తొంభై కోట్ల రోబో 2.0

రోబో 2.0 మరో నాలుగు నెలల్లో విడుదలకు రెడీ అవుతోంది. కోట్ల ఖర్చుతో తయారవుతున్న సినిమా ఇది. త్రీడీ ఎపెక్ట్ తో, భారీ టెక్నాలజీ సన్నాహాలతో రెడీ చేస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల…

రోబో 2.0 మరో నాలుగు నెలల్లో విడుదలకు రెడీ అవుతోంది. కోట్ల ఖర్చుతో తయారవుతున్న సినిమా ఇది. త్రీడీ ఎపెక్ట్ తో, భారీ టెక్నాలజీ సన్నాహాలతో రెడీ చేస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు మాత్రమే భయంకరమైన రేటుకు ఆసియన్ సునీల్ కొనుగోలు చేసారు. ఈ సంగతి పాత వార్తే. అయితే ఆయన 70కోట్లకు కొన్నారని వార్తలు వచ్చాయి అప్పట్లో. కానీ అసలు వాస్తవం వేరు అన్నది ఇప్పుడు తెలుస్తోంది.

రోబో 2.0 ఉభయ తెలుగు రాష్ట్రాల హక్కులను 81కోట్లకు కొనుగోలు చేసారట. అసలు బేరం 108కోట్ల దగ్గర లైకా మూవీస్ ప్రారంభిస్తే, నాలుగు గంటల సేపు సాగిన డిస్కషన్ల తరువాత 81కోట్ల దగ్గర ఎం జి పద్దతిలో సెటిల్ అయింది. దీనికి ఖర్చులు అదనం. అంటే ఆసియన్ సునీల్ ఇప్పుడు రోబో సినిమా కోసం మొత్తం 85కోట్లకు పైగా ఖర్చుచేయాలి. 85కోట్లు రికవరీ అయిన తరువాత వచ్చిన షేర్ లో మళ్లీ లైకా మూవీస్ సగం వాటా ఇవ్వాలి. 

రజనీకాంత్ కు ఇటీవలి సంవత్సరాలలో హిట్ అన్నది లేదు. కానీ శంకర్ తో కాంబినేషన్, రోబో సిరీస్ కావడంతో ఆసియన్ సినిమాస్ ఇంతటి సాహసానికి దిగినట్లు తెలుస్తోంది. 85కోట్లు రావాలి అంటే జిఎస్ టీ తో కలిపి కనీసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 110కోట్ల వరకు వసూళ్లు సాగించాలి.

పైగా కొనుగోలు చేసింది కేవలం థియేటర్ రైట్స్ మాత్రమే. మరే విధమైన ఆదాయం వుండదు. మరి ఆసియన్ సినిమాస్ ధైర్యం ఏమిటో? బాహుబలి మాదిరిగా దీన్ని కూడా జనం విరగబడి చూస్తారని ఆశిస్తున్నారేమో? చూడాలి.