ఎవరైనా అమ్మాయిని ఎవరైనా వేధించారన్న వార్త రాగానే మన సమాజం మొదటగా సంధించే ప్రశ్నలు – 'అసలక్కడికి ఎందుకు వెళ్లింది? ఆ సమయంలో ఒంటరిగా తిరగమని ఎవరు చెప్పారు? ఏ రకమైన దుస్తులు వేసుకుంది?' ఇలాటివే. చండీగఢ్‌లో ఆగస్టు 4 అర్ధరాత్రి వేధింపుకు గురైన వర్ణికా కుండు రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లటం లేదు. తన సెడాన్ కారులో తనపాటికి తను వెళుతోంది. తెల్ల టాటా సఫారి కారులో వున్న యిద్దరు కుర్రవాళ్లు ఆమె కారును వెంటాడారు. ఆమె వేగంగా వెళ్లిపోకుండా కారును మాటిమాటికీ అడ్డం పెట్టారు. పాసింజరు సీటులో వున్నతను కారులోంచి దిగి, ఆమె కారు వద్దకు వచ్చి తలుపు తెరవడానికి ప్రయత్నాలు చేశాడు.
చుట్టూ జనం వున్నా ఖాతరు చేయలేదు. డోర్ లాక్ చేసి వుంది కాబట్టి ఆమె బతికిపోయింది. అయినా భయపడింది. తలితండ్రులకు ఫోన్ చేస్తే వెంటనే 100కు ఫోన్ చేయమన్నారు. చేసింది. కంట్రోలు రూములో వున్న కానిస్టేబులుకు 12.30కు ఫోన్ రాగానే రెండు పోలీసు వ్యానులు పంపాడు. కార్లు చండీగఢ్ హద్దులు దాటి హరియాణా హద్దుల్లోకి వెళుతూండగానే ఆకతాయిల కారును ఆపారు పోలీసులు. ఇద్దరూ తప్పతాగి వున్నారు. డ్రైవ్ చేస్తున్నవాడు నేనెవరో తెలుసా? అన్నాడు. తెలుసుకోవాలన్న కుతూహలం నాకేమీ లేదు అంటూ పోలీసులు వాళ్లను తీసుకెళ్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి రక్తం, మూత్రం శాంపుల్స్ యిమ్మనమన్నారు. కానీ వాళ్లిద్దరికీ చట్టం బాగా తెలుసు కాబట్టి యివ్వడానికి తిరస్కరించారు. ఇక చేసేదేం లేక తీసుకెళ్లి పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టారు.
ఆ 29 ఏళ్ల అమ్మాయి తండ్రి వీరేందర్ కుండు ఐఏఎస్ అధికారి. హరియాణా ప్రభుత్వంలో టూరిజం శాఖలో ఎడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఈమెకు సంగీతంలో వున్న అభిరుచి గమనించి, ఆ దిశగా ప్రోత్సహించాడు. ఆరేళ్లగా ఆ రంగంలో కృషి చేసి ఆమె డిజె (డిస్క్ జాకీ) అయి, చండీగఢ్, దిల్లీలో ప్రదర్శనలు యిస్తూ పేరు తెచ్చుకుంటోంది. షోలు యిచ్చి వస్తూంటుంది కాబట్టి కారులోనే తిరుగుతుంది. ఎందుకైనా మంచిదని కరాటే నేర్చుకుంది. అవేళ ఆమెను వెంటాడిన తాగుబోతు కుర్రవాళ్లకు ఆమె ఫలానా అని తెలిసి వుండదు. ఆమె ఒక ఆడపిల్ల, ఒంటరిగా వుంది.
అల్లరి పెట్టి, భయపెట్టి, తలుపు తెరిచి తీసుకుపోదామనుకున్నారు లాగుంది. పోలీసుల జోక్యంతో ఆమె బతికిపోయింది. ఇంటికి వచ్చాక ఆమె యీ సంఘటనను బయటపెట్టదలచింది. ఫేస్‌బుక్‌లో పెట్టింది. తండ్రి కూడా తన ఫేస్‌బుక్‌లో పెట్టాడు. అక్కణ్నుంచి 'శహభాష్, మంచి పని చేశావ్' అనే కామెంట్లు కురిశాయి. వాటితో బాటు వాళ్ల తండ్రికి ఫోన్ వచ్చింది – 'ఆ గొడవలో యిరుక్కున్న కుర్రవాడు ఎవరో తెలుసా? హరియాణా బిజెపి అధ్యక్షుడు సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలా. కారు కాస్త ముందుకు వచ్చి హరియాణా బోర్డరులోకి వచ్చేసి వుంటే పోలీసులు అతని జోలికి వచ్చేవారు కారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి పోలీసులు కస్టడీలోకి తీసుకోగలిగారు. మీ అమ్మాయికి చెప్పి ఫిర్యాదు వాపసు తీసుకోమను' అని. అయితే వీరేందర్ పట్టించుకోలేదు.
