ఎమ్బీయస్‌: దారికి అడ్డు వచ్చే దానయ్యలు

ప్రస్తుతం సినిమా రివ్యూల గురించి ఉధృతమైన చర్చలు జరుగుతున్నాయి. రగిలించినవాడు జూ ఎన్టీయార్‌! మాకూ ప్రేక్షకులకు మధ్య యీ దారిన పోయే దానయ్యలెవరు? అని విరుచుకు పడ్డాడు. గతంలో ''నేనింతే'' సినిమాలో పూరీ వెబ్‌సైట్లు…

ప్రస్తుతం సినిమా రివ్యూల గురించి ఉధృతమైన చర్చలు జరుగుతున్నాయి. రగిలించినవాడు జూ ఎన్టీయార్‌! మాకూ ప్రేక్షకులకు మధ్య యీ దారిన పోయే దానయ్యలెవరు? అని విరుచుకు పడ్డాడు. గతంలో ''నేనింతే'' సినిమాలో పూరీ వెబ్‌సైట్లు చేసే సమీక్షలను తెర మీద చీల్చి చెండాడేడు. అప్పటికీ యిప్పటికీ వచ్చిన మార్పు ఏమిటంటే, సోషల్‌ మీడియాలో  చేసే కామెంట్లు, సమీక్షలు. మంచు విష్ణు వాపోయినట్లు సినిమా నడుస్తూండగానే సెల్‌ఫోన్‌లో రేటింగ్స్‌, కామెంట్స్‌ రాసేసి అప్‌లోడ్‌ చేసేస్తున్నారు. పూర్తిగా చూసే ఓపిక కూడా వుండటం లేదు.

మా చిన్నపుడు సిటీల్లో జనం సినిమాల గురించి పెద్దగా వ్యాఖ్యానించేవారు కాదు కానీ, టౌన్లలో జనం మాత్రం మహా సినిమా-సావీగా వుండేవారు. ఇంటర్వెల్‌లో సినిమా హాలు బయటకు జనాల్ని వదిలేవారు. ఇప్పట్లా తాళాలేసేవారు కారు. బయటకు వచ్చిన జనం వేరుశెనక్కాయలు అమ్మే జంగిడీ వాడి దగ్గరైనా 'అంత బాగా లేదు, నాలుగు వారాలు మించి ఆడదు' అని చెప్పేసి కడుపుబ్బరం తీర్చేసుకునేవారు. మహా అయితే మర్నాడు సాయంత్రం ఫ్రెండ్స్‌తో పందాలు కాసేవారు.

అంతకు మించి భావాలు వెలిబుచ్చేందుకు మార్గాలు వుండేవి కావు. పత్రికలో కథో, వ్యాసమో పడితే గొప్ప. 'లేఖలు' శీర్షికలో పేరు పడాలన్నా ఒళ్లు దగ్గర పెట్టుకుని, తప్పులు లేకుండా రాయవలసి వచ్చేది. లేకపోతే చెత్తబుట్టలో పడేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతీవాడూ ఫోటోగ్రాఫర్‌ అయిపోయినట్లు, సోషల్‌ మీడియాలో ఖాతా ఉన్నవాడు ప్రతీవాడూ వ్యాఖ్యాతే. పత్రికల్లో పుస్తకసమీక్షలు రాసేవారిని సంపాదకుడు జాగ్రత్తగా అన్ని అర్హతలూ చూసి మరీ ఎంచుకుంటాడు. సోషల్‌ మీడియా సమీక్షకుడికి ఆ యింటర్వ్యూల బాధ లేదు. చరిత్ర కాదు, జాగ్రఫీ కాదు, గాంధీ కాదు, ఐన్‌స్టీన్‌ కాదు, ఎవరి మీద పడితే వారి మీద రాసేయచ్చు. కాదన్న మాదన్న ఎవరైనా వుంటే బండబూతులు కురిపించవచ్చు.

