సీనియర్‌ ఎన్టీఆర్‌పై సెటైర్ల సినిమా.. ఉలుకు ఎందుకు?

అసలు పట్టాలు ఎక్కుతుందా? అనేది ఒక అనుమానమే. పట్టాలెక్కితే వివాదం అయిపోయి ఆగిపోతుందేమో.. అనేది మరో అనుమానం. ఈ సినిమా కథాంశం మీద ఎన్టీఆర్‌ కుటుంబీకులు ఒక్కటై కోర్టుకు ఎక్కుతారేమో అనేది ఇంకో సందేహం.…

అసలు పట్టాలు ఎక్కుతుందా? అనేది ఒక అనుమానమే. పట్టాలెక్కితే వివాదం అయిపోయి ఆగిపోతుందేమో.. అనేది మరో అనుమానం. ఈ సినిమా కథాంశం మీద ఎన్టీఆర్‌ కుటుంబీకులు ఒక్కటై కోర్టుకు ఎక్కుతారేమో అనేది ఇంకో సందేహం. అంత జరిగి.. వర్మ ఈ కాన్సెప్ట్‌ మీద సినిమాను చక్కగా తీయగలడా? అనేది ఇంకో సందేహం. ఇలా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' వార్తల్లోని అంశంగా నిలుస్తోంది.

ఎన్టీఆర్‌ జీవితకథ ఆధారంగా సినిమాను తీస్తానని ప్రకటించిన వర్మ.. మొదట్లో దాని గురించి ఊరించి చివరకు.. ఎన్టీఆర్‌ జీవితంలో తనకు లక్ష్మీపార్వతి ఘట్టమే బాగా నచ్చిందని అంటూ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించాడు. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. వర్మ ఏదైతే కోరుకున్నాడో అదైతే జరుగుతోంది. వర్మకు కావాల్సింది పబ్లిసిటీ.. అదైతే ఈ సినిమా ప్రకటనతో బోలెడంత దక్కుతోంది. ఇదివరకూ అనంతపురం ఫ్యాక్షన్‌ గొడవల మీద తీసిన 'రక్తచరిత్ర 1,2', విజయవాడ గొడవల మీద తీసిన 'వంగవీటి' కంటే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాతో వర్మ ఎక్కువ పబ్లిసిటీ పొందుతున్నాడు.

ఎందుకంటే.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో బోలెడంత మసాలా ఉంది. ఇప్పుడైతే ఎన్టీఆర్‌ యుగపురుషుడు, దేవుడు.. అని అంటారు కానీ నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబీకులు ఎన్టీఆర్‌ను ఆయన చరమాంక దశలో ఒంటరిని చేశారు. కనీసం పండగరోజు కాస్త పప్పన్నం పంపించే వాళ్లు కూడా కాదు.. అనే ప్రచారం ఉండనే ఉంది. ఎన్టీఆర్‌ జీవితంలోని అలాంటి వ్యాక్యూమే లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించిందని రాజకీయ పరిశీలకులు అంటూ ఉంటారు. అలా ఆ వయసులో తనకు సహాయంగా నిలిచిన ఆమెను ఎన్టీఆర్‌ ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటికే ఆమె మొదటి భర్త నుంచి విడాకులు పొంది ఉంది కాబట్టి.. ఎన్టీఆర్‌కు భార్య అయ్యింది. రాజకీయంగా కూడా చక్రంతిప్పి ఉండవచ్చు.

ఈ విధంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కథలో.. ప్రేమ కథకు అవకాశం ఉంది, పెళ్లి ప్రస్తావనకూ ఛాన్సుంది. అంతేనా.. అప్పటికే కాషాయం కట్టేసి, వివేకానందుడిని, యోగిని అని ప్రకటించేసుకున్న ఎన్టీఆర్‌ భోగిగా మారడం కూడా ఆసక్తిదాయకమైన అంశమే. ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో వెన్నుపోటు అంకం, ఆ సమయంలో ఎన్టీఆర్‌ అరణ్యరోదన, అదే మనసును కలిచివేసి ఆయన మరణించడం.. చరమాంకంలో చంద్రబాబుపై దుమ్మెత్తిపోయాడం, చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చడం, నీతిమాలిన వాడు అని దూషించడం, అందుకు ప్రతిగా బాబు కూడా ఎన్టీఆర్‌పై ధ్వజమెత్తడం. ఎన్టీఆర్‌ను విలువల్లేనివాడిగా చిత్రించడం, ఎన్టీఆర్‌ అవసరం తమకులేదని ప్రకటించడం.. బోలెడంత డ్రామాను పండిస్తాయని చెప్పనక్కర్లేదు.

