వర్మ సినీ రాజకీయం.. మతలబు ఏంటట.?

రామ్‌గోపాల్‌ వర్మ అంటే వెండితెర సంచలనం. అసలు సంచలనానికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటే ఆయనే. తనదైన టేకింగ్‌తో వెండితెరపై దర్శకుడిగా ఓ రేంజ్‌లో వెలిగిపోయాడాయన. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా వర్మ ప్రయాణం చాలా…

రామ్‌గోపాల్‌ వర్మ అంటే వెండితెర సంచలనం. అసలు సంచలనానికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటే ఆయనే. తనదైన టేకింగ్‌తో వెండితెరపై దర్శకుడిగా ఓ రేంజ్‌లో వెలిగిపోయాడాయన. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా వర్మ ప్రయాణం చాలా చాలా చాలా ప్రత్యేకం. 'నేను వర్మ హీరోయిన్‌ని' అని చెప్పుకోవడానికి బాలీవుడ్‌ హీరోయిన్లు పోటీ పడేవారు. 'తెలుగులో ఇక సినిమాలు చేయను..' అని ఒకప్పుడు చెప్పిన వర్మ, మళ్ళీ ఇఫ్పుడు తెలుగు సినీ పరిశ్రమలో వాలిపోయారు. 

గతానికీ ఇప్పటికీ వర్మలో చాలా తేడా. అప్పుడు వర్మ సినిమాలు మాట్లాడేవి.. అసలు వర్మ మాట్లాడటమే చాలా అరుదు. కానీ, ఇప్పుడలా కాదు. వర్మ సినిమాలు మాట్లాడ్డంలేదు. వర్మ మాట్లాడుతున్నాడు. సినిమా కంటే, వర్మ మాటలే సంచలనాలవుతున్నాయి. అలా ఆయా సినిమాలకి రిలీజ్‌కి ముందు పబ్లిసిటీ ఉచితంగా దొరుకుతోంది. అంతే, ఆయా సినిమాలు విడుదలయ్యాక ఏమవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

సరిగ్గా ఈ టైమ్‌లో వర్మ, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా ప్రకటించాడు. వర్మ చేసిన సవాలక్ష 'పబ్లిసిటీ' ప్రకటనల్లో ఇదీ ఒకటే అనుకున్నారంతా. అయితే, ఇది ఇంకాస్త 'ఎక్కువ'. సినిమా మాత్రమే కాదు, వర్మ ఈసారి రాజకీయాల్నీ టచ్‌ చేస్తున్నాడు. సినిమా కోసమే టచ్‌ చేస్తున్నాడా.? అంటే, 'అంతకు మించి' అనుకోవాల్సి వస్తోంది. మొన్నామధ్య టీడీపీ నుంచి వచ్చిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చిన వర్మ, ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ బావమరిది అనిల్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

తాజాగా, వర్మ – రేవంత్‌రెడ్డిని 'కాంగ్రెస్‌ బాహుబలి' అనేయడమే కాదు, కాంగ్రెస్‌ మళ్ళీ పుంజుకుంటుందన్న ఆశాబావం వ్యక్తం చేశాడు. చూస్తోంటే, వ్యవహారం అనుమానాస్పదంగానే కన్పిస్తోంది. వర్మ రాజకీయాల్లోకి రాబోతున్నాడా.? అన్న అనుమానాలకు అవకాశం కలుగుతోందిప్పుడు. కాదు, ఇది కూడా ఓ పబ్లిసిటీ స్టంటే అయి వుండొచ్చనేవారూ లేకపోలేదు. ట్విట్టర్‌ పోయి ఫేస్‌బుక్‌ వచ్చె.. అన్నట్టు.. బాలీవుడ్‌ వదిలి టాలీవుడ్‌కి వచ్చినట్లు.. ఏమో, సినిమాల్లోంచి వర్మ, రాజకీయాల్లోకి జంప్‌ చేస్తోనో.! చేయకూడదన్న రూల్‌ లేదుగానీ, రాజకీయాల్లోకి వర్మ వెళితే ఎలా వుంటుందట.? ఆ కిక్కే వేరప్పా.!