ఇలాటి వాతావరణంలో సినిమాలపై వ్యాఖ్యలు ఒక లెక్కా? సినిమా పేరు ఎనౌన్సు చేయగానే కూడా తీర్పు యిచ్చేయగల సమర్థులు వీరు. అలాటప్పుడు రేటింగు యివ్వడానికి సినిమా పూర్తయ్యేదాకా ఆగాలా? నేను చిన్నప్పణ్నుంచి సినిమాలు చూస్తూనే వున్నాను. కొంత పరిజ్ఞానం కూడా వుంది. అయినా సినిమాకు ముందు రిలీజయ్యే ఆడియో సిడి విని సినిమాలో పాటలు  హిట్టవుతాయి అని చెప్పలేను. అది రేడియోలో లలిత గీతమైతే సాహిత్యం, సంగీతం, వాద్యగోష్ఠి అనే అంశాలతో పాట బాగుంది, లేదు అనుకుంటాం. కానీ సినిమా పాటలో ప్రధానాంగం చిత్రీకరణ.

అది చూడకుండా సినిమా పాట క్వాలిటీని ఎలా బేరీజు వేస్తాం? మనం చూడని సినిమాల పాటలు రేడియోలో విని దాని చిత్రీకరణ యిలా వుంటుంది అని ఏమేమో వూహించుకుంటాం. తీరా చూస్తే అది మరోలా వుంటుంది. నిరుత్సాహపడతాం. అలాగే సినిమా చూసిన వెంటనే కూడా దాని క్వాలిటీ నాకు పూర్తిగా బుఱ్ఱ కెక్కదు. మర్నాడు పొద్దున్నకే నాకు 'సింక్‌' అవుతుంది.  సినిమా పూర్తవగానే తట్టని అనేక అంశాలు మర్నాటికి తడతాయి. సినిమాను టీవీలోనో, సెల్‌ఫోన్‌లోనో చూసి కూడా దాని క్వాలిటీని ఎంజాయ్‌ చేయలేను. దాన్ని మనం పెద్ద తెరపై చూడాలని ఉద్దేశించి దర్శకుడు ఆ తెర నిండా అనేక విషయాలు నింపుతాడు. మూడంగుళాల సెల్‌ఫోన్‌ తెరపై దాన్ని కంగాళీగా చూసేసి దానిపై తీర్పులు చెప్పడం సరికాదని నేననుకుంటాను. నాకు సినిమా కథాగమనం బాగా బోధపడుతుంది. తక్కినవి అంతంత మాత్రమే. కానీ సమీక్షకులు ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, ప్రీ-క్లయిమాక్స్‌, బ్లాక్‌, లాక్‌, గ్రాఫ్‌, టేకింగ్‌.. లాటి ఏవేవో పదాలు వాటి వాటికి మార్కులు వేసేస్తూ వుంటారు.

అదీ సినిమా చూసిన అరగంటలో రాసి వెబ్‌సైట్‌కు పంపేస్తారు. పాటల సంగతికి వస్తే యిటీవలి తెలుగు సినిమాల్లో నాకు పాటలు వింటూన్నపుడు చెవులు హోరెత్తిపోతూ వుంటాయి. గాయనీగాయకులు పాట పాడుతూన్నంతసేపు వెనక్కాల డక్కుడక్కుమని ఎవరో ఏదో కొడుతూనే వుంటారు. దాంతో నాకు మాటలు అర్థం కావు. హిందీ పాటల్లో ఆ బాధ లేదు. మాటలు తెలుస్తాయి. తెలుగు సినిమాల్లో మ్యూజిక్‌ సౌండు ఎక్కువై పోవడం వలన చెవుల్లో దూది పెట్టుకోవలసి వస్తోంది. డైలాగు సరిగ్గా వినబడకుండా నేపథ్యసంగీతం (ఆర్‌ఆర్‌ అంటున్నా రీమధ్య) డామినేట్‌ చేస్తూ వుంటుంది. ఇలాటి పరిస్థితుల్లో సమీక్షకులు పాటల్లో సాహిత్య విలువల గురించి వ్యాఖ్యానిస్తూ ఉంటే నాకు చాలా అబ్బురంగా వుంటుంది. అవి రాసే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదనుకుంటా. కానీ సోషల్‌ మీడియా వ్యాఖ్యాతలకు అలాటి జంకులేమీ లేవు. సినిమా హాలులో సెటిలైన దగ్గర్నుంచీ వ్యాఖ్యానాలు రాసేస్తూ, అప్‌లోడ్‌ చేసేస్తూ వుంటారు. 

