‘నిజం చచ్చిపోతుందనే మేం చచ్చిపోలేదు..’

'మా గారాల పట్టిని మేమెలా చంపుకుంటాం.?' అంటూ కన్నీరు మున్నీరయ్యారు ఆరుషి తల్వార్‌ తల్లిదండ్రులు నుపుర్‌, రాజేష్‌ తల్వార్‌. తొమ్మిదేళ్ళ క్రితం 14 ఏళ్ళ ఆరుషి తల్వార్‌ తన ఇంట్లోనే అత్యంత పాశవికమైన హత్యకు…

'మా గారాల పట్టిని మేమెలా చంపుకుంటాం.?' అంటూ కన్నీరు మున్నీరయ్యారు ఆరుషి తల్వార్‌ తల్లిదండ్రులు నుపుర్‌, రాజేష్‌ తల్వార్‌. తొమ్మిదేళ్ళ క్రితం 14 ఏళ్ళ ఆరుషి తల్వార్‌ తన ఇంట్లోనే అత్యంత పాశవికమైన హత్యకు గురైన విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తొలుత ఇది అత్యాచారం, హత్యగా వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత పరువు హత్యగా ప్రచారం జరిగింది. పరువు హత్య నేపథ్యంలోనే ఆరుషి తల్లిదండ్రుల్ని సీబీఐ ప్రత్యేక కోర్టు జైలుకు కూడా పంపింది. 

యావజ్జీవ కారాగార శిక్ష.. అదీ చేయని నేరానికి అనుభవించాల్సి రావడం తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని తాజాగా ఈ కేసులో నిర్దోషులుగా తేలాక, జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరుషి తల్లిదండ్రులు వాపోయారు. 'ఆరోజు, మా కుమార్తె హత్యకు గురైన రోజు.. మేం తల్లిదండ్రులమే ఆమెను చంపామనే ప్రచారం జరిగింది. అప్పుడే మేం ఈ భూమ్మీద జీవించడానికి అనర్హులమని భావించాం. అంతకంటే దారుణమైన మాట ఇంకొకటి వుంటుందా.? కానీ, మేం చనిపోతే ఆ అబద్ధమే నిజమనే ప్రచారం జరుగుతుంది.. అందుకే జీవించి వున్నాం..' అని ఆరుషి తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. 

'ఈ రోజు నిజం గెలిచింది.. మా జీవితాన్ని మాకు ఎవరు తెచ్చిస్తారు.?' అంటూ ప్రశ్నిస్తున్నారు ఆరుషి తల్లిదండ్రులు నుపుర్‌, రాజేష్‌. ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులుగా తేలారు సరే, పనిమనిషి ఆరుషిని చంపాడా.? ఆ పనిమనిషిని చంపిందెవరు.? ఈ ప్రశ్నలు ఇప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. తొమ్మిదేళ్ళ విచారణ తర్వాత కూడా కొండని తవ్వి ఎలకని కూడా పట్టలేకపోయారంటే, విచారణ సంస్థల గురించి ఏం మాట్లాడగలం.? మన న్యాయవ్యవస్థ గురించి ఎలా స్పందించగలం.? అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఆధారాల్లేని ఈ కేసులో విచారణ సుప్రీంకోర్టు మెట్లెక్కినా ఉపయోగం లేదన్నది న్యాయ నిపుణుల వాదన. నిజం, ఆరుషి తల్వార్‌ మరణంతోపాటే చచ్చిపోయింది. మిగిలిన ఆధారాలేమన్నా వుంటే అవి మనిమనిషి హత్యతో మటుమాయమైపోయాయి. సో, ఆరుషి తల్వార్‌ అనే పధ్నాలుగేళ్ళ బాలిక హత్య.. దేశం సిగ్గుపడాల్సిన కేసుల్లో ఒకటిగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందంతే.