ఒక మంచి ప్రయత్నం చేసాం-ఠాగూర్ మధు

స్పైడర్ ఫలితం విషయంలో పూర్తి హ్యాపీగా వున్నామని, అయితే సినిమా విషయంలో డివైడ్ టాక్ ఎందుకు వచ్చిందన్నదే అర్థం కావడం లేదని, ఇండస్ట్రీ పెద్దలు, పలువురు సెలబ్రిటీలు సినిమా చూసి, బాగుందని అంటూ, డివైడ్…

స్పైడర్ ఫలితం విషయంలో పూర్తి హ్యాపీగా వున్నామని, అయితే సినిమా విషయంలో డివైడ్ టాక్ ఎందుకు వచ్చిందన్నదే అర్థం కావడం లేదని, ఇండస్ట్రీ పెద్దలు, పలువురు సెలబ్రిటీలు సినిమా చూసి, బాగుందని అంటూ, డివైడ్ టాక్ ఎందుకు వచ్చిందని తిరిగి తమను ప్రశ్నిస్తున్నారని, కావాలంటే తామే మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి చెబుతామని అంటున్నారని వివరించారు. తాము ఓ మంచి ప్రయత్నం చేసామని, దానిని ప్రేక్షకులు. ఆమోదిస్తున్నారని ఆయన అన్నారు. 

ఠాగూర్ మధు ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. స్పైడర్ సినిమా కలెక్షన్లు స్టడీగా వున్నాయని, బుక్ మై షో లో హైదరాబాద్ లో టికెట్ ల పరిస్థితి చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్థం అవుతుందని అన్నారు. గాంధీ జయంతి వరకు వరుస సెలవులు వుండడం అన్నది సినిమాకు బాగా హెల్ప్ అవుతుందన్నారు. ఇప్పటి వరకు 72కోట్లు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి గ్రాస్ వసూళ్లు వచ్చాయని మధు అధికారికంగా ప్రకటించారు. 

మలయాళ, తమిళ భాషల్లో స్పైడర్ కు మాంచి స్పందన లభిస్తోందని, ఆ మేరకు కలెక్షన్లు క్లియర్ గా కనిపిస్తున్నాయన్నారు. బాలీవుడ్ సమీక్షకులు కూడా సినిమాను మెచ్చుకున్నారని వివరించారు. సినిమా కోసం వంద కోట్లు పైగా ఖర్చు చేయడం అవసరమా? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, తెలుగు సినిమా మార్కెట్ ఇతర భాషల్లోకి పెరగాలంటే తప్పదని వివరించారు. 

మురుగదాస్, మణిరత్నం, శేఖర్ కమ్ముల లాంటి డైరక్టర్లు పాత్రలు కనిపించాలి కానీ, నటులు కనిపించకూడదు అనే పద్దతి వున్న డైరక్టర్లు అని, అందుకే స్పైడర్ లో నోటెడ్ ఫేస్ లు లేవని వివరించారు. సినిమాలో మురుగదాస్ రాసుకున్న మైండ్ గేమ్ సీన్లకు మాంచి అప్లాజ్ వస్తోందని తెలిపారు. 

సినిమా విడుదలకు ముందు మహేష్ బాబు సమీక్షల గురించి మాట్లాడింది, జస్ట్ క్యాజువల్ గా మాత్రమే అని, ఎవర్ని ఉద్దేశించి కాదని, మీడియా అడిగితే అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా సమాధానం ఇచ్చారు తప్ప వేరు కాదని, ఠాగూర్ మధు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

నిర్మాతలుగా ఏడాదిన్నర పాటు తాము టెన్షన్ పడ్డామని, అయితే దర్శకుడిగా మురుగదాస్ పడిన కష్టం చాలా ఎక్కువని, పెర్ ఫెక్షన్ కోసం ఆయన ఎంత కిందా మీదా పడ్డారో తమకు తెలుసు అని ఆయన వివరించారు. మురుగదాస్ తో తన ప్రయాణం చిరకాలంగా సాగుతూ వస్తోందని, ఇకపై కూడా కొనసాగుతుందని మధు వెల్లడించారు.