ఫలానా సినిమా ఎందుకు ఒప్పుకున్నావ్ అంటే ముందుగా కథ బాగుందని చెబుతుంటారు హీరోయిన్లు. ఆ తర్వాత బ్యానర్, హీరో లాంటి అంశాల్ని ప్రస్తావిస్తారు. అయితే హీరోయిన్ కేతిక శర్మ మాత్రం ఈ విషయంలో సూటిగా స్పందించింది.
బ్రో సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఒకే ఒక కారణం చెప్పింది. కేవలం పవన్ ను కలవడం కోసమే ఈ సినిమా ఒప్పుకుందంట.
“పవన్ కళ్యాణ్ కోసమే ఒప్పుకున్నాను. ఆయన పేరు వింటే చాలు.. సినిమా ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలు అక్కర్లేదు. నిజానికి సినిమాలో నాకు, పవన్ కళ్యాణ్ కు కాంబినేషన్ సీన్లు లేవు. కానీ ఆయన నటించిన సినిమాలో ఉండడం నాకు సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ ని అంతకుముందు ఎప్పుడూ కలవలేదు. మొదటిసారి ఈ సినిమా ద్వారానే ఆయనను కలిసే అవకాశం లభించింది. అది చాలు నాకు.”
సెట్స్ లో పవన్ ను నేరుగా వెళ్లి కలవడానికి భయపడిందట కేతిక. సాయిధరమ్ తేజ్ ను రిక్వెస్ట్ చేసి, తీసుకెళ్లి పవన్ కు పరిచయం చేశాడట. ఆ రోజు పవన్ తో మాట్లాడిన ఆ 5 నిమిషాలు తనకు మంచి అనుభూతిని ఇచ్చిందంటోంది ఈ బ్యూటీ.
వరుసగా మెగా హీరోలతోనే సినిమాలు చేస్తోంది కేతిక. వైష్ణవ్ తేజ్ తో రంగరంగ వైభవంగా సినిమా చేసింది. పవన్, సాయితేజ్ తో బ్రో అనే సినిమా చేసింది. ప్రస్తుతానికైతే వేరే మెగా హీరో ఎవరితో సినిమా చేయడం లేదని స్పష్టం చేసిన ఈ బ్యూటీ.. ఆహాతో కలిసి ఓ ప్రాజెక్టుకు సైన్ చేసినట్టు వెల్లడించింది.