లక్ష రూపాయలు పెట్టి ఫోన్ ఎవరైనా కొంటారా.. ఫోనుకు లక్ష పెట్టే బదులు, ఆ లక్షతో ఎన్నో చేయొచ్చనే ఆలోచనలే ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి లక్ష రూపాయల ఖరీదు చేసే ఐఫోన్ ఎక్స్ సిరీస్ ఫెయిల్ అవుతుందని అంతా ఊహించారు. కానీ ఆ ఊహలు నిజం కాలేదు. ఫోన్ రేటు లక్ష దాటినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఇండియాలో నిన్న ప్రారంభమైన 'ఎక్స్ సిరీస్' ప్రీ-బుకింగ్ నిమిషాల్లోనే క్లోజ్ అయిందంటే ఐఫోన్ క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 55 దేశాల్లో ప్రీ-బుకింగ్ ప్రారంభిస్తే.. అత్యంత వేగంగా ప్రీ-బుకింగ్ క్లోజ్ అయిన తొలి 5 దేశాల్లో ఇండియా కూడా ఉంది. దీన్ని బట్టి భారత్ లో ధనవంతులు ఎంతమంది ఉన్నారో, ఐఫోన్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
నవంబర్ 3 నుంచి ఐఫోన్ ఎక్స్ అఫీషియల్ గా మార్కెట్లోకి రానుంది. దీని ప్రారంభ ధర 89వేలు. హైఎండ్ మోడల్ ధర లక్షా 2 వేల రూపాయలు. ప్రస్తుతం ఇండియాలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు వివిధ రకాల ఆఫర్లతో ఈ ఫోన్లను అందిస్తున్నాయి. వీటిలో క్యాష్ బ్యాక్, ఎక్స్ ట్రా గ్యారెంటీ లాంటి సదుపాయలు ఉన్నాయి. లేటెస్ట్ మోడల్ లో ఎన్నో అధునాతన ఫీచర్లు జోడించింది ఆపిల్ సంస్థ. అంతేకాకుండా, హోమ్ బటన్ ను తొలిగించి విప్లవాత్మకంగా మార్పుకు శ్రీకారం చుట్టింది.