వెబ్ సైట్లా? యూ ట్యూబ్ చానెళ్లా?

‘కొన్ని’ వెబ్ సైట్లపై, యూ ట్యూబ్ చానెళ్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏయే వెబ్ సైట్లు, ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు ఏమిటి అన్నది బయటకు రాలేదు. ఎవరూ వెల్లడించలేదు. అయితే…

‘కొన్ని’ వెబ్ సైట్లపై, యూ ట్యూబ్ చానెళ్లపై మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏయే వెబ్ సైట్లు, ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు ఏమిటి అన్నది బయటకు రాలేదు. ఎవరూ వెల్లడించలేదు. అయితే అసభ్యకరమైన ఫొటోలు, అసభ్యకరమైన రాతలు, అసభ్య కరమైన విడియోలు ఎవరు అప్ లోడ్ చేసినా, వాటిపై ఫిర్యాదులు వస్తే స్పందించి కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

నిజానికి మా అసోసియేషన్ అభ్యంతరం వెబ్ సైట్ల మీద నా? లేక యూ ట్యూబ్ చానెళ్ల మీదా అన్నది క్లియర్ గా తెలియలేదు. అయితే, తెలుస్తున్న సమాచారం ప్రకారం మా అసోసియేషన్ సమస్య అంతా, తామర తంపరగా పుట్టుకువచ్చిన యూ ట్యూబ్ చానెళ్ల మీదనే అని తెలుస్తోంది. యూ ట్యూబ్ చానెళ్లలో పలువురు మహిళా నటులపై వస్తున్న కథనాల మేరకు ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

కొందరు మహిళా నటులు ఎర్లీ స్టేజ్ లో వేసిన ఫోటోలను పట్టుకుని, కథనాలు అల్లి, వాటిని జోడించి విడియోలు చేసి అప్ లోడ్ చేసిన వాటిపైనే అభ్యంతరం అని తెలుస్తోంది. పైగా కొందరు ఏంకర్లు, మహిళా నటుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విడియోలు అప్ లోడ్ చేసి ప్రచారంలోకి తేవడం పైన కూడా మా అసోసియేషన్ లో డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే వెబ్ సైట్లు, యూ ట్యూబ్ చానెళ్లు, టెక్నికల్ టెర్మినాలజీ క్లియర్ గా తెలియకపోవడం వల్లనే వెబ్ సైట్లపై ఫిర్యాదు అంటూ వార్తలు వినవచ్చాయని, కానీ వాస్తవానికి ఫిర్యాదు చేసింది చానెళ్లపైనే అని ఓ వివరణ వినిపిస్తోంది. కానీ అది ఎంతవరకు నిజం అన్నది పోలీసులకు అందించిన ఫిర్యాదు చూస్తే తప్ప తెలియదు. నిజానికి యూ ట్యూబ్ చానెళ్ల నియంత్రణ అన్నది అంత సులువుగా సాధ్యం కాకపోవచ్చు.

ఎందుకంటే వేలాది యూ ట్యూబ్ చానెళ్లు ఇటీవల పుట్టుకువచ్చాయి. వీటిలో 99శాతం వాటికి వ్యవస్థాగతమైన ఏర్పాట్లు ఏమీ లేవు. వీటిలో 90శాతం వరకు వన్ మ్యాన్ ఆర్మీగా నడుస్తున్నవే ఎక్కువ. ఇవి ఎక్కడి నుంచి లోడ్ అవుతున్నాయో? ఎవరు లోడ్ చేస్తున్నారో అన్నది యూ ట్యూబ్ అధారిటీ చెబితే తప్ప తెలియదు. మహా అయితే రిపోర్టు చేస్తే, ఆ విడియోలను తీసేసే వరకు అవకాశం వుంది.

వెబ్ సైట్లు అలా కాదు. కనీసం యాభై శాతం వెబ్ సైట్లు సంస్థాగతంగానే నడుస్తున్నాయి. పైగా సైట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్, తదితర వ్యవహారాలు వుండనే వున్నాయి. పైగా సైట్లలో గ్యాసిప్ వార్తలు వస్తాయి కానీ, అసభ్య చిత్రాలు పెద్దగా రావు. మార్ఫింగ్ చిత్రాలు అంతకన్నా రావు .

మరి మా అసోసియేషన్ పోరాటం దేని మీదో? ఎంతవరకో అన్నది చూడాలి.