ప్రస్తుతం హీరోలు, నిర్మాతలు వీళ్లనీ, రెగ్యులర్‌ వెబ్‌సైట్‌, పత్రికల సమీక్షకులను ఒకే గాట కట్టేస్తూన్నారనే శంక కలుగుతోంది నాకు. సోషల్‌ మీడియాలో ఎవరైనా ఎవరిపైననైనా రాయవచ్చు. పని గట్టుకుని, ప్రత్యర్థి హీరో అభిమానులు కక్షతో చేస్తున్నారని కూడా కొందరు ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే అదే పని యివతలి హీరో అభిమానులూ చేస్తారు. గతంలో ఎయన్నార్‌, ఎన్టీయార్‌ అభిమానులు ఎదుటి హీరో సినిమాల పోస్టర్లపై పేడ విసిరేవారు. ఇప్పుడు చేతులకు ఏమీ అంటుకోకుండా సోషల్‌ వాల్‌ ఖరాబు చేస్తున్నారు. ఆ పేడముద్దల కెంత విలువో, వీటికీ అంతే విలువ.

నిజానికి సోషల్‌ మీడియాలో రాసేవాళ్లు ప్రత్యర్థి హీరో అభిమానులే కానక్కరలేదు, పెంచిన ధరకు టిక్కెట్టు కొన్న ప్రేక్షకుడు కూడా కడుపుమండి రాసి వుండవచ్చు అని కూడా ఆలోచించి చూస్తే తప్పు లేదు. ఈ వ్యాఖ్యాతలకు పేరూప్రఖ్యాతులు ఉండవు. ఫాలోయింగ్‌ ఉండదు. మహా అయితే అతని స్నేహితులు చూస్తారేమో! ఫాలోయింగ్‌ ఉన్న విమర్శకుడు తన పేరుతో, లేదా కలంపేరుతో, గుర్తింపు వున్న ఫోరమ్‌లో రాసినప్పుడే అది సమీక్ష అవుతుంది. నటులు, నిర్మాతలు సోషల్‌ కామెంటేటర్స్‌మీద కసిని, రెగ్యులర్‌ సమీక్షకులపై చూపిస్తున్నారు. ఎందుంటే వీళ్లకు రెగ్యులర్‌ సమీక్షకులపై కూడా కోపం వుంది, అందుకని యిద్దర్నీ కలగలిపి తిట్టేస్తున్నారు. అది కరక్టు కాదు. రెగ్యులర్‌ క్రిటిక్‌కు బాధ్యత వుంటుంది. అతను అఖిలాండకోటి ఆంధ్రులకు ప్రతినిథి కాదు. సొంత అభిప్రాయమే రాస్తాడు.

కానీ దాని వెనుక పరిశీలన, అనుభవం వుంటాయి. తను అన్నదాన్ని జస్టిఫై చేసుకోగలగాలి. లేకపోతే పేరు పోతుంది. వ్యాఖ్యాతగా తన బ్రాండ్‌ కష్టపడి నిర్మించుకోవాలి, అది పోకుండా చూసుకోవాలంటే నిజాయితీగా వుండాలి. వీళ్లలో డబ్బుకో, మొహమాటానికో లొంగేవాళ్లుండరా అంటే ఉండవచ్చు. ప్రతీ వృత్తిలోను అవినీతిపరులుంటారు. కానీ వాళ్లు కూడా గడుసుగా తాము రాసినదాన్ని జస్టిఫై చేసుకోవాలి. లేకపోతే ఏళ్ల తరబడి బిల్డప్‌ చేసుకున్న రిప్యుటేషన్‌ పోతుంది, సమీక్షలు నమ్మడం మానేస్తారు. అప్పుడు అవతలివాళ్లు డబ్బులివ్వడమూ మానేస్తారు. అంతేకాదు, వీళ్ల చేత రివ్యూలు రాయించుకునే పత్రికలూ, వెబ్‌సైట్లూ పొమ్మంటారు. ఎందుకంటే వాళ్లకు పాఠకుల నమ్మకం ముఖ్యం. 

