తను చేసిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఫెయిల్ అయినపుడల్లా, సూపర్ స్టార్ మహేష్ బాబు వేసే మంత్రం ఒక్కటే. నిర్మాతను ఓదార్చి, మళ్లీ మీకో సినిమా చేస్తా’ అని ఓ హామీ పడేయడం. దాంతో సదరు నిర్మాతలు ఏమీ మాట్లాడలేక సైలెంట్ కావడం. నిజానికి సినిమా అంత దారుణంగా విఫలం అయినపుడు 20కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకునే మహేష్ బాబు సగం అన్నా వెనక్కు ఇవ్వాలి. కానీ ఆయన అలా చేయడు.
ఆగడు ఫ్లాప్ అయినపుడు మాట ఇచ్చాడు 14 రీల్స్ కు మరో సినిమా చేస్తానని. ఇప్పటికి లేదు. బ్రహ్మొత్సవం ఫ్లాప్ అయిన తరువాత పివిపి కి అగ్రిమెంట్ ప్రకారమే మరో సినిమా చేయాలి. కానీ వంశీ పైడిపల్లికి నిర్మాత పివిపి కి మధ్య కమ్యూనికేషన్ సెట్ కావడం లేదన్న సాకు చూపించి, ఆ ప్రాజెక్టును దిల్ రాజుకు ఇచ్చాడు. నిజానికి అగ్రిమెంట్ ప్రకారం 2018 ఆఖరులోగా పివిపికి ఓ సినిమా మహేష్ బాబు చేయాల్సి వుంది.
ఇక ఇప్పుడు స్పైడర్ ఫలితం తెలిసాక, ఆ సినిమా నిర్మాతలకు కూడా మళ్లీ ఓ సినిమా చేస్తా అని మహేష్ బాబు హామీ ఇచ్చినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇది కూడా కేవలం కంటితుడుపుగానా? ఊరడింపుగానా? లేదా నిజంగానే చేస్తారా? అన్నది అనుమానమే.
ఎందుకంటే ఇప్పటికే వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఓ సినిమా కమిట్ అయి వున్నాడు మహేష్ బాబు. ఆ తరువాత త్రివిక్రమ్ డైరక్షన్ లో ఒక సినిమా చేయాలి. రెండింటికి నిర్మాతలు ఫిక్స్ అయివున్నారు. రాజమౌళితో సినిమా చేస్తే, దానికీ నిర్మాత ఫిక్స్ అయివున్నారు. మరి ఆ లెక్కన ఈ మహేష్ తను హామీ ఇచ్చిన నిర్మాతలు 14 రీల్స్, పివిపి, ఎన్వీఆర్ సినిమాస్ ఎప్పుడు సినిమాలు చేస్తాడో?