు ఈ స్మారక మందిరం కూడా అలాగే ప్రజల డబ్బులతో కొనుగోలు చేయడమే. ఇదీ నందమూరి వారసులు తమ వంశ ఉద్దారక మూల పురుషుడికి ఇచ్చే గౌరవం.. ఘనత.. చరిత.