ఇప్పడు టాలీవుడ్ లో కింగ్ పిన్ ఎవరు అంటే హీరోలు, టాలీవుడ్ లో చిరకాలంగా పాతుకున్న ఫ్యామిలీల వారసులు కాదు. నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఆయన చేతిలోనే నడుస్తోంది వ్యవహారం అంతా. ఆంధ్ర, నైజాంల్లో తన లీజు థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ సినిమాల విడుదలను శాసించే స్టేజ్ లో వున్నారు ఆయన. అయితే అదే సమయంలో ఆయన అంతగా మనసు పెట్టకుంటే సినిమాల సంగతి అంతే.
మహానుభావుడు సినిమా విషయంలో దిల్ రాజు అంతగా మనసు పెట్టడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఆయనేమీ కావాలని చేయడం లేదు. ఆయన సమస్యలు ఆయనవి. ఇంతకీ విషయం ఏమిటంటే, మహానుభావుడు సినిమా నైజాం, వైజాగ్ ఏరియాలు దిల్ రాజు చేతిలో వుంచారు. దీనికి కారణం వుంది. శర్వానంద్ గత సినిమా రాధ లావాదేవీలు కొన్ని వున్నాయి. వాటి వల్ల ఈ సినిమాను దిల్ రాజుకు అప్పగించాల్సి వచ్చింది.
కానీ దిల్ రాజు సమస్య ఏమిటంటే, జైలవకుశ, స్పైడర్ సినిమాల పంపిణీ ఆ రెండు ఏరియాల్లో ఆయనదే. జై లవకుశ నైజాం ఏరియాకు 16నుంచి 17కోట్లకు ( వేరే నెంబర్లు వినిపిస్తున్నా ఇదే వాస్తవం అని వినికిడి) దిల్ రాజు తీసుకున్నారు. స్పైడర్ ను నైజాం ఏరియాకు 23కోట్ల రేంజ్ లో కొన్నారు. పైగా స్పైడర్ నో రిటర్న్ బేసిస్ మీద తీసుకున్నారు. జైలవకుశ విశాఖ ఏరియాను ఎన్టీఆర్ కోసం దిల్ రాజు పంపిణీ చేసిపెడుతున్నారు.
ఇలాంటి టైమ్ లో జైలవకుశను థియేటర్లలోంచి తీయలేరు. ఈ పండగ వీకెండ్ ఊపితే బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశ. ఇక స్పైడర్ విషయంలోనూ మహేష్ తో ఆబ్లిగేషన్. మహేష్ తరువాతి సినిమా నిర్మాత దిల్ రాజే. వంశీ పైడిపల్లి నిర్మాత. అందువల్ల ఇప్పుడు మహేష్ గుడ్ లుక్స్ అవసరం.
ఇక మిగిలింది మహానుభావుడు. ఆ సినిమా దిల్ రాజు కొనలేదు. రాధ బాకీల రీత్యా ఆయన దగ్గర వుంది. అందువల్ల డబ్బులు రాకపోయినా, వాళ్లే కట్టుకుంటారు. వచ్చినా మంచిదే. సో, నైజాంలో, విశాఖలో మహానుభావుడు సినిమాకు పెద్దగా సింగిల్ స్క్రీన్ లు కేటాయించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయిు. చాలా సింగిల్ థియేటర్లలో జై లవకుశ కలెక్షన్లు లేకున్నా అలాగే వుంచారని, స్పైడర్ ఫుల్స్ కాకున్నా, థియేటర్లు మిక్స్ చేయడం లేదని టాక్ వినిపిస్తోంది.
ఈ విషయంలో యువి వాళ్లు కాస్త అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. మండే తరువాత ఎలాగూ థియేటర్లు ఇస్తారు. కానీ అదేదో ఇప్పుడు ఇస్తే, మహానుభావుడు సినిమాకు మరింత కలెక్షన్లు వస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇదిలా వుంటే మహానుభావుడు సినిమా చాలా ఏరియాల్లో శతమానంభవతి కలెక్షన్లు అధిగమించేలా వుంది. కానీ నైజాం, విశాఖల్లో కాదు. శతమానం భవతి దిల్ రాజుదే. తన సినిమా రికార్డులు దాటకూడదని కూడా దిల్ రాజు ఇలా చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి దిల్ రాజు ఇప్పుడు టాలీవుడ్ లో మహానుభావుడు.