జై లవకుశ, డీజే: ఈ రెండూ ఒకటేనా!

సక్సెస్ మీట్ అంటేనే ఓ సంబరం. తమ సినిమా చాలా బాగా ఆడుతోందని ఘనంగా చెప్పుకునే వేడుక. పనిలోపనిగా సినిమా ఇంకా బాగా ఆడడానికి చేసే ఓ ప్రయత్నం. కానీ ఈమధ్య సక్సెస్ మీట్…

సక్సెస్ మీట్ అంటేనే ఓ సంబరం. తమ సినిమా చాలా బాగా ఆడుతోందని ఘనంగా చెప్పుకునే వేడుక. పనిలోపనిగా సినిమా ఇంకా బాగా ఆడడానికి చేసే ఓ ప్రయత్నం. కానీ ఈమధ్య సక్సెస్ మీట్ లు కేవలం క్రిటిక్స్ ను ఆడిపోసుకునేందుకే పెడుతున్నట్టుంది. మొన్నటిమొన్న డీజే సక్సెస్ మీట్ లో ఏం జరిగిందో అంతాచూశాం. ఇప్పుడు జై లవకుశ సక్సెస్ మీట్ కూడా అదే దారిలో నడిచింది. 

దువ్వాడ జగన్నాథమ్ సినిమాను ఏకి పారేశారు క్రిటిక్స్. ఇదేం సినిమారా బాబు అంటూ రివ్యూల్లో ఉతికి ఆరేశారు. కానీ ఈ విమర్శలు మేకర్స్ కు నచ్చలేదు. సక్సెస్ మీట్ పెట్టి మరీ క్రిటిక్స్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఏకంగా క్లాస్ తీసుకుంటే.. హీరో బన్నీ ఎవరెన్ని విమర్శలు చేసినా మాకేం కాదన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే దారిని ఎంచుకోవడం బాధాకరం.

జై లవకుశ సినిమాను విమర్శించిన క్రిటిక్స్ ను దారినపోయే దానయ్యలుగా అభివర్ణించాడు ఎన్టీఆర్. తమ సినిమాను ఓ పేషెంట్ అనుకుంటే.. అది బతుకుతుందా లేదా అనే విషయాన్ని డాక్టర్లు (ప్రేక్షకులు) నిర్ణయిస్తారని.. కానీ దారినపోయేవాళ్లు (క్రిటిక్స్) మాత్రం పేషెంట్ చచ్చిపోయిందని ముందే చెప్పడం బాగాలేదని కామెంట్ చేశాడు ఎన్టీఆర్.

దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో పోలిస్తే జై లవకుశ చాలా బెటర్. ఎందుకంటే డీజేతో పోలిస్తే ఇందులో మంచి కంటెంట్ ఉంది. ఎన్టీఆర్ కష్టం కనిపిస్తుంది. అన్నింటికీ మించి డీజేతో కంపేర్ చేస్తే జై లవకుశ వసూళ్లలో జెన్యూనిటీ ఉంది. మరోవైపు సినిమాలో లోపాల్ని ఎత్తిచూపిన క్రిటిక్స్.. ఎన్టీఆర్ నటనను మాత్రం ఏకగ్రీవంగా మెచ్చుకున్నారు. అయినా ఇలా క్రిటిక్స్ పై నోరుపారేసుకోవడం.. ఎన్టీఆర్ తన హుందాతనాన్ని తానే తగ్గించుకున్నట్టయింది.