కస్టడీలోకి తీసుకున్నాక ఫలానా అని చండీగఢ్ పోలీసులకూ తెలిసింది. డ్రైవ్ చేస్తున్న 24 ఏళ్ల వికాస్ బరాలా లా విద్యార్థి. పక్కన కూర్చుని, రెండు మూడు సార్లు కిందకి దిగి వర్ణికా కారు తలుపు తీయడానికి ప్రయత్నించిన 26 ఏళ్ల వ్యక్తి అశీశ్ కుమార్ ఫరిదాబాద్‌లో లాయరు. పోలీసులు వాళ్లమీద డ్రంకెన్ డ్రైవింగ్, వెంటాడడం సెక్షన్లపై కేసులు పెట్టారు. గంటల్లో బెయిలు వచ్చేసింది. యువకులు బయటకు వచ్చేశారు. ఇక అప్పణ్నుంచి వర్ణికాపై సోషల్ మీడియాలో దాడి మొదలైంది. జస్టిస్ ఫర్ వికాస్ బరాలా పేర ఒక ఫేస్‌బుక్ పేజీ మొదలుపెట్టి వర్ణికాను నానా బూతులూ తిట్టసాగారు.
హరియాణా బిజెపి ఉపాధ్యక్షుడు రామవీర్ భట్టి 'అసలా టైములో అక్కడుండడం ఆమె తప్పు.' అని టీవీలో వ్యాఖ్యానించాడు. షైనా అనే బిజెపి అధికార ప్రతినిథి వర్ణికా ఫేస్‌బుక్‌లోకి వెళ్లి తన ఫ్రెండ్స్‌తో తీయించుకున్న పాత ఫోటో ఒకటి బయటకు తీసి 'దీనిలో ఉన్న అబ్బాయి వికాస్ బరాలాయే. అతనికీ, యీ అమ్మాయికి పాత కథ వుంది. దాని ఫలితమే యీ సంఘటన' అని వ్యాఖ్య రాసి దాన్ని మోదీకి, కోవింద్‌కు, హరియాణా ముఖ్యమంత్రి ఖట్టార్‌కు ట్యాగ్ చేసింది. 'ఆ ఫోటోలో వున్నది వికాస్ కాదు తల్లీ' అని తక్కినవాళ్లు తగులుకోవడంతో వెంటనే 'నా ఫేస్‌బుక్ ఎవరో హ్యేక్ చేశారు' అని తోక ముడిచింది. ఆగస్టు 8 న సుభాష్ బరాలా 'వర్ణికా నా కూతురు లాటిది, మా అబ్బాయిపై విచారణలో నేనేమీ కలగచేసుకోను. చట్టం తన పని తను చేసుకుపోతుంది.' అన్నాడు.
సిసిటివి ఫుటేజి చూస్తే వాస్తవాలు తెలిసిపోతాయి కదా అంది వర్ణికా. పోలీసులు ఫుటేజి లేదని మూణ్నాళ్లు బుకాయించి, ఆగస్టు 8న వుందని బయటపెట్టారు. దానిలో వర్ణికా కారును, వాళ్ల కారు వెంటాడడం స్పష్టంగా కనబడింది. ప్రజల గోల భరించలేక ఆగస్టు 9న యువకులపై బెయిల్ రాని కిడ్నాప్ సెక్షన్ కింద కూడా కేసు పెట్టారు. బెయిలు దొరకలేదు కూడా. ఇది చూసి కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో 'తాగి, అమ్మాయిని వేధించాడు. తప్పే. కానీ వాళ్ల మీద కిడ్నాప్ కేసు పెట్టడమేమిటి?' అంటూ ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో అంతా తమపై విరుచుకు పడడంతో ఆ కుర్రవాళ్లు మొదట ఆమె తనను అపార్థం చేసుకుందని బుకాయించారు.
తర్వాత 'సారీ, గల్తీ హోగయీ బెహన్‌జీ' అన్నారు. కానీ కోర్టులో మాత్రం తాము తప్పు చేయలేదని చెప్పుకున్నారు. లాయరు ఇదంతా తన క్లయింట్లపై ఒక ప్రణాళిక ప్రకారం పన్నిన పన్నాగం అని వాదిస్తున్నాడు. సంఘటన జరిగిన వారం తర్వాత చండీగఢ్‌లో 'మేరీ రాత్‌మేరీ సడక్' పేర జరిగిన ప్రదర్శనకు 500 మంది మహిళలు హాజరై మద్దతు తెలిపారు. నిందితులు బెయిలు అడుగుతున్నా కోర్టు యివ్వటం లేదు. కస్టడీ పెంచుతూ పోతోంది. సెషన్స్ కోర్టుకి వెళ్లినా అక్కడా అదే పరిస్థితి.
ఇదంతా చూసి హరియాణా ప్రభుత్వానికి మండినట్లుంది. వాళ్లకు దొరికినది పిల్ల తండ్రి. సెప్టెంబరు రెండవ వారంలో ఆయనను టూరిజం శాఖ నుంచి తక్కువ ప్రాధాన్యం వున్న సైన్సు అండ్ టెక్నాలజీ డిపార్టుమెంటుకి బదిలీ చేశారు. ఆయనతో పాటు మరో ఏడుగురిని కూడా బదిలీ చేశారు. మీడియా వెళ్లి అడిగితే ఆయన 'బదిలీ చేయడమనేది ప్రభుత్వం హక్కు. నాకేమీ యిబ్బంది లేదు.' అన్నాడంతే. కోర్టు బెయిలు తిరస్కరించిన కొన్ని గంటల్లోనే బదిలీ ఆదేశాలు రావడంతో రెండిటికి లింకు వుందనే భావం బలపడింది. ఈ కేసు పర్యవసానం ఏమిటో వేచి చూడాలి.(వర్ణికా కుండూ, తండ్రి వీరేందర్)
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]