మెగాస్టార్…మెగా పవర్ స్టార్…టాప్ డైరక్టర్..ఈ కాంబినేషన్ సినిమాకు టికెట్ లు తెగకపోవడం ఏమిటి? అఖండ, పుష్ప, భీమ్లా, వీటికి కనిపించిన జోరు ఆచార్యకు ఎందుకు కనిపించడం లేదు.
శని, ఆదివారాలకు టికెట్ లు అలాగే వుండడం ఏమిటి? ఇదీ టాలీవుడ్ జనాలను తొలిచేస్తున్న ప్రశ్న. దీనికి రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి.
ప్రాజెక్ట్ స్టేల్ అయిందని, సినిమా తెరమీద పడ్డాక టాక్ బట్టి పుంజుకుంటుందని ఇలా ఎవరికి తోచిన. సమాధానం వారు చెబుతున్నారు.
కానీ సినిమా ట్రేడ్ అనలిస్ట్ లు మాత్రం, నక్సల్స్ సినిమా అనే కలర్ ఇవ్వడమే ఆచార్య ట్రేడ్ కు మైనస్ గా మారుతోందని అంచనా వేస్తున్నారు.
ఆది నుంచీ మెగాస్టార్ చిరంజీవిని నక్సల్ గెటప్ లోనే చూపిస్తూ వచ్చారు. అంతకు మించి సినిమాకు కలర్ లేదు. రామ్ చరణ్ ఎంట్రీ తరువాత అతగాడికి కూడా నక్సల్ గెటప్ లోనే చూపిస్తున్నారు.
భలే భలే బంజరా పాట కూడా హీరోలు ఇద్దరూ నక్సల్స్ గెటప్ లోనే. దీంతో ఇదేదో నక్సలైట్ బ్యాక్ డ్రాప్ సినిమా అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. నీలాంబరి పాట చాలా అందంగా పిక్చరైజ్ చేసారు. అందులో చరణ్, పూజా ఇద్దరూ బాగున్నారు.
ఆ గెటప్ లను ఎక్కువగా ప్రచారంలోకి తీసుకురాలేదు. సానా కష్టం అనే పాటలో కూడా చిరు గెటప్ మారలేదు. ఇలాంటి వ్యవహారాలే సినిమా ఓపెనింగ్ ను దెబ్బతీసాయని, మౌత్ టాక్ తోనే బిజినెస్ పుంజుకోవాల్సి వుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.