ఒంగోలు కారు ఘటన, విజయవాడ ఆస్పత్రిలో అత్యాచారం, రుయా ఆస్పత్రిలో డెడ్ బాడీ, గుంటూరు జిల్లాలో మహిళపై రేప్ అండ్ మర్డర్.. ఇలా ఏపీలో వరుసగా జరుగుతున్న ఘటనలన్నీ రాజకీయ రంగు పులుముకున్నాయి. తాజాగా టెన్త్ పేపర్ లీక్ అనే వ్యవహారం కూడా రాజకీయ రంగు పులుముకునేలా ఉంది.
అసలు అది పేపర్ లీక్ కాదని, కుట్ర జరిగిందని అంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పరీక్ష మొదలయ్యే ముందు పేపర్ బయటకు వస్తే దాన్ని లీక్ అంటారని, పరీక్ష మొదలయ్యాక కావాలనే పేపర్ ని బయటకు తెప్పించి ప్రభుత్వంపై బురదజల్లేందుకు చేసిన ప్రయత్నం ఇదని ఆయన మండిపడ్డారు.
బురదజల్లేందుకేనా..?
అప్పట్లో పరీక్షలు కావాలంటే వద్దు వద్దంటూ కోర్టు వరకూ వెళ్లాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు పరీక్షలు పెడుతుంటే.. పేపర్లు లీకయ్యాయంటూ తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయి. కేవలం విద్యార్థులు, తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురి చేయడం కోసమే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ మంత్రి బొత్స ఎల్లో మీడియాపై మండిపడ్డారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఆ మూడు ఛానెళ్లు, రెండు పేపర్లు చూడొద్దంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హితవు పలికారు.
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ రచ్చ చూస్తూనే ఉన్నాం. అందులో దీన్ని కూడా కలిపేయాలని, ప్రభుత్వ అసమర్థత అంటూ విరుచుకుపడాలనేది ప్రతిపక్షాల ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే పరీక్ష మొదలయ్యాక పేపర్లు వాట్సప్ లో చక్కర్లు కొట్టడం, దాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వంపై నిందలు మోపడం, ఆ తర్వాత మీడియాలో హడావిడి.. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టు తెలుస్తోంది.
పైగా నారాయణ, ఎన్నారై స్కూల్స్ కి చెందిన వారు ఈ లీకేజీ కేసుల్లో అరెస్ట్ కావడం మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది. దొంగ ఎప్పుడూ పోలీస్ కంటే తెలివిగా ఉంటాడని చెప్పారు మంత్రి బొత్స. అందుకే తాము మరింత అప్రమత్తంగా ఉంటున్నామని తెలిపారు. కానీ ఇక్కడ దొంగ మరింత తెలివి మీరిపోయాడు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.