దివంగంత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అయిదేళ్ళ పాటు అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించి జిల్లా రాజకీయాలను గుప్పెట పట్టిన సీనియర్ నేత కొణతాల రామక్రిష్ణ. ఆయన రాజకీయం 2009 నుంచి ఇబ్బందికరంగా సాగుతోంది. 2009లో రెండవసారి వైఎస్సార్ గెలిచారు. కానీ అనకాపల్లి నుంచి పోటీ చేసిన కొణతాల మంత్రిగా ఉంటూ ఓడారు.
దాంతో ఆయన రాజకీయం ఆగింది. అ తరువాత వైఎస్సార్ మరణంతో జగన్ వైపు వచ్చి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. తన సోదరుడిని 2014లో అనకాపల్లి నుంచి వైసీపీ తరఫున నిలబెట్టినా గెలుపు దక్కలేదు. ఆ మీదట ఆయన వైసీపీ నుంచి వేరుపడ్డారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆ పార్టీకి ప్రచారం చేసి పెట్టారు.
టీడీపీ ఓటమి పాలు కావడంతో ఆయన గత నాలుగేళ్ళుగా రాజకీయనా చురుగ్గా లేరు. 2024లో ఎన్నికల నేపధ్యంలో కొణతాల రామక్రిష్ణ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయన జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని తెలుస్తోంది.
అందుకోసం ఆయన ఈ నెల 20న మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలుసుకుని పార్టీ కండువా కప్పుకుంటారు అని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా కొణతాల పోటీ చేయాలని అనుకుంటున్నారుట . అనకాపల్లి జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన కొణతాల జనసేనను ఆప్షన్ గా చేసుకోవడం విశేషం.
ఆయన ఇప్పటికే కాంగ్రెస్ వైఎస్సార్ కాంగ్రెస్ టీడీపీ లాంటి పార్టీలు మారారు. కాంగ్రెస్ రాజకీయానికి మాత్రమే కొణతాల సరిపడతారు అన్న ప్రచారం ఉంది. ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులు పోకడల పట్ల ఆయన గతంలో కొంత ఇబ్బందులు పడ్డారని, ఇపుడు జనసేన వైపు వెళ్తున్నది నిజంగా నిజమేనా అన్నది కూడా ఆయన అనుచరులతో తర్జన భర్జనగా ఉందని అంటున్నారు.