ముళ్లపూడి వెంకటరమణగారు ఆంధ్రపత్రిక సినీసమీక్షకులుగా పనిచేసే రోజుల్లో ఎదురైన అనుభవాలను ''కోతికొమ్మచ్చి''లో రాశారు. మొదటి రిలీజులో చతికిల పడిన విజయావారి ''అప్పుచేసి పప్పుకూడు'' సినిమా ఆయనకు గందరగోళం గలీజుబజారులా తోచింది. తోచినది రాస్తే ముప్పు వస్తుందని భయం వేసి ఎడిటరు, పబ్లిషరు అయిన శంభుప్రసాద్‌గార్ని కలిసి ''విమర్శించకపోతే నలుగురూ హేళన చేస్తారు. విమర్శిస్తే చక్రపాణిగారు మీకు ఫోన్‌ చేస్తారు, ఏం చేయమంటారు?'' అని అడిగారు. ఆయన నవ్వి ''వాళ్లక్కోపం వస్తే ప్రకటనలివ్వరు. పత్రికకు పాఠకులు ఉంటేనే ప్రకటనలొస్తాయి. ప్రకటనలున్నాయని పాఠకులు రారు.

మనకు ప్రొడ్యూసర్ల ప్రకటనల కన్న పాఠకుల అభిమానమే ముఖ్యం. మీకు తోచినది రాయండి.'' అన్నారు. అంత స్పష్టంగా చెప్పకపోయినా పత్రికలకు, వెబ్‌సైట్లకు రిలయబిలిటీయే ప్రాణం. ఏదో హీరోపై వలపక్షంతోనో, లేదా ప్రకటనలకు ఆశ పడో పెయిడ్‌ రివ్యూలు రాస్తే పాఠకులు నమ్మడం మానేస్తారు. అందువలన పేరున్న సమీక్షకుడు బాధ్యతగా రాసి తీరతాడు. అతని అభిరుచి నచ్చిన పాఠకులే దాన్ని చదువుతారు. గతంలో రాసినదానితో పోల్చి చూసుకుని, ఆ ప్రకారం సినిమాకు వెళ్లడమో మానడమో చేస్తారు. అది సినిమావాళ్లకు నచ్చటం లేదు. సోషల్‌ మీడియా వ్యాఖ్యాతలను పక్కన పెట్టండి. వారు దారిన పోయే దానయ్యలైతే కావచ్చు.

కానీ యీ సమీక్షకులు మాత్రం ప్రేక్షకులే. జూ.ఎన్టీయార్‌ మాట్లాడుతూ ''ప్రేక్షకులు డాక్టర్లు. సినిమా బతికిందో లేదో చెప్పగలిగేది వారు. మధ్యలో వీళ్లెవరు, ఏమీ తెలియకుండా పేషంటు చచ్చిపోయాడని చెప్పడానికి?'' అని అడిగారు. రెగ్యులర్‌ సమీక్షకులు ప్రథమ ప్రేక్షకులు. సినిమా చూడడంలో నిపుణులని ప్రేక్షకులు భావించేవారు. వారి మాటకు విలువ వుంటుంది. కాబట్టే పాఠకులు తమ సమయం, ధనం వృథా కాకుండా వుండాలని సమీక్షకుడు ఏం రాశాడో ఓ సారి చూసి, ఆ పై తమ నిర్ణయం తాము తీసుకుంటారు. 

సమీక్షకులు యిచ్చే రేటింగు ఫలానాదానికి అనే విషయంపై స్పష్టత లేక చాలా గందరగోళం వుంది. నా వరకు నేను అది ఆ సినిమా బాగోగుల గురించి, సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం చెపుతుంది అనే అనుకుంటున్నాను. సినిమా ఆడుతుందో లేదో అది చెప్పదు, చెప్పలేదు అనుకుంటున్నాను. సమీక్షకులు అదే చెప్పగలిగితే, దర్శకనిర్మాతలు సినిమా తయారు కాగానే వీళ్లను కూర్చోబెట్టి ఆడుతుందో లేదో కనుక్కుని తగిన మార్పులు చేసుకునేవారు. బయ్యర్లు వీళ్లకే చూపించి, సినిమా కొనమంటారా, వద్దా అని అడిగి వుండేవారు. కానీ ఎక్కువ రేటింగు యిచ్చిన సినిమా ఆడుతుందని, తక్కువ యిస్తే ఆడదని అర్థమనీ కొందరైనా అనుకుంటారు. నన్ను, నా రచనలను తిట్టడానికి మెయిల్స్‌ రాసే కొందరు 'మీ వెబ్‌సైట్‌ వాళ్లు ఫలానా సినిమాకు యింతే రేటింగు యిచ్చారు, అయినా సూపర్‌గా ఆడింది, మీకు విశ్వసనీయత లేదు' అని మెయిల్స్‌ రాస్తారు.

