ఎక్కడి పోలవరం. మరెక్కడి గోదావరి. ఎక్కడ సిక్కోలు అనబడే శ్రీకాకుళం. కానీ ఏలికలు తలచుకుంటే శివారు జిల్లాలకు ఆ నీరు వచ్చి వరదలా పారదా. ఇది ఒకనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గట్టి సంకల్పం. ఆయన ఉత్తరాంధ్రా జిల్లాల వెనకబాటుతనాన్ని చూసి చలించిపోయారు. అందుకే ఉత్తరాంధ్రా సుజల స్రవంతి పథకన్ని 2009లో ప్రారంభించారు.
ఆ తరువాత ఆయన రెండవసారి అధికారంలోకి వచ్చారు. ఆయన బతికి ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తి అయ్యేది, ఉత్తరాంధ్రా సుజల స్రవంతి కూడా పారుతూ ఆరు జిల్లాలలోనూ పరుగులు తీసేది. కానీ ఇప్పటికి పదమూడేళ్ళు అవుతోంది. ఈ పథకం మాత్రం అలాగే ఉంది. అయిదేళ్ళ చంద్రబాబు ఏలుబడిలో కూడా అడుగు ముందుకు పడలేదు.
లేటెస్ట్ గా ఈ పథకం గురించి జగన్ విశాఖ పర్యటనలో చెప్పుకొచ్చారు. తన తండ్రి కన్న కల ఉత్తరాంధ్రా సుజల స్రవంతి అని ఆయన పేర్కొన్నారు. ఈ పధకాన్ని తాను పూర్తి చేస్తాను అని సబ్బవరంలో జరిగిన సభ సాక్షిగా హామీ ఇచ్చారు.
పోలవరం నీళ్ళను ఉత్తరాంధ్రా అంతటా పారిస్తామని, శ్రీకాకుళానికి ఆ నీళ్ళు తెచ్చి జనాల దాహార్తిని, పొలాల సాగు నీటి కొరతను తీరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
మరి అదే కనుక నిజం అయితే సుజల స్రవంతి ద్వారా గోదారమ్మ సిక్కోలు పరుగులు పెడితే నీరు లేక ఎండుతున్న పోలాలను అభిషేకిస్తే నేలతల్లి పులకించిపోదా. ఆ రోజు కోసం అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. నాన్న వైఎస్సార్ కన్న కలను కచ్చితంగా జగన్ నిజం చేస్తారని కూడా భావిస్తున్నారు.