మారుతీ మరో జబ్బు సినిమా- మహానుభావుడు

ఒక సినిమా చూస్తున్నప్పుడు– దానిలో హీరో పాత్రలో వేరే వ్యక్తి గుర్తుకువస్తే– ఈ కథ అతని కోసం రాసినట్లే అనుకోవచ్చు. మహానుభావుడు సినిమా చూస్తున్నప్పుడు– చాలా సన్నివేశాల్లో శర్వా బదులుగా నానీ కనిపిస్తూ ఉంటాడు.…

ఒక సినిమా చూస్తున్నప్పుడు– దానిలో హీరో పాత్రలో వేరే వ్యక్తి గుర్తుకువస్తే– ఈ కథ అతని కోసం రాసినట్లే అనుకోవచ్చు. మహానుభావుడు సినిమా చూస్తున్నప్పుడు– చాలా సన్నివేశాల్లో శర్వా బదులుగా నానీ కనిపిస్తూ ఉంటాడు. దర్శకుడు మారుతి– బహుశా ఈ కథను నానీ కోసం రాసి ఉంటాడు. ఈ విషయం పక్కన పెడితే గత రెండు వారాల్లో వచ్చిన మూడు సినిమాల్లో మహానుభావుడే బెటర్‌ అనిపిస్తుంది.

ఈ సినిమాలో హీరో– ఓసీడీ (అబ్సెసివ్‌ కంపెల్సివ్‌ డిజార్డర్‌) బాధితుడు. (వాస్తవానికి మనందరిలోను ఓసీడీ ఎంతో కొంత ఉంటుంది. పరిస్థితుల ప్రభావం వల్ల తగ్గుతూ వస్తుంది). అతి పరిశుభ్రత అతనికి ఉన్న పెద్ద బలహీనత. అది అతని మామూలు జీవితాన్ని.. ప్రేమ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనేదే కథ. సాఫ్ట్‌వేర్‌ మేనేజర్‌గా పనిచేసే హీరో తన ప్రేమ కోసం గ్రామానికి వెళ్లటం.. అక్కడ తన ప్రేమను గెలుచుకోవటానికి ప్రయత్నించటం.. ఈ సంఘటన్నింటిలోను హీరోకు ఉన్న ఓసీడీ జబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఈ సినిమాలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు మారుతి గురించి. భలేభలే మగాడివోయ్‌ సినిమాలో మతిమరుపు జబ్బును కథాంశంగా తీసుకున్న మారుతి– మళ్లీ మరో జబ్బు నేపథ్యంలో కథను అల్లడం ఛాలంజ్‌ అనే చెప్పాలి. వెంట వెంటనే జబ్బు సినిమాలు చేస్తే బావుండదు కాబట్టి నానీ ఈ సినిమాను చేసి ఉండకపోవచ్చు. అయినా శర్వా చేత మారుతి మంచి ఫెరఫార్మెన్స్‌ ఇప్పించాడనే చెప్పాలి.

హిందీలో పీకూ(అమితాబ్‌, దీపికలతో మలబద్ధకం ప్రధానాంశం) వచ్చిన తర్వాత వ్యక్తిగతమైన జబ్బులు ప్రధాన కధాంశాలుగా సినిమాలు తీసిన వాళ్లలో మారుతి ముందు ఉన్నాడు. వాస్తవానికి భలేభలే మొగాడివోయ్‌ సినిమాలో మతిమరుపును కన్నా ఓసీడీని డీల్‌ చేయటం కష్టం. ఈ జబ్బుకు తగినట్లుగా సన్నివేశాలను కూర్చటం.. దానికి తగినట్లు పాత్రలను మలచటం అంత సులభం కాదు. ఈ విషయంలో మారుతిని అభినందించాలి.

ఈ సినిమాలో కథ, కథాగమనం, స్ర్కీన్‌ప్లే అన్ని చక్కాగా కుదిరాయి. ఇక హీరో శర్వా తన పరిధిని దాటకుండా చక్కగా నటించాడు. హీరోయిన్‌ మెహ్రీన్‌ నిండుగా కనిపిస్తుంది. అక్కడక్కడ కాజల్‌ పోలికలు కూడా కనిపిస్తాయి. అయితే చాలా మంది హిందీ హీరోయిన్‌ల మాదిరిగానే ముద్దు ముద్గుగా నటించినటానికి ప్రయత్నించటం కొంత ఎబెట్టుగా అనిపిస్తుంది.

హీరో మిత్రుడిగా వెన్నెల కిషోర్‌.. శర్వాల టైమింగ్‌ బాగా కుదిరింది. ‘వీడో జంటిల్‌మెన్‌.. వాడో వాచ్‌మెన్‌’ లాంటి డైలాగ్స్‌ టైమింగ్‌ బాగా కుదిరింది.  హీరో, హీరోయిన్‌ల తర్వాత చెప్పుకోవాల్సింది– సంగీతం. తమన్‌ మంచి ట్యూన్లనే అందించినా– వాయిద్యాల హోరు బాగా పెరిగిపోయిందనిపిస్తుంది. ఒకటి రెండు ట్యూన్లు ఎక్కడో ఇంగ్లీషు ఆల్బమ్స్‌లో విన్నట్లు అనిపిస్తాయి. ప్రపంచ సంగీతాన్ని స్ఫూర్తిగా తీసుకున్నప్పుడు ఒకటి రెండు ట్యూన్లు విన్నట్లు అనిపించినా పర్వాలేదు.

ఇప్పుడు గత మూడు వారాల్లో వచ్చిన సినిమాలు– జై లవకుశ.. స్పైడర్‌.. మహానుభావుడు సినిమాల్లో – మహానుభావుడు మిగిలిన రెండింటి కన్నా ప్రేక్షకులను ఎక్కువగా ఎంటర్‌టైన్‌ చేస్తుందనటంలో సందేహం లేదు. మొదటి రెండు సినిమాలకు హీరోల ఇమేజ్‌ కథగమానికి ఇబ్బంది కలిగిస్తే– మహానుభావుడికి అలాంటి సమస్యే లేదు. ఓపినింగ్స్‌ పరంగా చూస్తే– మిగిలిన రెండు సినిమాలు ఎక్కువ థియేటర్లలో విడుదలయి ఉండవచ్చు.

మొదటి రెండు రోజుల కలెక్షన్లు కోట్లు ఉండచ్చు. కానీ మహానుభావుడు మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌ విషయంలో అటు ప్రేక్షకులను.. కలెక్షన్ల విషయంలో దర్శక నిర్మాతలను సంతృప్తిపరుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. రెండున్నర గంటల పాటు హాయిగా సినిమా చూడాలనుకొనేవారు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది. 

–భావన
([email protected])