బిగ్‌బాస్‌ లెక్కల వెనకున్న మర్మమేమిటి?

(ఈ ఆర్టికల్‌ చదివే వారికి ఒక మనవి. నేను బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లన్నీ (ఒక ఐదారు రోజులు తప్ప) చూశాను. అందువల్ల చూడకుండా ఈ ఆర్టికల్‌ రాశావు అనే ఆరోపణలు చేయవద్దు) Advertisement ‘బిగ్‌ బాస్‌…

(ఈ ఆర్టికల్‌ చదివే వారికి ఒక మనవి. నేను బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లన్నీ (ఒక ఐదారు రోజులు తప్ప) చూశాను. అందువల్ల చూడకుండా ఈ ఆర్టికల్‌ రాశావు అనే ఆరోపణలు చేయవద్దు)

‘బిగ్‌ బాస్‌ మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిలో మనుషులందరూ మన చుట్టు ఉన్నవారి వ్యక్తిత్వాలను ప్రతిఫలిస్తూ ఉంటారు..’ – హిందీ బిగ్‌బాస్‌ హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలివి. మన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ ఈ వ్యాఖ్యలు విన్నారో లేదో కానీ.. ఈ లోపులోనే తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 1 పూర్తయిపోయింది. విజేతగా శివ బాలాజీ నిలిచాడు. మా టీవీ టీఆర్‌పీలు బాగా పెరిగాయి. ప్రకటనలూ బానే వచ్చాయి. అక్కడివరకూ ఓకే.. కానీ బిగ్‌బాస్‌లో అంతా ఓకేనా? నాకైతే కాదు అనిపిస్తుంది.

ఆదివారం రాత్రి షో పూర్తయిన వెంటనే నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి. బహుశా ఇలాంటి ఆలోచనలే ఇంకా అనేక మందికి వచ్చి ఉంటాయి. అందుకే వీటి గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిలో మొదటిది– ఓట్ల గురించి. గత పది వారాల్లో ఈ షోలో కంటెస్టెంట్స్‌కు వచ్చిన మొత్తం ఓట్లు– దాదాపు 10 కోట్లపై మాటే. వీటిలో గత ఐదు వారాల్లో వచ్చిన ఓట్లే దాదాపు 5 కోట్లు దాటి ఉంటాయి. (ఇవి నా లెక్కలు కాదు. జూనియర్‌ షోను హోస్ట్‌ చేస్తూ చెప్పిన లెక్కలు). బిగ్‌బాస్‌ ప్రోగ్రాం రూల్స్‌ ప్రకారం– ప్రతి అకౌంట్‌ నుంచి ఎవరైనా 50ఓట్లు వేయవచ్చు.

ఈ లెక్కను చూసుకుంటే– గత ఐదు వారాల్లో దాదాపు 30లక్షల అకౌంట్ల నుంచి ఓట్లు పడి ఉండాలి. ఈ లెక్కలు నిజమేనా? ఈ షో మొదలైన తర్వాత – వచ్చిన ఓట్లను ప్రైస్‌వాటర్‌ కూపర్‌(పీడబ్ల్యుసీ) ద్వారా ఆడిటింగ్‌ చేయిస్తున్నామని జూనియర్‌ ప్రకటించాడు. ఆ తర్వాత పీడబ్ల్యుసీ ప్రస్తావన కానీ.. ఆడిటింగ్‌ ప్రస్తావన కానీ ఎక్కడా రాలేదు. అసలు ఈ షోలో ఎన్ని ఓట్లు పోలయ్యాయని ఎలా తెలుస్తుంది? ప్రస్తుతం జూనియర్‌ మాటలు నమ్మటం తప్ప వేరే అవకాశమే లేదు. సాధారణంగా పాశ్చాత్య దేశాల షోలలో – ఆడిటింగ్‌ సంస్థల ప్రతినిధులు కూడా కొన్ని సార్లు షోలలో పాల్గొని లెక్కలు చెబుతారు. కానీ మన దగ్గర ఆ సంప్రదాయం ఉన్నట్లు లేదు.

అందుకే పీడబ్ల్యుసీ ప్రతినిధులెవ్వరూ షోకి రాలేదు. అందుకే ఈ లెక్కల్లో ఎక్కడో తేడా ఉన్నట్లు అనిపించింది. ఒక వేళ ఈ లెక్కలు కరెక్ట్‌ అయితే– ఈ రెండు నెలల్లో కొన్ని లక్షల కొత్త ఈమెయిల్‌ అకౌంట్స్‌ ఓపెన్‌ అయి ఉండాలి (ఎందుకంటే ఒక మనిషి ఒక అకౌంట్‌ నుంచి 50ఓట్లు మాత్రమే వేయాలి. ఇంకో 50ఓట్లు వేయాలంటే ఇంకో అకౌంట్‌ కావాలి). గూగుల్‌, యాహువంటి సంస్థలు తమ వద్ద ఎంత మంది ఈమెయిల్‌ వినియోగదారులు ఉన్నారో చెబుతూ ఉంటాయి. ఈమెయిల్‌ కంపెనీలు ఎన్ని అకౌంట్లు కొత్తగా వచ్చి చేరాయో చెబితే అసలు రహస్యం తెలుస్తుందేమో.. పోనీ వాళ్ల చెప్పకపోతే పీడబ్ల్యుసీ వారైనా ముందుకు వచ్చి చెబితే కొంత బెటరేమో! 

