సినిమా హిట్ అయిందా లేదా ఫ్లాప్ అయిందా అనేది అనవసరం ఇప్పుడు. రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ పేరుతో మరో ఈవెంట్ పెట్టడం కామన్ అయిపోయింది. ఈ “సక్సెస్” సంబరాలు చూసి జనాలు నవ్వుకున్నా మేకర్స్ కు మాత్రం అనవసరం. స్పైడర్ విషయంలో ఈ 'అతి' వద్దని చెప్పేశాడట మహేష్.
ఇప్పటికే మిక్స్ డ్ టాక్ తో థియేటర్లలో కష్టంగా నడుస్తున్న స్పైడర్ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ ప్లాన్ చేశారు నిర్మాతలు. హైదరాబాద్, విజయవాడ లేదా తిరుపతిలో ఈ ఈవెంట్ పెట్టాలనుకున్నారు. ఇదే ఐడియాను మహేష్ ముందుంచారు. మేటర్ విన్న వెంటనే నో చెప్పేశాడట మహేష్ బాబు. ఇది ఇప్పటిమాట కాదు.. ఓ 4 రోజుల కిందటి ముచ్చట. అందుకే సక్సెస్ మీట్ స్థానంలో యూనిట్ అంతా కలిసి పోస్ట్-రిలీజ్ ఇంటర్వ్యూ పెట్టారు.
ప్రస్తుతం స్పైడర్ కు దూరంగా కాలం గడుపుతున్నాడు మహేష్. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిపోయాడు. ఫారిన్ లో సరదాగా గడుపుతున్న మహేష్ కూతురు, కొడుకు, భార్య ఫొటోలు అప్పుడే నెట్ లో ప్రత్యక్షమౌతున్నాయి. విదేశాల నుంచి మహేష్ తిరిగొచ్చిన తర్వాతే కొరటాల సినిమా స్టార్ట్ అవుతుంది.