అందువలన నా సలహా – సమీక్షకులు దేని గురించి రేటింగు యిస్తున్నారో స్పష్టంగా తెలియబరిస్తే యీ సందిగ్ధత ఉండదు. నిజానికి సినిమా బాగుండడానికీ సక్సెస్‌కూ సంబంధం లేదు. సక్సెస్‌కు అనేక కారణాలుంటాయి, పండగల్లో రిలీజు, తోటి సినిమాల పోటీ, హీరో విన్నింగ్‌ స్ట్రీక్‌, హాళ్ల అందుబాటు, ఓపెనింగ్స్‌ వగైరాలు దాని సక్సెస్‌ను ప్రభావితం చేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఆడవచ్చు, మరి కొన్ని వాటిల్లో ఆడకపోవచ్చు. సిటీలో ఆడవచ్చు, బి, సి సెంటర్లో ఆడకపోవచ్చు. ఆడినా దానిపై పెట్టిన పెట్టుబడికి సరిపడా ఆడకపోవచ్చు. ఏ సమీక్షకుడైనా యీ సినిమా ఆడదు అనే సాహసం చేస్తే అది దుస్సాహసమే. సినిమా నాకు నచ్చింది, నచ్చలేదు, దానికి కారణాలు యివీ అని చెప్పడమే అతని పని. అది కూడా చేయకూడదని హీరోలు, నిర్మాతలు అంటున్నారు. 

టీవీ చర్చలో ఒక నిర్మాత అంటున్నారు –  సినిమా పరిశ్రమ మేలు కోరేవారైతే వారం, పది రోజుల దాకా రివ్యూ రాయకూడదట. అంటే యీ లోపున వాళ్లు సక్సెస్‌మీట్‌లు అవి జరిపేసి, సినిమా అద్భుతం అని చెప్పేసి ప్రేక్షకులను మోసం చేసేద్దామనా? సినిమా రంగంలో మోసాలు విరివిగా జరుగుతాయి. దర్శకుడు నాకు కథ ఒకలా చెప్పి, చివరకి మరోలా తగలేశాడు అంటాడు హీరో. షూటింగులకు ఆలస్యంగా వచ్చి హీరో నన్ను మోసం చేశాడని నిర్మాత అంటాడు. పెట్టిన ఖర్చును పెంచి చెప్పి నిర్మాత నన్ను దగా చేశాడని బయ్యరు అంటాడు. ఇదంతా సినిమా ఫెయిలయిన ఆర్నెల్లకి చెప్తారు.

తర్వాతి సినిమా రిలీజయ్యేటప్పుడు గతంలో మేం ప్రేక్షకుల నాడిని పట్టుకోలేకపోయాం. ఆశించిన ఫలితం రాలేదు. అప్పుడు జరిగిన పొరపాట్లు దిద్దుకుని యీ సినిమా తీశాం అని అప్పుడు చెప్తారు. కానీ ప్రస్తుతం మాత్రం వీళ్లందరూ కలిసి ప్రేక్షకుణ్ని మోసం చేయడానికి తయారవుతారు. ఇంత అద్భుతంగా తయారవుతుందని మేము అనుకోలేదని నటీనటులు, టెక్నీషియన్లు యింటర్వ్యూలు యిచ్చి హైప్‌ పెంచుతారు. ప్రేక్షకుడు బోల్తా పడదామా వద్దా అని ఆలోచిస్తూ వుంటే సమీక్షకుడు మొదటి రోజే చూసి 'నేను యిలా అనుకున్నాను' అంటాడు. నమ్మినవాళ్లు నమ్ముతారు, లేనివాళ్లు లేదు.

