రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెరకెక్కుతోందనగానే అదో సంచలనమై కూర్చుంది. సినిమా టైటిల్ దగ్గర్నుంచి, ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ వరకూ.. అన్నీ వర్మ 'మార్క్' ఇంటెన్సిటీని సంపాదించేశాయి. అయితే, బాలకృష్ణ రూపొందించనున్న ఎన్టీఆర్ సినిమాకి ఎప్పుడైతే దర్శకుడు తేజ పేరు తెరపైకొచ్చిందో సీన్ అప్పుడే మారిపోయింది.
రామ్గోపాల్ వర్మ ఒకప్పుడు సంచలన విజయాలు అందించిన దర్శకుడే కావొచ్చు. కానీ, ఇప్పుడాయనకి అంత సీన్ లేదు. వర్మ చేసే సినిమాలు తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అన్నట్టు తయారైంది వ్యవహారం. ఓ పది సినిమాలు ప్రకటిస్తే, అందులో ఒకటో రెండో అయినా సెట్స్ మీదకు వెళతాయా.? అన్నదీ అనుమానమే. రోజా, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో నటిస్తున్నారట.. అన్న గాసిప్ రాగానే, 'ఆ ఆఫర్ అయితే నాకింకా రాలేదు.. వస్తే, అప్పుడు ఆలోచిస్తా..' అనేశారు రోజా. దాంతో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై పెరిగిన హైప్ పెరిగినట్టే తగ్గిపోయింది.
స్టార్ వాల్యూ అవసరం లేదు.. ఇది రామ్గోపాల్ వర్మ సినిమా.. అనుకోవడానికి వీల్లేదు. అవతల, బాలకృష్ణ రూపంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రకి బోల్డంత స్టార్డమ్ వచ్చేసింది. పైగా, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోందాయె. దర్శకుడిగా వర్మ స్పార్క్ ఎప్పుడో తగ్గిపోయింది, వర్మ శిష్యుడే అయినా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో తేజ ఛమక్కులు చాలానే కన్పిస్తాయి. సో, గురు శిష్యులిద్దరిలోకీ శిష్యుడిదే పై చేయిలా కన్పిస్తోంది.
ఈ నేపథ్యంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి 'స్టార్ గ్లామర్' అద్దాలని వర్మ ప్రయత్నిస్తున్నారట. నిజమేనా.? స్టార్ డమ్ లేకుండా చిన్న చిన్న కథల్ని, చిన్న సినిమాల్నీ నెట్టేయొచ్చు.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అలా కుదరదు కదా.!