ఎన్టీఆర్‌ వెన్నుపోటు పొడిచి దించేసిన వాళ్లే.. ఇప్పుడు ఆయనను యుగపురుషుడు అంటారు. ఎన్టీఆర్‌కు విలువల్లేవు అని చెప్పిన వాళ్లే ఇప్పుడు.. ఆయనను దేవుడు అని అంటారు. అయితే ఎన్టీఆర్‌ జీవిత కథ ఏమీ మధ్యయుగం నాటిదికాదు.. మిస్‌ కాన్సెప్షన్స్‌ ఉండటానికి. ఇరవై యేళ్ల కిందటి కథే. కాబట్టి.. ఎన్టీఆర్‌ ఏమన్నాడు, ఎన్టీఆర్‌ను ఎవరేమన్నారు.. అనే అంశాలకు పేపర్‌ క్లిప్పింగులు, నాటి పత్రికల రాతలు.. నిదర్శనాలు!

ఇలాంటి నేపథ్యంలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' గనుక వాస్తవాలను వాస్తవాలుగా చూపి, నేడు జరుగుతున్నదానికి, నాడు జరిగిన దానికి పొంతన లేదని.. విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమ అని.. ఆయనను ఇప్పుడు కీర్తించేవాళ్లే, ఆయన కంటే పెద్దనటులు అని, తమ అధికార దాహం కోసం ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసి పాడె ఎక్కించారని.. చూపగలిగితే.. అది ఈ సినిమా మేకర్ల గట్స్‌కు నిదర్శనం అవుతుంది. అలా జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.

అయితే తెలుగు వాళ్లకు గర్వకారణం.. ఆయన వివేకానందుడితో సమానం.. అని చెప్పేవాళ్లు మనదగ్గరే ఉన్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్‌ రాజకీయ జీవితం అంతా డొల్ల.. అనే వాళ్లూ అదే చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆయా సందర్భాల్లో సినిమాలతోనే వాళ్లంతా తమ తమ వాదనలను వినిపించారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ గనుక వస్తే.. ఇప్పటికే ఎన్టీఆర్‌పై వచ్చిన సెటైరికల్‌ సినిమాల్లో.. ఇదీ ఒకటి అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే ఎన్టీఆర్‌ జీవితం మీద , ఆయన రాజకీయం మీద వ్యంగ్యంగా స్పందిస్తూ వచ్చిన సినిమాలు ఉన్నాయని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. వాటిల్లో ముఖ్యమైనవి 'నా పిలుపే ప్రభంజనం' 'మండలాధీశుడు' 'గండిపేట రహస్యం' తదితరాలు. ఇవన్నీ కూడా అప్పటికి ఇండస్ట్రీలోని కాంగ్రెస్‌ సానుభూతి పరులు రూపొందించినవే. ఈ సినిమాల వెనుక పద్మాలయా ఫిల్మ్స్‌ ఉంది. నటశేఖర కృష్ణ ఈ సినిమాలను రూపొందించే డేర్‌ చేశాడు. నటుడు ప్రభాకర్‌ రెడ్డి హస్తం కూడా ఈ సినిమాల్లో ఉంది.

ఈ సినిమాలు మొదట్లో విడుదల అయ్యాయి.. ఆ తర్వాత వాటి ప్రింట్లు మాయం అయ్యాయి, సీడీల రూపంలో కూడా అందుబాటులో నిలవలేదు చాలాకాలం. అయితే ఇప్పుడు యూట్యూబ్‌ యుగం.. కాబట్టి.. ఈ సినిమాలన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. నేటితరం కూడా వీటిని ఆసక్తితో చూస్తోంది. యూట్యూబ్‌లో వీటికి బాగానే ఉన్నాయి వ్యూస్‌. ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు, రామోజీరావు.. తదితర నిజజీవిత పాత్రలన్నీ ఈ సినిమాల్లో ఉన్నాయి. అప్పటికి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించలేదు. ఈ సినిమాల్లో కథను ఎంతడేర్‌గా చూపించారంటే… చంద్రబాబును ఉద్దేశించినట్టుగా అనిపించే 'ఇంద్రబాబు' పాత్రకు వ్యాంపులతో ఎఫైర్‌ను పెట్టేంత సాహసం చేశారు ఈ సినిమాల మేకర్లు.

