అవతలి సినిమా తమ సినిమా కంటే అధమం అని డైరెక్టుగా చెప్పకుండా ఇన్‌డైరెక్టుగా ఆ విషయాన్ని రిజిష్టర్ చేయడానికి పోస్టర్లని వాడేస్తున్నారు నిర్మాతలు. 'స్పైడర్' చిత్రం టాక్ ఏమిటనేది ముందు రోజు రాత్రికే తేలిపోయింది. ఆ సినిమా టాక్ వినిపిస్తోన్న కాసేపటికి 'వంద కోట్ల వసూళ్లు' సాధించిందంటూ 'జై లవకుశ' పోస్టర్లు అర్థరాత్రి దాటిన తర్వాత రిలీజ్ అయ్యాయి. ఆ పోస్టర్లని సదరు చిత్రం పీఆర్వోలతో పాటు దర్శకుడు కూడా ఆ టైమ్‌లో విడుదల చేయడం విమర్శలకి తావిచ్చింది.
ఇంత అర్థరాత్రి ఈ పోస్టర్లు వదలాల్సిన అవసరం ఏమిటని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నించారు. స్పైడర్ చిత్రానికి టాక్ వీక్‌గా వుండడంతో దానిని క్యాష్ చేసుకోవడానికి, అటెన్షన్ తమ సినిమా వైపు డైవర్ట్ చేసుకోవడానికి అంత అర్థరాత్రి ఈ మద్దెల దరువు మొదలు పెట్టారన్నమాట. అయితే స్పైడర్ బృందం ఏమీ తక్కువ తినలేదు.
మొదటి రోజు వసూళ్లలో జై లవకుశ కంటే తక్కువే సాధించిన ఈ చిత్రానికి ఫస్ట్ డే గ్రాస్ యాభై ఒక్క కోట్లు అంటూ అఫీషియల్ పోస్టర్లు విడుదల చేసారు. జై లవకుశ చిత్రానికి మొదటి రోజు యాభై కోట్ల గ్రాస్ అని బలంగా వినిపించేసరికి ఈ యాభై ఒక్క కోట్ల గ్రాస్ ఫిగర్ కేవలం దానికి కౌంటర్ ఫిగర్ అని అర్థమవుతోంది. ఆ చిత్రానికి అయిదు రోజుల్లో వంద కోట్లు వేసారు కనుక దీనికి నాలుగు రోజుల్లోనే వంద కోట్ల పోస్టర్లు రావచ్చు.
ఈ పోస్టర్ల వల్ల ఈగో శాటిస్‌ఫాక్షన్ మినహా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఏ సినిమా ఫలితమేంటనే దానిపై జనాలకి ఒక అవగాహన వుంది. ఎంత హిట్ అయిందని మొత్తుకున్నా సభ్య సమాజానికి ఆ రాంగ్ మెసేజ్‌ని పాస్ చేయలేకపోయిన సినిమాలు ఈమధ్య చాలానే వున్నాయి. ఫిదా, అర్జున్‌రెడ్డిలాంటి చిత్రాలు సాధించిన విజయాలకి ఇలాంటి డప్పులేం అవసరం లేనపుడు భారీ చిత్రాలకే ఈ బాధలు దేనికో?