సినిమా ఇండస్ట్రీలో మాట అనకుండానే అన్నాడు అనేవాళ్లు బోలెడు మంది. మరి అలాంటిది అన్నాడు అంటే, దాన్ని చిలవలు, పలవలు చేసేవాళ్లు వుంటారు. అందుకే పార్టీల్లో, నలుగురి మధ్యన మాట్లాడకుండా సైలెంట్ గా వుండాలి. కాకుంటే జాగ్రత్తగా మాట్లాడాలి. లేదూ అంటే వ్వవహారాలు తేడా వచ్చేస్తాయి. ఇండస్ట్రీలో ఓ డైరక్టర్ కు ఇదే సమస్య అయిందని రూమర్.
మాంచి పవరున్న స్టార్ తో ఓ సినిమా చేసి, ఆ తరువాత చిన్నా చితక సినిమాలు చేసి, ఆఖరికి అదృష్టం బాగుండి మళ్లీ పెద్ద స్టార్ తో సినిమా చేసారో దర్శకుడు. కానీ తరువాత మళ్లీ సినిమా లేదు ఇంత వరకు. ఓ ఇద్దరు యంగ్ స్టార్ లకు కథ చెబితే, వాళ్లు ముందుగానే ప్రిపేర్ అయిపోయినట్లు, కోరస్ గా సారీ.. నో.. సారీ.. నో అనేసారట. అతగాడితో సినిమా చేయకూడదని వాళ్లు ముందుగానే ఫిక్సయిపోయారని, అందుకే అలా చెప్పేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే తను ఆ మధ్య చేసి, బ్లాక్ బస్టర్ అని చెప్పుకున్న సినిమా తరువాత ఓ సూపర్ స్టార్ తో సినిమా అని గ్యాసిప్ లు వదిలారు. కానీ ఆ సూపర్ స్టార్ కూడా చేసేందుకు సిద్దంగా లేరట. దానికీ కారణం వుందని తెలుస్తోంది. ఓ పార్టీలో సదరు దర్శకుడు పుసుక్కున నోరు జారారని వినికిడి. సదరు సూపర్ స్టార్ బాహుబలి రేంజ్ సినిమా ఆఫర్ చేసినా తాను చేసేది లేదని అన్నారట. అన్నారా? లేదా అన్నది అలా వుంచితే, అన్నారని సదరు సూపర్ స్టార్ కు చేరిపోయింది. దాంతో అక్కడా కట్.
ఇలా ఎక్కడిపడితే అక్కడ కట్ అయిపోతుంటే, ఆఖరికి కొత్తవాళ్లతో చిన్న సినిమా చేసుకోవాలని చూస్తున్నారని వినికిడి.