ఈ సినిమాలు అప్పటికి, ఇప్పటికీ చర్చనీయాంశంగా నిలిచాయి. వీటిల్లో ఎన్టీఆర్‌ను అనుకరించే ప్రధాన పాత్రలు ఉంటాయి. ఎన్టీఆర్‌ రాజకీయం అంతా డ్రామా.. అనే సందేశాన్ని ఇచ్చాయి ఈ సినిమాలన్నీ. మండలాధీశుడులో నటుడు కోటా శ్రీనివాసరావు ఎన్టీఆర్‌ పాత్రను పోషించాడు. గండిపేట రహస్యంలో నేటి థర్టీ ఇయర్స్‌ పృథ్వీ ఎన్టీఆర్‌గా చేశాడు. ఈ సినిమాలు డైరెక్టుగా ఎన్టీఆర్‌ మీద సంధించిన అస్త్రాలు. ఎన్టీఆర్‌పై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రాలు. ఆ రోజుల్లో కాబట్టి.. ఇలాంటి సినిమాలు రాగలిగాయి. ఈ రోజుల్లో అయితే అలాంటి సినిమాలను రూపొందిస్తే అగ్గిపుడుతుంది. జనాలు బాగా సెన్సిటివ్‌ అయిపోయారీమధ్య. ఈ సినిమాలు వచ్చినప్పుడు ఎన్టీఆరే వాటిని చూసీ చూడనట్టుగా వదిలేశాడట. తనపై అంతంత వ్యంగ్యం విసిరినా.. ఎన్టీఆర్‌ వాటిని లైట్‌గానే తీసుకున్నాడు. ఆ సినిమాల్లో ఎన్టీఆర్‌ పాత్రలను పోషించిన కోటా, పృథ్వీలపై ఆయా సమయాల్లో దాడులు జరిగాయి. అయితే ఎన్టీఆర్‌ ఆ దాడులను వారించాడంటారు.

అయితే తన మీద వ్యంగ్యం పండించినా స్వాగతించిన మనస్తత్వం ఎన్టీఆర్‌కు ఉండింది. అయితే ఇప్పుడు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ను సహించేంత ఓపిక ఎన్టీఆర్‌ వారసుల్లో ఉందా? అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే.. ఎదురులేని మనిషన్న ఎన్టీఆర్‌ జీవితంలో ఆయన కుటుంబీకులే విలన్లు కావడం ఎవరూ ఖండించలేని అంశం. అయితే చనిపోయాకా ఎన్టీఆర్‌ వాళ్లందరికీ దేవుడు. ఇప్పుడు ఆయన జీవితంలో పడిన ఇబ్బందులను, ఎదుర్కొన్న చేదు అనుభవాలను, దానికి కుటుంబీకులే కారణం అయిన వైనాన్ని చూపితే నందమూరి, నారా, దగ్గుబాటి కుటుంబీకులు సహించలేకపోవచ్చు.

ఏదేమైనా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ గనుక తెరపైకి వస్తే.. ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ఆరంభం అయిన దగ్గర నుంచినే  రచ్చ రేగుతుంది. తెలుగుదేశం అభిమానులు ఈ సినిమాపై ఫైర్‌ అవుతారు. రచ్చ రచ్చ అవుతుంది. కోర్టు కేసులు కూడా తప్పకపోవచ్చు. అలాంటి అవాంతరాలన్నీంటినీ దాటుకుని ఈ సినిమా వస్తుందా? లేక ఆగిపోతుందా? అనేది ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అంశంకాదు. ఒకవైపు హిందీలో ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీల మీదే సినిమాలు తీసేస్తున్నారు. అక్కడ ఎమర్జెన్సీ ఎపిసోడ్స్‌ మీద వర్మ శిష్యుడు మధుర్‌ భండార్కర్‌ 'ఇందూ సర్కార్‌' అంటూ సినిమా తీసి వదిలాడు. అది ఫర్వాలేదనిపించుకుంది. వివాదాన్నైతే బాగానే రేపింది. మరి వర్మ పొలిటికల్‌ సినిమా ఏమవుతుందో!