70 సీట్ల ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి బిజెపి 5 ఏళ్ల కాలంలో ముగ్గుర్ని ముఖ్యమంత్రులుగా చేసింది. అందువలన సగం సీట్ల కంటె రావనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా 47 వచ్చాయి. అంతకంటె ఆశ్చర్యకరంగా తన యూత్‌ఫుల్ యిమేజితో యీ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ ఓడిపోయాడు. అతనే కాదు, కాంగ్రెసు సిఎం అభ్యర్థి హరీశ్ రావత్, ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి కల్నల్ అజయ్ కొథియాల్ కూడా ఓడిపోయారు. రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి వరుసగా ఏ పార్టీ గెలవలేదు. 2017 కంటె పది సీట్లు తగ్గినా బిజెపి మళ్లీ గెలిచి రికార్డు సాధించింది. దీనికి కారణాలుగా జాతీయ ప్రయోజనాలను కాపాడుతుందనే పేరు రావడం, ఉచిత రేషన్ల పంపిణీ సవ్యంగా నిర్వహించడం, మతపరమైన కేంద్రీకరణ, ఎన్నికలలో పెట్టిన ఖర్చు అని చెప్తున్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగిత, ఉపాధికై రాష్ట్రప్రజలు వలస వెళ్లడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం ప్రధాన సమస్యలు. వాటిని కాంగ్రెసు సొమ్ము చేసుకోలేక పోవడానికి కారణం అసమర్థత, అనైక్యత, కలహించుకునే వృద్ధనాయకత్వం, పోరాటస్ఫూర్తి కొరవడడం. అయినా 2017తో పోలిస్తే 8 సీట్లు ఎక్కువ గెలుచుకుని 19 తెచ్చుకుంది. అధికారంలోకి వచ్చే ఆశ లేదన్న ధీమాయో ఏమో కాంగ్రెసు తన మానిఫెస్టోలో ధారాళంగా వాగ్దానాలు గుమ్మరించింది. 4 లక్షల ఉద్యోగాలు, రూ.500 కే గ్యాస్ సిలండరు, పోలీసు ఫోర్సులో 40% మహిళలకు కేటాయించడం యిత్యాదివి చాలా ఉన్నాయి. బిజెపి తన మానిఫెస్టోలో చార్ధామ్ ప్రాజెక్టును మరింత విస్తృతపరిచి, మరిన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ రోడ్లు నిర్మిస్తామని వాగ్దానం చేసి ఓటర్లను ఆకట్టుకుంది. ఎందుకంటే రాష్ట్రప్రజల్లో చాలామందికి ఉపాధి కల్పించేది రెలిజియస్ టూరిజమే. మోదీ చార్‌ధామ్‌లకు తరచుగా వెళ్లడం బిజెపికి లాభించింది. కాంగ్రెసు యీ దిశగా పెద్దగా క్యాంపెయిన్ చేయలేదు. పైగా ఎన్నికలకు ముందు రూ.17,500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ పనితీరుపై సిఎస్‌డిఎస్-లోకనీతి చేసిన సర్వే ప్రకారం రోడ్ల పరిస్థితి గతంలో కంటె మెరుగైందన్నవారు 60%, చెడిపోయిందన్నవారు 37%, విద్యుత్ పరిస్థితి మెరుగైందన్నవారు 79%, చెడిపోయిందన్నవారు 19%, తాగునీరు పరిస్థితి మెరుగైందన్నవారు 71%, చెడిపోయిందన్నవారు 26%, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగైందన్నవారు 46%, చెడిపోయిందన్నవారు 48%, ఆసుపత్రుల పరిస్థితి మెరుగైందన్నవారు 36%, చెడిపోయిందన్నవారు 57%, రైతుల పరిస్థితి మెరుగైందన్న రైతులు 24%, చెడిపోయిందన్న రైతులు 70% ఉన్నారు.
రాష్ట్ర జనాభాలోని 14% ముస్లింలలో అత్యధికులు హరిద్వార్‌లోనే ఉన్నారు. అక్కడ డిసెంబరు 17-19 మధ్య జరిగిన ధర్మసంసద్‌లో కొందరు హిందూ నాయకులు ముస్లిముల పట్ల ద్వేషం వెళ్లగక్కే ప్రసంగాలు చేసినా, హిందువులు ఆయుధాలు ధరించాలని ఉద్బోధలు చేసినా రాష్ట్రప్రభుత్వం వారి పట్ల చర్యలు తీసుకోకుండా హిందూత్వను రెచ్చగొట్టింది. అదే సమయంలో రాష్ట్రంలో ముస్లిం యూనివర్శిటీ పెడతానని హరీశ్ రావత్ తనకు హామీ యిచ్చాడంటూ రాష్ట్ర కాంగ్రెసు ఉపాధ్యక్షుడు అకిల్ అహ్మద్ మాట్లాడిన వీడియో మెజారిటీ హిందువులకు ఆగ్రహం కలిగించింది. తన ప్రసంగాలలో దాన్ని ప్రస్తావించి మోదీ ఆ ఆగ్రహాన్ని మరింత రెచ్చగొట్టారు. కాంగ్రెసు, రావత్, ముస్లిం యూనివర్శిటీకై ఒప్పుకోలేదు బాబోయ్ అని చెప్పుకున్నా నమ్మేవాడు లేకుండా పోయాడు. ఇంత చేసినా, హరిద్వార్‌లోని 11 స్థానాల్లో బిజెపికి 3 మాత్రమే దక్కాయి.
