పంచాయతీ ఎన్నికల్లో కుప్పం ఓటర్లు ఇచ్చిన తీర్పు టీడీపీ అధినేత చంద్రబాబు అహంకారాన్ని అణచిందనే అభిప్రాయాలను వ్యక్తమవుతున్నాయి. కుప్పం దెబ్బకు నింగి నుంచి నేల దిగాల్సిన పరిస్థితిని అక్కడి ఓటర్లు తీసుకొచ్చారు. ఓటు ఎంత శక్తిమంతమైందో … చంద్రబాబులో తీసుకొచ్చిన మార్పే నిదర్శనం.
పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ చావు దెబ్బతిన్నది. టీడీపీ అధినేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి ఫలితాలు రచ్చకు దారి తీశాయి. కుప్పంలో చంద్రబాబు పని అయిపోయిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి అయిన అధికార పక్షంపై చంద్రబాబు ఎదురు దాడికి దిగినా ….మనసులో మాత్రం ఏదో తెలియని అలజడి మొదలైంది.
కుప్పం కోటకు బీటలు పడ్డాయని, అప్రమత్తం కాకపోతే మాత్రం అసలుకే ఎసరు వచ్చేలా ఉందనే ఆందోళన చంద్రబాబులో మొదలైంది. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులైన ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్చార్జ్ మునిరత్నం, మనోహర్, ఆంజనేయరెడ్డి తదితర నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. నాలుగు మండలాల్లో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల ఘోర ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తనకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై తప్పుడు సమాచారం ఇచ్చారని నాయకులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కేడర్‌ను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తానే స్వయంగా త్వరలో కుప్పం వస్తానని వారితో అన్నారు.
అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో ప్రత్యక్షంగా తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపడతానని అన్నారు. ఇంతకాలం చంద్రబాబును కలవడం అంటే అందని ద్రాక్ష చందాన కుప్పం నియోజకవర్గ ఓటర్ల పరిస్థితి ఉంది. కానీ ఓటమి అంటే బాబు అనుభవంలోకి తీసుకొచ్చి, అంతటి చంద్రబాబే తమ వద్దకు వచ్చేలా చేయడంలో కుప్పం నియోజకవర్గ ఓటర్లు సక్సెస్ అయ్యారు.