ఆ నిర్మాత వాదాన్ని కొనసాగిస్తే 'పుస్తకాలు వెయ్యి కాపీలు ముద్రించాం, కనీసం 500 కాపీలు అమ్ముడుపోయేదాకా సమీక్షలు రాయవద్దు' అని రచయితలు, పబ్లిషర్లు కోరతారు. 'మా హోటల్లో వుండి వెళ్లేవాళ్లు ఏడాది తర్వాతే కామెంట్లు పెట్టాలి' అని హోటల్‌ వాళ్లు అడుగుతారు. 'మేం అమ్మిన టీవీ పాడైనా మా మార్చి టార్గెట్‌ రీచ్‌ అయ్యేదాకా కామెంటు చేయవద్దు' అని టీవీ కంపెనీ వాళ్లు అడుగుతారు. సినిమావాళ్లు సమాజంలో అన్ని వర్గాల గురించి తమకు తోచిన వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ వాళ్ల సినిమా మీద మాత్రం మనం చేయకూడదట. అలా చేస్తే సినీరంగానికి ద్రోహం చేసినట్లేట. సమీక్షకుడు ప్రేక్షకుల తరఫు మనిషి.

సినిమా రంగం కొమ్ము కాయడానికి పిఆర్‌ఓలు ఎలాగూ వున్నారు. స్వతంత్ర సమీక్షకులపై యిలా హుంకరిస్తే ఎలా? సినిమా బాగుందని సమీక్ష రాస్తే సంతోషించి, తమ యాడ్స్‌లో వేసుకుంటారు. బాగాలేదని రాస్తే హీరోలు, దర్శకులు, నిర్మాతలు కత్తి కట్టేస్తారు. ఎందుకంటే ప్రేక్షకులను ఏమార్చే వారి దారికి అడ్డు తగిలే దానయ్యలు వీళ్లు. 'ప్రేక్షకులు సమీక్షకుణ్ని పట్టించుకోరు' అని బింకాలు పలుకుతారు. అలాటప్పుడు యింత వర్రీ దేనికి? మీరూ పట్టించుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకం వుంటే వారాంతాల్లో, పండగ రోజుల్లో, అటూయిటూ పెద్దసినిమాలు లేనప్పుడు రిలీజ్‌ చేయడం దేనికి? పరీక్షలు, క్రికెట్‌ సీజన్లు రాకుండా చూసుకోవడం దేనికి? అంత పబ్లిసిటీ దేనికి? వందలాది సినిమా హాళ్లలో రోజుకి నాలుగేసి ఆటలతో విడుదల చేయడం దేనికి? మౌత్‌ టాక్‌ బయటకు పొక్కే లోపునే ఊళ్లో సగం మందిని ఏమార్చాలనా? అభిమానులను, వ్యతిరేకులనూ ఎవరూ ఏమీ చేయలేరు.

తటస్థులను సమీక్షలు కొంతమేరకు ప్రభావితం చేస్తాయి. ముందేమీ అనుకోకుండా యివాళ ఏ సినిమాకు వెళదామా అని ఆలోచించేవాడు సమీక్షలను సంప్రదించుకుని నిర్ణయం తీసుకుంటాడు. ఒక వెబ్‌సైట్‌ సమీక్షకుడు చెప్పారు – అమెరికాలో ఒక కుటుంబం వారాంతంలో సినిమాకి వెళ్లాలంటే 13 వేల రూ.లు ఖర్చవుతాయని. అంత పెట్టి వెళ్లేటప్పుడు, ఏ సినిమా బాగుందని రివ్యూ వచ్చిందో దానికే వెళదామని అనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? అతనికి సమీక్షకుడు సూచన కూడా యివ్వకూడదని ఆంక్షలు పెడితే ఎలా? 

కొంతమంది పాఠకులు విమర్శకుణ్ని ఛాలెంజ్‌ చేస్తారు – నువ్వో సినిమా తీసి చూపించు అని. ఇది అత్యంత పిచ్చి వాదన. హోటల్లో పెసరట్టు బాగా లేదని చెప్పడానికి వంట వచ్చి వుండాల్సిన పని లేదు. నువ్వు తెచ్చిన దోశ బాగాలేదని సర్వర్‌కు చెప్తే అతను 'అసలు దోశ ఏ పిండితో వేస్తారో తెలుసా మీకు?' అని అడిగితే చాచి లెంపకాయ కొట్టబుద్ధేస్తుంది. ఎవరి పని వారు చేయాలి. విమర్శ చేయడానికి నీకేం అర్హత ఉంది? అని కొందరు నిర్మాతలు సమీక్షకులను అడుగుతున్నారు. సినిమా తీయడానికి, దర్శకత్వం చేయడానికి, నటించడానికి నీకేం అర్హత ఉంది? అని వారడిగితే? ఎవరికైనా వినియోగదారుల ఆమోదమే ముఖ్యం.