ఉత్తరాఖండ్‌లో సైనిక కుటుంబాలు ఎక్కువ మంది ఉండడంతో, సైనిక కుటుంబాలు అత్యధికంగా ఉన్న గఢ్వాల్ ప్రాంతంలో 28 సీట్లుండడంతో సైనికులను మేము చక్కగా చూసుకుంటున్నామని బిజెపి ప్రొజెక్టు చేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన అజిత్ దోవల్ యుపిఏ పరిపాలనలోనే ఎదిగినా, బిజెపి అతనికి మరింత అత్యున్నత పదవినిచ్చి, తమవాణ్ని చేసుకుంది. అదే రాష్ట్రానికి చెందిన బిపిన్ రావత్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చేశామని కూడా బిజెపి చూపుకుంది. 2021 డిసెంబరులో రావత్ దుర్మరణం ప్రజలను కదిలించింది. కాంగ్రెసు అతన్ని అవమానించిందంటూ బిజెపి పుకార్లు పుట్టేట్లు చేసింది. దాన్ని తిప్పికొట్టడానికి రాహుల్ గాంధీ ‘‘సైనిక్ సమ్మాన్’’ పేరుతో ర్యాలీ నిర్వహించాడు. దానిలో రావత్ కటౌట్లు, అతనితో పాటు ఆ ప్రమాదంలో మరణించిన వారి కటౌట్లు ఘనంగా పెట్టారు. రావత్ స్వగ్రామం నుంచి ‘వీర్ గ్రామ్ పరిక్రమ యాత్ర’ యాత్ర నిర్వహించారు. వీటివలన కలిగిన లాభం స్వల్పమే అని చెప్పాలి. 3 సీట్లు, 37% ఓట్లు వచ్చాయి. బిజెపికి 24 సీట్లు, 48% ఓట్లు వచ్చాయి.
14 సీట్లున్న కుమావూ ప్రాంతంలో బిజెపికి, కాంగ్రెసుకు చెరో 47% ఓట్లు రాగా సీట్లలో మాత్రం తేడా వచ్చింది. బిజెపికి 9 రాగా, కాంగ్రెసుకు 5 వచ్చాయి. 28 సీట్లున్న తెరాయ్ ప్రాంతంలో బిజెపికి 42% ఓట్లు 14 సీట్లు, కాంగ్రెసుకు 38% ఓట్లు 11 సీట్లు, బియస్పీకి 9% ఓట్లు 2 సీట్లు, ఇండిపెండెంటుకి 1 సీటు వచ్చాయి. ఇండియా టుడే-ఏక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బ్రాహ్మణుల్లో 57% బిజెపికి, 28% కాంగ్రెసుకు వేశారు. తక్కిన ఓసిల్లో 54% బిజెపికి, 33% కాంగ్రెసుకు వేశారు. రాజపుత్రుల్లో 49% బిజెపికి, 36% కాంగ్రెసుకు వేశారు. ఒబిసిల్లో 55% బిజెపికి, 30% కాంగ్రెసుకు వేశారు. ఎస్సీల్లో 34% బిజెపికి, 44% కాంగ్రెసుకు వేశారు. ఎస్టీల్లో 34% బిజెపికి, 59% కాంగ్రెసుకు వేశారు. ఇతరుల్లో 64% బిజెపికి, 19% కాంగ్రెసుకు వేశారు. పురుషుల్లో 42% బిజెపికి, 41% కాంగ్రెసుకు వేయగా, స్త్రీలలో 46% బిజెపికి, 38% కాంగ్రెసుకు వేశారు.
7 నెలలకు ముందు పుష్కర్ ధామీని ముఖ్యమంత్రిగా తీసుకురావడం బిజెపికి లాభించిందని సిఎస్‌డిఎస్-లోకనీతి సర్వే చెప్పింది. గత ముఖ్యమంత్రుల పని తీరు పట్ల పూర్తి సంతృప్తి ఉన్నవారు 11%, ఓ మాదిరి సంతృప్తి 22%, అసంతృప్తి ఉన్నవారు 61% కాగా, ధామీ పని తీరు పట్ల పూర్తి సంతృప్తి ఉన్నవారు 27%, ఓ మాదిరి సంతృప్తి 32%, అసంతృప్తి ఉన్నవారు 32% ఉన్నారు. యువతను ధామీ ఆకట్టుకున్నారనే విషయంలో సందేహం లేదు. కాంగ్రెసు ముసలి ముఖ్యమంత్రులతోనే లాక్కుని వస్తోంది. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెసు వర్కింగు కమిటీలో వృద్ధులందరినీ తీసివేయాలని ప్రతిపాదిస్తే, నీ పని యిలా వుందాని చెప్పి కాంగ్రెసు ప్రశాంత్‌ను తరిమేసి, తన కమిటీలన్నిటినీ వృద్ధులతో నింపేసింది! బిజెపి విజయాలకు, కాంగ్రెసు పరాజయాలకు ఓ కారణం యిక్కడే దొరకటం లేదూ? (ఫోటో – ధామీ ప్రమాణస్వీకారం వేళ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)