ఈ డైరెక్టర్లని పట్టించుకోరేంటి?

యువ దర్శకుడు ఎవరైనా వచ్చి ఘన విజయం సాధించగానే అతడికి స్టార్‌ హీరోల నుంచి పిలుపులు వచ్చేవి. కానీ ఈమధ్య ఎంత మంచి చిత్రం తీసిన దర్శకుడికి అయినా తర్వాతి లెవల్‌ రీచ్‌ అవడం…

యువ దర్శకుడు ఎవరైనా వచ్చి ఘన విజయం సాధించగానే అతడికి స్టార్‌ హీరోల నుంచి పిలుపులు వచ్చేవి. కానీ ఈమధ్య ఎంత మంచి చిత్రం తీసిన దర్శకుడికి అయినా తర్వాతి లెవల్‌ రీచ్‌ అవడం కష్టమవుతోంది. ఎవరైనా పెద్ద నిర్మాత బ్యానర్లో సినిమాలు తీసిన దర్శకులకి అయితే వెంటనే ఆఫర్లు వస్తున్నాయి కానీ ఇండిపెండెంట్‌ సినిమాలు తీసే వారి పరిస్థితి వేరేలా వుంది.

పెళ్లిచూపులు ఎంతటి ఘన విజయాన్ని అందుకుందనేది తెలిసిందే. కానీ ఆ చిత్ర దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌కి అవకాశాలు వచ్చి పడిపోలేదు. మరోసారి అతను చిన్న సినిమానే తలపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే 'ఘాజీ'లాంటి ఒక సరికొత్త చిత్రాన్ని అందించిన సంకల్ప్‌ రెడ్డికి కూడా పెద్ద హీరోల నుంచి పిలుపు రాలేదు. రీసెంట్‌గా వచ్చి సంచలనం చేసిన 'అర్జున్‌ రెడ్డి' దర్శకుడు సందీప్‌ పరిస్థితి కూడా అంతే.

గతంలో యువ దర్శకులు ఎవరైనా వచ్చి పెద్ద హిట్‌ ఇవ్వగానే వెంటనే పెద్ద ప్రాజెక్టులు సెట్‌ అయిపోయేవి. ఇప్పుడు మాత్రం ఇండిపెండెంట్‌ సినిమాలు తీసే దర్శకులు అంచెలు అంచెలుగా ఎదగాల్సి వస్తోంది. మారుతిని ఇంకా స్టార్‌ హీరోలు పట్టించుకోకపోవడాన్ని బట్టే ఈ సంగతి తేటతెల్లమవుతోంది.