మొన్ననే పూరీజగన్నాథ్ చెప్పాడు, అంతకన్నా కొంచెం ముందుగా కర్నూలు జిల్లా టీడీపీ నేత మరొకరు చెప్పారు.. బాలయ్య చేయి తగిలితే సదరు అభిమాని జన్మధన్యం అని! ఆ తర్వాత బాలయ్య కూడా అదే చెప్పాడు. తను తాకడమే వాళ్ల లక్ అని.. బాలయ్య విశదీకరించాడు. సో.. అలాగే చెప్పుకుందాం, అలాగే రాసుకుందాం.
బాలయ్య చేతిలో మరో ఫ్యాన్ జన్మధన్యం అయ్యింది. వివరించి చెప్పాలంటే.. నందమూరి నటసింహం మరో అభిమాని చెంప చెల్లుమనిపించాడు. ఈ సారి హిందూపురంలో బాలయ్య అభిమాని చెంప మార్మోగింది.
రాయిని రాముడి కాలు తాకితే అహల్య అయినట్టుగా.. అభిమానుల జన్మలు ధన్యం కావాలంటే.. బాలయ్య వారికి ఇలా చెంప దెబ్బలు కొడుతూ ఉండాలి కదా.. అదే కదా.. బాలయ్య అండ్ కో చెబుతున్నది. ఈ సారి మరో అభిమానికి ఆ అదృష్టం దక్కింది. ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుందాం.
ఇలా అభిమానుల చెంపలు పగులుతూ ఉండాలని, వారి జన్మలు ధన్యమైపోతూ ఉండాలని ఆకాంక్షిద్దాం. ఎవరైతే బాలయ్య చెంప దెబ్బ తగిలితే, సదరు అభిమాని జన్మ ధన్యం అని అన్నారో… బాలయ్య చెయ్యి వాళ్ల వరకూ వచ్చేంత వరకూ, ఈ థియరీని చెప్పిన వారి చెంపను బాలయ్యే చెల్లుమనిపించేంత వరకూ ఈ పరంపర కొనసాగాలని ఆకాంక్షిద్దాం.
కొట్టినోళ్లు.. అదే చెబుతున్నారు. కొట్టించుకోనొళ్లూ.. తమకు సమ్మగా ఉందని చెబుతున్నారు. సో.. అదేదో సినిమాలో బాబూమోహన్ తన్నుల స్వామిగా కనిపిస్తాడు. అలా బాలయ్య కూడా చెంపల దెబ్బల స్వామీజీ అని కొందరు చెబుతున్నారు. వాళ్లు ఇస్తున్న ఉత్సాహంతో బాలయ్య ఇలాగన్నమాట.. అదీ సంగతి.