మరో రీమేక్.. కొట్టుకుంటున్న పవన్ ఫ్యాన్స్

రీమేక్ తో రీఎంట్రీ షురూ చేసిన పవన్ కల్యాణ్.. ఆ పంథాను అలానే కొనసాగిస్తున్నాడు. తాజాగా మరో రీమేక్ కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని గ్రేట్ ఆంధ్ర చాన్నాళ్ల కిందటే వెల్లడించింది.…

రీమేక్ తో రీఎంట్రీ షురూ చేసిన పవన్ కల్యాణ్.. ఆ పంథాను అలానే కొనసాగిస్తున్నాడు. తాజాగా మరో రీమేక్ కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని గ్రేట్ ఆంధ్ర చాన్నాళ్ల కిందటే వెల్లడించింది. అయితే పవన్ ఫ్యాన్స్ దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ వార్త నిజం కాదని కూడా ట్రెండ్ చేశారు. మరికొందరు తమ హీరోను తిట్టుకున్నారు. ఇప్పుడు తాజా బ్రేకింగ్ ఏంటంటే.. ఈ సినిమాకు జూన్ నుంచి కాల్షీట్లు కేటాయించాడు పవన్ కల్యాణ్. ఇది ఫిక్స్.

ఈసారి మాత్రం పవన్ ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చేసింది. తమ నాయకుడు కమ్ హీరో పవన్ కల్యాణ్ మరో రీమేక్ చేయబోతున్నాడని మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. దీంతో పవన్ ఫ్యాన్స్ రెండు వర్గాలుగా మారి తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఓ వర్గం పవన్ కల్యాణ్ ను సమర్థిస్తుంటే, మరో వర్గం పవన్ ను ఇష్టమొచ్చినట్టు తిడుతోంది.

పార్టీ కోసం, రైతులను ఆదుకోవడం కోసం పవన్ ఇలా రీమేక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారని కొందరు అంటుంటే.. మరికొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం ఫ్లాప్ వస్తుందని భయపడి తమ హీరో ఇలా రీమేక్స్ వెంట పడుతున్నాడని అంటున్నారు. ఓ సినిమా ఇలా పవన్ ఫ్యాన్స్ ను 2 వర్గాలుగా విడగొట్టింది.

పీపుల్ మీడియా, జీ స్టుడియోస్ కాంబినేషన్ లో వినోదాయ శితం రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. జూన్ నుంచి పవన్ కల్యాణ్ కాల్షీట్లు ఇచ్చాడు. ఈలోగా హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేయబోతున్నాడు.

భీమ్లానాయక్ కు అన్నీతానై వ్యవహరించిన త్రివిక్రమ్, వినోదాయ శితం రీమేక్ కు కూడా సంధానకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఆల్రెడీ తమిళ సినిమా కథకు పూర్తిస్థాయిలో మార్పుచేర్పులు చేశాడు. వినోదాయశితంలో సముత్తరఖని కేవలం ఓ పాత్రగా, పాసివ్ గా కనిపిస్తాడు. కానీ తెలుగు రీమేక్ లో పవన్ కు అన్ని మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ హంగులు జోడించాడు త్రివిక్రమ్.

ఇక సాయిధరమ్ తేజ్ పాత్రను కూడా అతడి ఇమేజ్ కు తగ్గట్టు పూర్తిగా మార్చేశాడు. ఇంకా చెప్పాలంటే.. వినోదాయశితం సోల్ మాత్రమే తీసుకున్నారు. ప్లాట్ మొత్తం మార్చేశారు. భీమ్లానాయక్ లో అక్కడక్కడ రీమేక్ ఛాయలు కనిపిస్తాయి. ఈసారి ఆ ఛాయలు మచ్చుకు కూడా కనిపించవు. 

తమిళ వెర్షన్ ను డైరక్ట్ చేసిన సముత్తరఖనికే దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్రివిక్రమ్ పేరును తెరపైకి తీసుకురావడం లేదని టాక్. ఆయన తెరవెనక ఉండి అన్నీ నడిపిస్తారట.