మనుషులకే కాదు.. దేశానికి కూడా కొన్ని కథలు ఉంటాయి, మనుషుల జీవితంలోనే కాదు.. దేశ చరిత్రలో కూడా కొన్ని అపూర్వ ఘట్టాలుంటాయి, మనుషులకే కాదు.. దేశానికి కూడా ప్రస్థానాన్ని మార్చేసే కొన్ని మలుపులుంటాయి. మరి మనదేశం వరకూ చూసుకుంటే అలాంటి సంఘటనల్లో ఒకటి 1983లో జరిగింది. అదే కపిల్ డెవిల్స్ క్రికెట్ వన్డే ప్రపంచకప్ గెలవడం. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంఘటన.
అప్పటికి దిగ్గజ క్రికెట్ జట్టు అయిన వెస్టిండీస్‌ను ఓడించి ప్రపంచకప్ ఫైనల్‌లో విజయం సాధించి, కపిల్ సేన ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. దేశంలో క్రికెట్‌కి ఎనలేని క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఈరోజు.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఇంతగా రాణిస్తోందన్నా, ఆర్థికంగా కూడా క్రికెట్‌ను శాసించే శక్తి ఉందన్నా.. దీనికంతంటికీ 1983లోనే బీజాలు పడ్డాయి.
మరి అలాంటి ఘట్టాన్ని సినిమాగా తీసుకురాబోతున్నారు, కపిల్ దేవ్ బయోపిక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రధానంగా 1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను గెలిచినప్పటి సన్నివేశాలను చూపబోతోంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్‌గా నటిస్తుండగా ఈ సినిమా రూపొందుతోంది. మరి ప్రతిభావంతమైన దర్శకుడు, ప్రతిభావంతమైన నటుడు.. ఒక ప్రతిభావంతుడి జీవితాన్ని చూపబోతున్నారు. నిస్సందేహంగా ఇది వేచి చూడదగిన సినిమానే.
దేశం ఖ్యాతిని పతాక స్థాయికి తీసుకెళ్లిన పలువురి క్రీడాకారుల జీవితాలు ఈ మధ్య కాలంలోనే తెరకెక్కుతున్నాయి. 'దంగల్' 'ఎమ్‌ఎస్ ధోనీ' సినిమాలు సంచలన విజయాన్ని సాధించాయి. అయితే సచిన్ టెండూల్కర్ బయోపిక్ మాత్రం.. అటూ ఇటూ కాకుండా పోయింది. అటు డాక్యుమెంటరీగా కాకుండా, ఇటు ఫీచర్ ఫిల్మ్‌గా కాకుండా దాన్ని రూపొందించారు. ఎవరికీ పట్టకుండా పోయింది. అయితే కపిల్ జీవితకథ మాత్రం ఫీచర్ ఫిల్మ్‌గానే తెరకెక్కబోతోంది.
కానీ.. ఈ మధ్య కాలంలో కొన్ని బయోపిక్స్ అతి నాటకీయతకు పోయి అర్థంలేకుండా తయారవుతున్న సంగతి కూడా ప్రస్తావించుకోవాలి. సినిమాకు నాటకీయత అవసరమే కానీ.. అయితే ఇది కొన్నిసార్లు పరిధి దాటుతోంది. బయోపిక్స్‌తో సొమ్ము చేసుకోవచ్చనే తపనతో అందరి బయోపిక్స్‌నూ రూపొందించేస్తున్నాం అని సినిమా వాళ్లు ప్రకటించేస్తున్నారు.
సానియా మీర్జా, సైనా నెహ్వాల్, మిథాలీ రాజ్ వంటి వాళ్ల జీవిత కథలు కూడా త్వరలోనే సినిమాలుగా వచ్చేస్తున్నాయి. మరి ఈ సినిమాలు గౌరవనీయమే కానీ, లేని నాటకీయతను క్రియేట్ చేసి వీళ్లు మొదటికే మోసం ఎక్కడ తీసుకొస్తారో అనే సందేహం కలుగుతోంది. అసలు 'దంగల్' సినిమాకే బోలెడంత డ్రామాను జోడించారు. ప్రత్యేకించి ఒక రెజ్లింగ్ కోచ్‌ను విలన్‌గా చూపడం, క్లైమాక్స్ కోసం అతడిని పూర్తిగా విలన్‌గా చేసేయడం జరిగింది.
నిజ జీవితంలోని ఆ కోచ్ మొత్తకున్నాడు. అరే బాబూ.. నేనేం చేశాను, నన్నెందుకు విలన్‌గా చేశారు అని. అయితే దంగల్ అప్పటికే ప్రేక్షకులకు మత్తెక్కించేసింది కాబట్టి.. ఎవరూ పట్టించుకోలేదు ఆ కోచ్‌ను. కాబట్టి.. సినిమా వాళ్లు తాము తీయాలనుకుంటున్న బయోపిక్స్‌లో కాస్తంత విషయం ఉన్న వాళ్లను ఎంచుకుంటే మేలేమో. కపిల్ దేవ్ బయోపిక్స్ మాత్రం అలాంటి భయాలేమీ లేవు. బోలెడన్ని రోమాంచక ఘట్టాలున్నాయి కపిల్ ప్రస్థానంలో. వీటిని చక్కగా తీస్తే చాలంతే!