ఎంత అగ్రశ్రేణి హీరో కొడుకైనా సరే, ఆ నటుణ్ని ఆమోదించవలసినది ప్రేక్షకులు. అలాగే ఎన్ని డాక్టరేట్లు ఉన్నా ఆ సమీక్షకుణ్ని ఆమోదించవలసినది పాఠకులు. సినిమా బాగుందని ప్రేక్షకులనుకుంటే యీ రేటింగులన్నీ గాలికి కొట్టుకుపోతాయి. నిజానికి సినిమా ఆడకపోతే దర్శకనిర్మాతలు, హీరోలు వారిని వారే నిందించుకోవాలి. సినిమా బాగోగుల గురించి ధైర్యంగా ఒప్పుకోవాలి. ''బుద్ధిమంతుడు'' రిలీజ్‌కు బాపు, రమణ విజయవాడ వెళ్లారు. పదివారాల రిపోర్టు వచ్చింది. మార్నింగ్‌ షో కలక్షన్లు తగ్గాయి. హాలు సగమే నిండింది. డిస్ట్రిబ్యూటర్‌ లక్ష్మీ ఫిలిమ్స్‌ మేనేజరు హోటల్‌కు వచ్చి సంజాయిషీ కమ్‌ ఓదార్పు కార్యక్రమం నిర్వహించారు. 'యు సీ.. టాక్‌ చాలా బాగుంది గానీ హౌస్‌ఫుల్‌ కాలేదు. సోమవారం మార్నింగ్‌ కదా, పైగా వానలు.

పొద్దున్న ఆడవాళ్లకు వంటలూ అవీ వుంటాయి కదా. పైగా శ్రావణమాసం పేరంటాలూ, స్కూళ్లూ..' అని చెప్పుకుపోతూండగానే బాపు హోటల్‌ గది కిటికీ తెరిచి పక్కనే వున్న లీలామహల్‌ సినిమాహాలులో ఆడుతున్న ''మనుషులు మారాలి'' సినిమా టిక్కెట్టుకై నిలిచి వున్న క్యూలు చూపించారు. జనాలు వానలో గొడుగులు పట్టుకుని ఉన్నారు. అత్యధికులు ఆడవాళ్లే. వీళ్ల సినిమాలో హీరో నాగేశ్వరరావుగారు. ఆ సినిమాలో హీరోయిన్‌ అప్పుడే పైకొస్తున్న శారద. బాపు కుండబద్దలు కొట్టారు – 'అక్కడి వాన యిక్కడా వుంది. అయినా జనం బాగా వచ్చారు. అక్కడ రాలేదు. సింపుల్‌. మనని మనం మోసం చేసుకోవడం మంచిది కాదు. లెటజ్‌ యాక్సెప్ట్‌ – మన పిక్చర్‌ మనం అనుకున్నంత హిట్టు కాదు' అని. 

హీరోలు తెరమీదే కాదు, బయటా ధీరోదాత్తులుగా వుండాలి. వాస్తవాలను ఆమోదించాలి. సోషల్‌ మీడియాను పట్టించుకోకూడదు, వాటికి బెదిరిపోకూడదు. ఇక పత్రికల, వెబ్‌సైట్‌ల సమీక్షకులను, ప్రేక్షకులను వేరు చేసి చూడకూడదు. రేటింగు తక్కువ వస్తే, ఓహో ఫలానా విమర్శకుడికి నచ్చలేదు కాబోలు అనుకోవాలి తప్ప దాని వలన సినిమా ఆడదని బెంబేలెత్తి పోకూడదు.  విమర్శకులకు ఎంత విలువ యివ్వాలో అంతే యివ్వాలి, ఎక్కువా వద్దు, తక్కువా వద్దు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]