సరే.. నువ్వు ప్రతి విషయాన్ని భూతద్ధంలో చూస్తున్నావు.. మా యంగ్‌ టైగర్‌ చెప్పాడు.. మేం నమ్మాం.. మధ్యలో నీకేంటి అనుంటున్నారా.. అయితే ఓకే. కానీ నాకు ఇంకా కొన్ని అనుమానాలు మిగిలున్నాయి. మూడు వారాల క్రితం టాప్‌ కంటెస్టెంట్‌గా హరితేజ ఉంది. (ఈ విషయాన్ని.. ఆమెకు వచ్చిన ఓట్లను స్టేజీ మీదే ప్రకటించారు). అందరి కన్నా చివరి స్థానాల్లో దీక్ష, ఆదర్శ్‌ ఉన్నారు. శివబాలాజీ వాళ్ల కన్నా కొద్దిగా బెటర్‌ పొజిషన్‌లో ఉన్నాడు. నవదీప్‌, ఆర్చన వాళ్ల కన్నా బెటర్‌గా ఉన్నారు. 

అలాంటిది– ఫైనల్‌ వీక్‌కు వచ్చేసరికి నవదీప్‌, అర్చన, హరితేజ అవుట్‌ అయిపోయారు. శివబాలాజీ, ఆదర్శ్‌ ఫైనలిస్ట్‌లుగా మిగిలారు. అంటే రెండు వారాల్లో ఓట్లలో ఎంత తేడా వచ్చిందంటే– ‘ఓడలు బళ్లయ్యాయి. బళ్లు ఓడలయ్యాయి’. అదృష్టం మీద ఆధారపడిన వ్యాపారాల్లో అలా జరిగిందంటే నమ్మగలమేమో కానీ ప్రజల ఓటింగ్‌లో అంత మార్పు వచ్చిందంటే నమ్మటం కష్టమే! అంతే కాకుండా గత ఐదు ఎపిసోడ్‌లలో దేనిలోను ఓటింగ్‌ ఆడిటింగ్‌ గురించి మాటలే లేవు.

ఇక కంటెస్ట్‌ట్స్‌ విషయానికి వద్దాం. ఈ షో అంతా ఎంసీపీ (మెల్‌ చెవునస్టిక్‌……)కి ప్రతిరూపంగా జరిగిందని నా ఉద్దేశం. మా బాలాజీ వంట చేశాడు కదా.. ఆదర్శ్‌ బాత్‌రూమ్‌లు కడిగాడు కదా.. అలాంటప్పుడు ఎంసీపీ ఎలా అంటావని మీలో కొందరు అడగచ్చు. దీనికి నేను చాలా ఉదాహరణలు చెప్పగలను. కొన్నింటి గురించి మాట్లాడుకుందాం. గత మూడు నాలుగు వారాలుగా– శివబాలాజీ, హరితేజల మధ్య ఏదో నడుస్తోందనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి.

నా ఉద్దేశంలో అవి హరితేజ విన్నింగ్‌ ఛాన్సస్‌ను దెబ్బతీశాయనుకుంటున్నా. నా ఉద్దేశంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో విన్నింగ్‌ ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నవి హరితేజాకే! అలాంటి హరితేజ వెనక్కి ఎందుకు వెళ్లిపోయింది? (ఓట్ల మేనిప్యూలేషన్‌ సంగతి పక్కన పెడితే) అనే విషయానికి సమాధానం లేదు. 

మన ప్రేక్షకుల దృష్టిలో– శివబాలజీ రోమాన్స్‌ చేస్తే తప్పు లేదు. హరితేజ దగ్గరే సమస్య వస్తుంది. ‘దీపక్‌ వచ్చినప్పుడు నీ మొహంలో ఆనందం కనబడలేదు..’ లాంటి మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రిన్స్‌ కారులో తనకు తన గర్ల్‌ ఫ్రెండ్‌కు జరిగిన వ్యవహారం చెబితే అందరూ సరదాగా నవ్వుకుంటారు. ముమైత్‌ తన 30వ పుట్టిన రోజుకు అమెరికాలో స్ట్రిప్పర్‌ను గిఫ్ట్‌గా తెచ్చుకున్నానని చెబితే– ఇబ్బందిగా మొహం పెడతారు.

ఇక శివబాలాజీకి పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అందరూ ఓట్లు వేశారని.. నవదీప్‌ ఆ విషయంలో వెనకబడ్డాడు కాబట్టి ఓడిపోయాడని.. లాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. పవన్‌ ఫ్యాన్స్‌కు నిజంగా అలా గెలిపించే శక్తి ఉంటే– 2019 ఎన్నికలు చాలా ఆసక్తిగా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం లేదు. వీటన్నింటి కన్నా నాకున్న బిగెస్ట్‌ ఆశ్చర్యం– ఆదర్శ్‌– రన్నరప్‌గా నిలవటం. బిగ్‌బాస్‌ హౌస్‌ ఈజ్‌ ఫుల్‌ ఆఫ్‌ సర్‌ప్రైజస్‌ కదా.. నా ఆశ్చర్యాలకు కూడా ఎవరైనా సమాధానం చెబితే బావుండును..

–భావన
-([email protected])