నాడు ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీకి నేడు ఏపీ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం ప్రకటనల రూపం లో వృథా అవుతోంది. ఇదంతా ముమ్మాటికీ వైఎస్ జగన్ అవగాహన రాహిత్యానికి చెల్లిస్తున్న మూల్యమే. తాను అధికారంలోకి వస్తే వారంలోపే సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు చేసి, ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం) పునరుద్ధరిస్తానని ఎన్నికల ప్రచారం లో జగన్ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి వారాలు, నెలలు గడిచిపోయాయి. మూడేళ్ల పాలనా కాలం గడిచింది. 2024లో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని జగన్ సమాయత్తం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి గేర్ మారుస్తానని జగన్ ప్రకటించారు. దుష్టచతుష్టయంతో తలపడేందుకు అంటూ జగన్ దిశానిర్దేశం చేశారు.
సీపీఎస్ రద్దుపై నాన్చివేతకు ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. దాగుడుమూతలకు తెరదించింది. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ పునరుద్ధరిస్తాననే హామీపై వైఎస్ జగన్ చేతులెత్తేశారు. తద్వారా “మాట తప్పను, మడమ తిప్పను” అనే విశ్వసనీయత నినాదానికి తనను తానే గండికొట్టారు. “మాట తప్పదు, మడమ తిప్పదు” అనేది వైఎస్సార్ కుటుంబానికి ఇంత కాలం బ్రాండ్ అంబాసిడర్. ఇది వైఎస్సార్ కాలం నాటి మాట. కానీ నేడు ఆయన తనయుడు జగన్ కాలం నడుస్తోంది. కాలం మారింది. నాయకుడు మారాడు. విశ్వసనీయతకు అర్థం మారింది.
తాను మాట తప్పడమే కాకుండా, ఎందుకలా జరుగుతున్నదో రెండు పేజీల ప్రకటనను సొంత పత్రికలో అచ్చేయడం గమనార్హం. ఉద్యోగులు ఆలోచించాలని ఆ ప్రకటన సారాంశం. తాను హామీ ఇచ్చినట్టు ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం) అమలు చేస్తే భవిష్యత్ తరాలపై మోయలేని భారం పడుతుందని మన దార్శనిక ముఖ్యమంత్రి సెలవిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీపీఎస్ పొందుతున్న లబ్ధి కంటే 70 శాతం ఎక్కువ మేలు జరిగేలా గ్యారెంటీడ్ పెన్షన్ విధానం (జీపీఎస్) తీసుకురానున్నట్టు ఏపీ సర్కార్ ఘనంగా ప్రకటించింది. చాయిస్ ఏంటో మీరే తేల్చుకోవాలని ఉద్యోగుల ముందు రెండు ఆప్షన్లను ప్రభుత్వం పెట్టింది.
గత పాలకులకు కూడా ఈ జఠిల సమస్య తెలుసని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ సమస్య గురించి ఈనాడు పత్రిక రాయదని, ఆంధ్రజ్యోతి అడగదని, టీవీ5 పలకదని రాసుకొచ్చారు. ఈ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొన్నట్టు… మోయలేని భారమని తెలిసే చంద్రబాబు దాని జోలికి వెళ్లలేదు. కానీ సీపీఎస్ రద్దు , ఓపీఎస్ పునరుద్ధరణ హామీ ఇచ్చింది తాననే విషయాన్ని మరిచి, అనవసర విమర్శలు దేనికి? గత పాలకులు ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబించారనే కదా ఘోర పరాజయంతో అధికారం నుంచి కూలదోసింది. గత తప్పుల్ని సరిదిద్దుతాడనే ఆశతోనే కదా జగన్‌కు అధికారం కట్టబెట్టింది. ఇవేవీ జగన్‌కు గుర్తు లేవా?
గతంలో ఉద్యోగులు అడిగినప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సీపీఎస్, ఓపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తామని హామీ ఇచ్చి వుంటే …. ఇప్పుడు ఎవరూ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపేవాళ్లు కాదు కదా? ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, నేడు ఉద్యోగుల పాలిట విలన్ కావడం అంతా జగన్ స్వయంకృతాపరాధమే. తాను మాట తప్పి, ప్రత్యర్థులను విమర్శించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?